కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం చీమలకుంటపల్లెలో చొప్పరి లక్ష్మయ్య(45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
బెజ్జంకి : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం చీమలకుంటపల్లెలో చొప్పరి లక్ష్మయ్య(45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన చొప్పరి లక్ష్మయ్య అత్తగారి ఊరైన చీమలకుంటపల్లెలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లి ఇటీవలే గ్రామానికి వచ్చాడు. అనంతారంలో తనకున్న 3.20 ఎకరాలు భూమితో పాటు చీమటకుంటపల్లెలో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో పత్తి పంటను సాగు చేశాడు. పెట్టుబడి, ఇతర ఖర్చులతో కలిపి రూ.3లక్షల వరకు అప్పులు చేశాడు.
మళ్లీ పెట్టుబడి కోసం చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో బ్యాంకు రుణం కావాలని ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లోని బ్యాంకులను సంప్రదించాడు. బ్యాంకుల్లో అప్పు పుట్టకపోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య గురువారం ఉదయం ఇంటి నుంచి పాడి పశువును తీసుకుని పొలం వద్ద వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. అతనికి భార్య కనకవ్వ, కుమార్తెలు కవిత(19), నవీన(17) ఉన్నారు. పిల్లలు డిగ్రీ చదువుతున్నారు.