ఇక ఆన్లైన్లో రామయ్య సేవలు
లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేవస్థానంలోకి భక్తులను అనుమతించడం లేదు. భక్తులు లేనప్పుడు అన్నదానం నిర్వహించడం వల్ల సమస్యలు వస్తాయేమోనని దేవస్థానం అధికారులు నిత్యాన్నదానం కూడా నిలిపివేశారు. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు దేవస్థానం పరిసరాల్లోని నిరాశ్రయులకు, యాచకులను అన్నదానం నిర్వహిస్తున్నాయి. బుధవారం నుంచి కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న రోజువారీ కూలీలు, యాచకుల కోసం మధ్యాహ్నం అన్నదానం ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. రోజూ అన్నం, సాంబారు, పెరుగుతో 300 మందికి అన్నదానం చేయనున్నారు.
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారమచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో రామయ్య పూజలు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతరాయలంలోకి భక్తులెవరినీ అనుమతించడం లేదు. ఆర్జిత సేవలను, నిత్యకల్యాణాలను నిలిపివేశారు. దీంతో స్వామివారి ఆదాయానికి భారీగా గండి పడింది. స్వామివారికి నిత్య కైంకర్యాలు యథావిధిగా అర్చకులు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలు కూడా నిరాడంబరంగా జరిగాయి. ఈ యేడాది సుమారు రెండు కోట్ల రూపాయల అంచనాలతో శ్రీరామ నవమి పనులను ప్రారంభించారు. కానీ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. ముత్యాల తలంబ్రాల అమ్మకాలు కూడా లేకపోవడంతో ఆదాయం రాలేదు. ఈ నేపథ్యంలో నేరుగా భద్రాచలం రాలేని భక్తుల సౌకర్యం కోసం ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. భక్తులు ఆన్లైన్లో ఆయా సేవలను ఎంచుకుని, వారి గోత్ర నామాలు తెలిపినట్లయితే, వారి పేరున పూజలు జరిపి, మెసేజ్ రూపంలో వారికి తెలియపర్చుతామని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.