Bhagavadgeetha
-
గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు
బనశంకరి: మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మార్గదర్శనంలో అమెరికాలోని డల్లాస్‌లో 2,200 మందితో ఈనెల 13న సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించారు. 30కిపైగా దేశాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. 2,200 మందితో ఒకేసారి సామూహిక భగవద్గీత పారాయణం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. సనాతన ధర్మం, విశిష్ట సందేహాలు, విలువలను జీవితంలో అలవరచుకునే దృష్టితో సామూహిక భగవద్గీత పారాయణ పఠనం చేపట్టగా గిన్నిస్ రికార్డును సృష్టించింది. (చదవండి: ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన) -
కోల్‌కతా వ్యక్తికి షాకిచ్చిన అమెజాన్
కోల్‌కతా: ఆన్లైన్లో కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో బుక్ చేసిన వ్యక్తికి.. భగవద్గీత రావడంతో షాక్ తిన్నాడు. కోల్‌కతాకు చెందిన సుతీర్థో దాస్ అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘గత బుధవారం అమెజాన్‌లో కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టోపై మంచి డిస్కౌంట్ ఉంది. రూ.90 విలువైన పుస్తకం డిస్కౌంట్ తర్వాత 50 రూపాయలకు లభిస్తుంది. డెలివరీ చార్జెస్ కలుపుకుని రూ.140కు దొరుకుతుంది. దాంతో ఆ బుక్‌ను ఆర్డర్ చేశాను. ఈ నెల 12,13న బుక్ డెలివరీ చేస్తామని మెసేజ్ వచ్చింది. శనివారం(జూన్ 13) నాడు మధ్యాహ్నం 2 గంటలకు నేను అమెజాన్‌లో ఆర్డర్ చేసిన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో పుస్తకం ఇంటికి వచ్చినట్లు నా కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్లి పార్సల్ తెరచి షాక్ అయ్యాను. ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో ఆర్డర్ చేస్తే.. నాకు భగవద్గీతను డెలివరీ చేశారు. పార్సిల్ పైన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో అని రాసి ఉండటం గమనార్హం’ అంటూ తన అనుభవాన్ని ఫేస్బుక్లో షేర్ చేశారు. దీనిపై చాలా మంది నెటిజనులు స్పందించారు. తమకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని తెలిపారు. -
పుణ్యాత్ముల ప్రభావం
ధర్మరాజు శాంత మూర్తి. ధర్మానికి కట్టు బడినవాడు. నెమ్మదితనం ఉన్నవాడు. ఆయన ఉన్న పరిసరాలన్నీ శాంతితో నిండిపోయేవి. మహా భారత యుద్ధానంతరం స్వర్గారోహణం చేస్తూ ధర్మరాజు వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో నరకం పక్కగుండా ఆయన నడుస్తున్నాడు. నరకం చాలా దారుణంగా వుంది. చూడడానికి భయోత్పాతంగా ఉంది. పాపులని చిత్ర హింసలు పెట్టడం, నూనెలో కాల్చడం, మంటల్లో వేయడం వంటి అనేక కఠిన శిక్షలతో నిండి ఉంది. దాంతో నరకంలో భరించలేని వేడి. ధర్మరాజు నరకం పక్కనుండి వెళుతూ ఉంటే ఆయన శరీరంలో నుంచి ఆ చలువదనం ప్రసరించి నరకలోకమంతటా పిల్లగాలి వీచింది. ఆ వాతావరణంలోని ఆహ్లాదాన్ని పాపులందరూ అనుభవించారు. ఎందుకిలా జరిగిందని చూస్తే పక్కగా ధర్మరాజు వెళుతున్నాడు. దాంతో నరక వాసులందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. ‘‘స్వామీ! మీరు అడుగుపెడితేనే మేము ఇంత హాయిని పొందాము. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ పరిసరాలన్నీ నిండిపోయాయి. దయచేసి మీరు కొంతకాలం ఇక్కడ ఉంటే మేము ఎంతో ప్రశాంతతని అనుభవిస్తాము స్వామీ! అనుక్షణం. చిత్రహింసలను అనుభవించే మమ్మల్ని మీరు కరుణించి ఇక్కడ ఉంటే మా పాపాల కు విముక్తి కూడా కలుగుతుంది’’ అని వేడుకొన్నారు. ధర్మరాజు చిరునవ్వుతో వారి ప్రార్థన మన్నించి అక్కడ కొంతకాలం ఉండటానికి అంగీకరించాడు. కానీ ఆయన అలా అక్కడ ఉంటే ఇంక స్వర్గానికి, నరకానికి తేడా వుండదు. పాపులకు శిక్ష ఉండదు. ధర్మరాజు వల్ల ధర్మమే తల కిందులయ్యే ప్రమాదం ఏర్పడింది. ఎంతకాలానికీ ఆయన రాకపోయేసరికి దేవదూతలు అక్కడకి వచ్చారు. ‘‘ధర్మరాజా! మీరు ఇక బయల్దేరండి, మనం స్వర్గానికి వెళదాం’’ అన్నారు. అప్పుడు ధర్మరాజు ‘‘నేను ఇక స్వర్గంలో అడుగు పెట్టలేను. నేను చేసిన పుణ్యమంతా ఈ నరకవాసులకి ధారపోశాను కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను’’ అన్నాడు. దేవదూతలు ‘‘ధర్మరాజా! మీరు కడు పుణ్యాత్ములు, ధర్మాత్ములు. మీరెంత పుణ్యం ధారపోసినా అది తరిగేది కాదు. ఇచ్చే కొద్దీ పెరిగేది. మీ దయవల్ల ఈ నరక వాసులు కొంతకాలం పాటు ప్రశాంతత పొందారు. ఇక చాలు. దయచేసి మీరు బయల్దేరండి’’ అన్నారు. ధర్మరాజు సెలవు తీసుకుని స్వర్గయాత్రకు వెళ్ళాడు. సృష్టికి విరుద్ధంగా ఏ పనీ చెయ్యకూడదు. కానీ కొంత తను చెయ్య గలిగినది చేశాను’’ అని తృప్తి పడ్డాడు ధర్మరాజు. ఉత్తములు ఎక్కడుంటే అక్కడ ఉల్లాస భరిత వాతావరణం ఉంటుంది. సాధుస్వభావులు ఉన్న చోట శాంతం మూర్తీభవిస్తుంది. ఆ పరిసరాలూ ప్రశాంతంగా వుంటాయి. పూవుల పరిమళం పూలచుట్టూనే వున్నట్లుగా మనిషి తత్వం అతన్ని చుట్టి వుంటుంది. అతనితోబాటే సాగుతుంది. మహానుభావుల పాద ధూళి కూడా పవిత్రమైనదే. కనుక అలాంటివారికోసం ఎదురు చూస్తుండాలి.–డి.వి.ఆర్. -
జగదాచార్యునికి వందనమ్
వసుదేవుని సుతుడు, కంసచాణూరులను మర్దించినవాడు, దేవకీదేవికి పరమానందం కలిగించినవాడు, జగద్గురువు అయిన శ్రీకృష్ణునికి వందనం.ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను వెంటబెట్టుకుని, అంపశయ్య మీద ఉన్న భీష్మపితామహుడిని దర్శించి, ‘తాతా! నీ మనుమలకు ధర్మబోధ చెయ్యి’ అన్నాడు. శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతో భీష్మపితామహుడు, ‘జగన్నాటక సూత్రధారీ! చతుర్దశ భువనాలనూ సృష్టించి, పోషించి, లయం చేసే పరాత్పరుడవు, జగదాచార్యుడవు. నీ సమక్షంలో నేను పాఠం చెప్పడమంటే, గురువుగారి సమక్షంలో శిష్యుడు పాఠం చెప్పినట్లుంటుందయ్యా’ అన్నాడు. అలా భీష్ముడంతటి వాడు స్వయంగా శ్రీకృష్ణుడిని ‘జగదాచార్యా!’ అని సంబోధించాడు. (ఉషశ్రీ భారతం నుంచి) జగద్గురువు, జగదోద్ధారకుడు, జగదాచార్యుడు, గీతాచార్యుడు... ఎన్ని నామాలతో స్మరించినా తనివి తీరదు. దశావతారాలలో శ్రీకృష్ణుడిని మాత్రమే సంపూర్ణావతారంగా, మిగిలిన అవతారాలను అంశావతారాలుగా వివరించారు. కృష్ణస్తు భగవాన్ స్వయమ్... కృష్ణుడు స్వయంగా భగవంతుడు... అని శ్రీకృష్ణుని స్తుతించారు. కురుక్షేత్ర యుద్ధం కురుపాండవుల మధ్య జరిగింది. ఆవలి పక్షంలో ఉన్న కురు, గురు వృద్ధులను చూసిన అర్జునుడికి వైరాగ్యంతో చేతిలో గాండీవం జారిపోతోంది, నన్ను పెంచి పెద్ద చేసిన తాతలను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సంహరించలేను, నేను యుద్ధం చేయలేను’ అన్నాడు. నవ్వురాజిల్లెడు మోముతో శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీత ప్రబోధించాడు. అర్జునుడు కర్తవ్యం తెలుసుకున్నాడు. చేసేవాడు, చేయించేవాడు అన్నీ ఆ పరమాత్ముడేనని అవగతం చేసుకున్నాడు. అంతే! గాండీవం అందుకున్నాడు. శత్రు సంహారం చేశాడు. లోకాలకు శాంతి చేకూర్చాడు. ఇదంతా అర్జునుడు చేసినది కాదు. జగద్గురువు శ్రీకృష్ణుడు నడిపించాడు. సాక్షాత్తూ పరమాత్ముడు భగవంతుడై, భగవంతుడు శ్రీకృష్ణుడై మానవజాతి సంక్షేమానికి ఉపకరించేలా సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను ‘భగవద్గీత’ గా అందించి జగద్గురువయ్యాడు. శ్రీకృష్ణుని పేరులోనే ఆకర్షణ ఉంది. కర్షతి ఇతి కృష్ణ... ఆకర్షించేవాడని అర్థం. శ్రీకృష్ణునిలాగే, భగవద్గీత కూడా అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది. మానవజాతిని శాసిస్తూనే ఉంటుంది. ఆ శాసనాన్ని భగవంతుడు తియ్యగా గానం చేశాడు. కఠినమైన పాఠాన్ని శిష్యులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పగలిగాడు. గురువులకే గురువైన శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. మానవజాతికి మానవ ధర్మాలను బోధించిన సరళమైన సమగ్ర గ్రంథం. భక్తి జ్ఞాన వైరాగ్యాలను, వ్యక్తిత్వ వికాసానికి కావలసిన ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, కార్యశీలతను కేవలం 700 శ్లోకాలలో చెప్పాడు. కాల ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఎక్కడైనా పనికొచ్చేలా మార్గనిర్దేశం చేశాడు. శ్రీకృష్ణుడు బోధించిన అంశాలు సర్వకాల సర్వావస్థలలో సర్వ మానవాళికీ ఆచరణయోగ్యంగా ఉంటాయి కనుకనే ఆయన జగద్గురువయ్యాడు. ‘మానవజాతికి పిరికితనం పనికిరాదు. హృదయ దౌర్బల్యాల వల్ల ఏమీ సాధించలేం’ అని ఉపదేశించాడు. ఒక పని చేసేటప్పుడు ఆందోళన పడకుండా, ఫలితం కోసం ఆశపడకుండా, పనిని శ్రద్ధగా ఆచరిస్తే సత్ఫలితాలొస్తాయని చెబుతూ, ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన...’ అన్నాడు. ‘‘మనసులో చెలరేగే కోరికలను అక్కడే అణగదొక్కి ఆత్మయందే అన్నిటినీ అనుభవించగలవాడు స్థితప్రజ్ఞుడు. క్లేశాలకు కుంగడు, సుఖాలు మీదపడినా లొంగడు. భయం, క్రోధం, రాగం అనేవాటిని దరిచేరనివ్వడు’’ అన్నాడు. అత్యాశతో సమాజాన్ని పీడించకుండా, సుఖదుఃఖాలను సమానంగా భావించాలి... అంటూ అన్ని మతాలు, అన్నిప్రాంతాల వారికి సందేశం ఇచ్చాడు. అందువల్లే ఆయన జగద్గురువయ్యాడు. లోకంలో జనసామాన్యం తమ కంటె ఉత్తములైన వారినే అనుసరిస్తారు. ముల్లోకాలలో చెయ్యవలసింది యేదీ లేకపోయినా, వాంఛించేది లేకపోయినా జ్ఞానులు నిరంతరం కర్మ చేస్తూనే ఉండాలి. కర్తవ్యం నిర్వర్తించకపోతే సోమరులవుతారు. దానివల్ల లోకనాశం తప్పదు. జ్ఞానులు కర్మ చేస్తూ అజ్ఞానులకు మార్గదర్శకులు కావాలని బోధించి జగద్గురువయ్యాడు.జ్ఞానబోధ చేస్తూ, ‘‘ఎన్ని పాపాలనైనా జ్ఞానం నశింపచేస్తుంది. పాపనాశన విధానం తెలుసుకోవడం కోసమే గురు శుశ్రూష చేయాలి’’ అని గురువు ఔన్నత్యాన్ని బోధించి జగద్గురువయ్యాడు. ఒక్క భగవద్గీత చేత పట్టుకుని స్వామి వివేకానంద ప్రపంచమంతా పర్యటించాడు. విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్యం స్థాపించాడు.యశోదా నందనుడైన చిన్ని శిశువుకి, దేవకీ సుతుడైన జగద్గురువుకి వందనమ్!!!– డా. పురాణపండ వైజయంతి గురువంటే... గురువు త్రిమూర్త్యాత్మకంగా ఉండాలి. శిష్యులలోని అజ్ఞానాన్ని పోగొట్టి, నడిపించే శక్తి కలిగి ఉన్నవాడు గురువు. అజ్ఞానమనే చీకటిని పారద్రోలగలిగేవాడు గురువు అని శాస్త్రం చెబుతోంది. తన సందేశం ద్వారా మొత్తం ప్రపంచాన్ని నడిపించగలిగినవాడిని జగద్గురువు అంటారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతతో ఆయన జగద్గురువయ్యాడు.– డా. పాలపర్తిశ్యామలానందప్రసాద్ భగవద్గీతలోని కొన్ని శ్లోకాల అర్థాలు... ∙కర్మ చెయ్యని వాని కంటె కర్మ చేసే వాడే ఉత్తముడు ∙జ్ఞానికి ఈ లోకంలో భేద దృష్టి లేదు. విద్యతో వినయ సంపత్తితో భూషితుడై విద్వాంసుడు ఎలా కనిపిస్తాడో అలానే ఆవునీ, ఏనుగునీ, కుక్కనీ, కుక్క మాంసం తినేవానినీ చూస్తాడు ∙దొరికిన దానితో తృప్తిగా జీవిస్తూ జీవయాత్ర నడుపుతూ, నిందలకు కుంగకుండా, పొగడ్తలకు గర్వపడకుండా స్థిరచిత్తంతో ఉండేవాడు ప్రీతి కలిగించే భక్తుడు ∙ఆత్మస్తుతి, ఆడంబరం, హింస దరి చేరరాదు. ఓరిమి, సౌమ్య స్వభావం, సద్గురుసేవ, శుచి, నిగ్రహం, విరాగం అవసరం ∙కామక్రోధలోభాలు మూడూ నరక ద్వారాలే. అందుకే వీటిని జయించాలి. అప్పుడు శ్రేయోమార్గం ప్రాప్తిస్తుంది ∙కర్మలన్నిటిలోనూ దోషం ఉన్నది. పొగ లేని నిప్పు ఉండదు. పొగను చూసి దూరం పోతే అగ్ని లభించదు కదా. -
భగవద్గీత 90 శాతం చదివా : హాలీవుడ్ హీరో
హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ ముంబైలో సందడి చేస్తున్నారు. తను హీరోగా నటించిన బ్రైట్ సినిమా డిసెంబర్ 22న భారత్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విల్ స్మిత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్ తో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో తనకున్న స్నేహం గురించి వెల్లడించారు. తనకు అక్షయ్ కుమార్ తో సమయం గడపటం చాలా ఇష్టమన్న విల్ స్మిత్, భారత్ లో తనకు నచ్చిన విషయం అక్షయ్ ఇంట్లో భోజనమే అన్నారు. భారతీయ చరిత్ర అంటే తనకు చాలా ఇష్టమని.. భగవద్గీతను 90 శాతం చదివానని తెలిపారు. త్వరలో రిషికేశ్ కు వెళ్లనున్నట్టుగా తెలిపారు విల్ స్మిత్. స్మిత్ తో పాటు మరో హాలీవుడ్ నటుడు జోయెల్ ఎడ్‌గార్టెన్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
ఇస్కాన్‌లో ‘భగవద్గీత’పై శిక్షణ శిబిరం
హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయం ఈతరం పిల్లలకు తెలియజెప్పి.. వారిలోని సృజనాత్మతను వెలికి తీసేందుకు ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా వేసవి శిక్షణ శిబిరం’ నిర్వహిస్తున్నట్టు కూకట్పల్లి ఇస్కాన్ సెంటర్ డెరైక్టర్ మహా శృంగదాస తెలిపారు. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు కూకట్‌పల్లిలోని ఇస్కాన్ సెంటర్లో శిక్షణ ఉంటుందన్నారు. ప్రస్తుత యువత ఎక్కువ సమయం టీవీలు, కంప్యూటర్‌తో గడుపుతున్నారని, ఈ ధోరణి మానసిక, భౌతిక రుగ్మతలకు కారణమవుతుందన్నారు. ఈ శిబిరంలో సంస్కృత శ్లోక పఠనం, వైదిక కథలు, డ్రామాలు, డాన్స్, ఆటలతో పాటు ఎగ్ రహిత కేకులు, బిస్కెట్స్, కుకీన్ లాంటివి తయారీ నేర్పుతామన్నారు. శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నట్టు చెప్పారు. వివరాలకు 8008924201, 9866340588 నంబర్లలో సంప్రదించాలని కోరారు.