చాలా రోజుల తరువాత..!
‘ఆవకాయ్ బిర్యానీ’, ‘పిల్ల జమీందార్’ చిత్రాల ఫేం బిందు మాధవి గుర్తున్నారా? చాలా కాలంగా ఆమె ఏ తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు. ఎందుకంటే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారామె. అక్కడ ఆమె కథానాయికగా నటించిన ‘దేశింగు రాజా’ చిత్రాన్ని ‘భల్లాల దేవ’ పేరుతో రావిపాటి సత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. ఎళిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విమల్ హీరో. నిర్మాత మాట్లాడుతూ- ‘‘బిందు మాధవి నటన, గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయి. పూర్తి వినోదభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది.
ఈ నెలాఖరున లేదా సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, మాటలు: కృష్ణతేజ.