bham bolenath
-
తెలుగు నచ్చేసింది
తెలుగు తెరపై మెరిసిన మరో కొత్తందం పూజా జవేరి. ఇటీవల విడుదలైన ‘భమ్ బోలేనాథ్’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ గుజరాతీ భామ తనకు తెలుగు భాష నచ్చిందంటున్నారు. అందుకే ప్రస్తుతం తన దృష్టి అంతా తెలుగు చిత్రాలపైనే అని పూజా చెబుతూ - ‘‘నేను పుట్టింది గుజరాత్లో. పెరిగింది ముంబయ్‌లో. గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేశా. చిన్నప్పట్నుంచీ నటనంటే ఇష్టం. కథానాయికగా ట్రై చేద్దామనుకుంటున్న తరుణంలో ‘భమ్ బోలేనాథ్’ గురించి తెలిసి, నా అంతట నేనే సంప్రదించా. నా ఆరాధ్య నటి మాధురీ దీక్షిత్. ఆమె నటనను ఆదర్శంగా తీసుకుని, నాదైన శైలిలో నటించాను. కథ డిమాండ్ మేరకు గ్లామరస్, హోమ్లీ ఏ తరహా పాత్రలైనా చేస్తా. భవిష్యత్తులో దర్శకురాలిగా మారాలన్న ఆలోచన కూడా ఉంది’’ అన్నారు. -
మరింత పేరు తెచ్చుకుంటా..!
‘‘ఇప్పటి వరకూ నా స్థాయిలో నేను రాణిస్తున్నాననే అనుకుంటున్నా. అయితే ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం దక్కలేదనే వెలితి మాత్రం ఉంది. నా దగ్గరకు వచ్చినవాటిల్లో ఉత్తమమైనవే ఎంచుకుంటున్నా. భవిష్యత్తులో మరింత పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అని నవదీప్ చెప్పారు. ఆయన హీరోగా కార్తీక్‌వర్మ దర్శకత్వంలో రాజేశ్‌వర్మ నిర్మించిన ‘భమ్ బోలేనాథ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ -‘‘భమ్ బోలేనాథ్’లో మూడు కథలుంటాయి. ఒకదానికొకటి సంబంధం లేనట్టు సాగినా ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాయి. ఆఖరుకు ఏం జరిగిందనేది ఆసక్తికరం. క్లైమాక్స్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన ఆంశాన్ని హాస్యభరితంగా నడిపించాం. తెలుగు సినిమాకు ఇది కొత్త తరహా క్లైమాక్స్ అవుతుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ మీదే ఉందనీ, పెళ్లి గురించి ఇంకా ఆలోచించడం లేదనీ నవదీప్ పేర్కొన్నారు. తెలుగులో మూడు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
'నాకు బ్రెడ్ అండ్ బటర్ బుల్లితెరే...'
తూర్పుగానుగూడెం : (రాజానగరం) : సినిమాల్లో అవకాశాలు ఎన్ని వచ్చినా టీవీ రంగాన్ని వదిలేది మాత్రం లేదని టీవీ, సినీ కళాకారుడు ప్రదీప్ అన్నారు. ‘భమ్ బోలేనాథ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా తూర్పుగానుగూడెంలోని ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం రాత్రి జరిగిన ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు. దర్శకుడు కార్తీక్‌వర్మ చెప్పిన కథ కొత్తగా ఉందని, సరదాగా ఉందని, అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పారు. తనకు బ్రెడ్ అండ్ బటర్... టీవీ రంగమేనన్నారు. ఇంతవరకూ చాల తక్కువ సినిమాలు చేశానన్నారు. 2015 తనకు స్పెషల్‌గా ఉందని, ఈ సంవత్సరంలోనే సొంత ప్రొడక్షన్‌పై ‘కొంచెం టచ్‌లో ఉంటే చెపుతాను’ టీవీ షో చేస్తున్నానని అన్నారు. స్టార్ హీరోలను కూడా ప్రొడక్షన్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఇంతవరకూ సమంత, తమన్నా వచ్చారని, బన్నీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు. వారు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడరని, ఆ అవకాశం ఇందులో ఉంటుంది కాబట్టి వారు కూడా ఇష్టపడుతున్నారని అన్నారు. ఈ షోను ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్నపాటి పాత్రలు చేసినా అవి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం కోసమేన న్నారు. కాగా జనాన్ని ఆహ్లాదపరచడం కోసం ఎటువంటి పాత్రనైనా చేస్తానన్నారు. రాజమండ్రి రావడం ఇష్టంగా ఉందని, అమ్మ నాన్న ఇక్కడ నుంచి వచ్చారని అన్నారు. హైదరాబాద్‌లో సెటిలయ్యామని, వివాహం చేసుకోవాల్సిందిగా తనను తన తల్లి ఒత్తిడి చేస్తున్నారన్నారు. -
ఒకే లక్ష్యం కోసం ఆ ముగ్గురు...
‘‘ఒకే లక్ష్యం కోసం ముగ్గురు వ్యక్తులు చేసే పోరాటమే ఈ చిత్రం’’ అంటున్నారు కార్తీక్ వర్మ దండు. ఆయన దర్శకత్వంలో నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేశ్‌వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ‘‘కొత్త పంథాలో తెరకెక్కిన ఈ సినిమా రెండు గంటల సేపు అన్ని వర్గాల వారికీ కడుపుబ్బా నవ్వులు పంచుతుంది’’ అని ఈ సందర్భంగా నిర్మాత అన్నారు. ప్రాచీ, శ్రేయ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, నవీన్, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: భరణి కె ధరణ్, సహనిర్మాతలు: పెన్మెత్స రఘు, కాకర్లపూడి రామకృష్ణ. -
డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో...
‘‘వైవిధ్యమైన కథతో, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తీశాం. ఆ మధ్య మా ‘కార్తికేయ’ లానే కచ్చితంగా ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత శిరువూరి రాజేష్ అన్నారు. కార్తీక్ వర్మ దర్శకత్వంలో నవదీప్, నవీన్‌చంద్ర, పూజ హీరో హీరోయిన్లుగా వస్తున్న ‘భమ్ భోలేనాథ్ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, ‘‘చాలా విభిన్నమైన కథాంశంతో సినిమా తీశాం’’ అని చెప్పారు. ప్రచారచిత్రాలకు మంచి స్పందన వచ్చిందని హీరో నవదీప్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సమర్పణ: రఘు పెన్మెత్స, శ్రీకాంత్ దంతులూరి. -
విభిన్న కథనంతో...
నవదీప్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. కార్తీక్‌వర్మ దండు దర్శకుడు. శిరువూరి రాజేశ్‌వర్మ నిర్మాత. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ్ ఆడియో సీడీని ఆవిష్కరించగా, ప్రచార చిత్రాలను నిఖిల్, సందీప్‌కిషన్, ప్రిన్స్, చందు మొండేటి, సుధీరవర్మ కలిసి విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన నాని, వరుణ్‌సందేశ్, శశాంక్, కమల్ కామరాజ్, కిరణ్, మధుశాలిని, పూజా జవేరి, ప్రాచీ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కథపై నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు కృతజ్ఞతలని దర్శకుడు అన్నారు. టికెట్‌కి పూర్తి న్యాయం చేసే సినిమా ఇదని నిర్మాత చెప్పారు. విభిన్నమైన కథనంతో కార్తీక్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారని నవీన్‌చంద్ర అన్నారు. సంగీతానికి ఆస్కారమున్న సినిమా ఇదని సంగీత దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మట్లాడారు. -
మూడు జంటల కథ
క్రైమ్, కామెడీ నేపథ్యంలో నవదీప్, నవీన్‌చంద్ర, పూజ, ప్రాచీ, శ్రేయ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను నవదీప్, నవీన్‌చంద్ర హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘విభిన్నమైన స్క్రీన్‌ప్లే, ఆసక్తికరమైన క్లయిమాక్స్‌తో సాగే చిత్రం ఇది’’ అని ఈ సందర్భంగా నవదీప్ అన్నారు. ఎంతో ఇష్టంగా చేసిన చిత్రమిదని నవీన్‌చంద్ర చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మూడు జంటల మధ్య సాగే కథ ఇది. క్రైమ్, కామెడీ ప్రధానాంశాలు. ఈ నెల 28న పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్, థ్రిల్లర్స్‌కు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సినిమా కొత్తగా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే.. మరిన్ని కొత్త చిత్రాలు వస్తాయి’’ అన్నారు.