Bharathi Cement Corporation Private Limited
-
భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు ఏపీకి భారీ విరాళాలు ప్రకటించగా..తాజగా భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) తనవంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే భారతి సిమెంట్స్ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. వర్షిని చారిటబుల్ ట్రస్ట్ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది. కాగా, రాష్ట్రలో గురువారం ఉదయం 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132 కి చేరాయి. (చదవండి: సీఎంఆర్ఎఫ్కు విరాళాల వెల్లువ) -
రాజీలేని నాణ్యత వల్లే ఈ స్థాయి
నల్లలింగాయపల్లె (కమలాపురం): వినియోగదారుల ఆశీర్వాదాలే వ్యాపారానికి పునాదులని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) ఛైర్ పర్సన్ వైఎస్ భారతి రెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లెలో బీసీసీపీఎల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీసీపీఎల్ భాగస్వామ్య సంస్థ వికా (ఫ్రాన్స్) అధిపతి గై సిడోస్, సోఫి సిడోస్ దంపతులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తన మామయ్య స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా ప్రజలకు ఉపాధి చూపడంతో పాటు నిర్మాణ రంగంలో నాణ్యమైన సిమెంట్ అందించాలని సూచించారని, దీంతో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని చెప్పారు. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ నాణ్యతకు అగ్రాసనం వేస్తున్నామని చెప్పారు. రోబోటిక్ క్వాలిటీ, జర్మన్ టెక్నాలజీ, టెంపరింగ్ ప్యాకింగ్‌తో అందిస్తున్న నాణ్యమైన సిమెంట్‌ను వినియోగిస్తున్న వారి ఆశీర్వాదాలే కంపెనీకి పునాదులన్నారు. దక్షిణ భారత దేశంతో పాటు పలు ప్రాంతాల్లో భారతి సిమెంట్ వినియోగం బాగుందని, దేశంలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమ డైరెక్టర్లతో పాటు కార్మికులు, ఉద్యోగులు, మార్కెటింగ్ సిబ్బందిని ప్రశంసించారు. తమ కంపెనీలో 200 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్రాన్స్‌కు చెందిన వికా భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. వికా అధినేత గై సిడోస్ మాట్లాడుతూ 1817 నుం చి తమ వంశం సిమెంట్ పరిశ్రమలు నిర్వహిస్తోందని, 10 ఏళ్లలో కంపెనీ ఉన్నత స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. ఫ్యాక్టరీ సీఈఓ అనూప్ కుమార్ సక్సేనా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయిరమేష్ , పరిశ్రమ ప్రతినిధులు హరీష్ కామర్తి, బాలాజీ, జేజే రెడ్డి, రవిందర్ రెడ్డి, పిట్రాకోలా తదితరులు మాట్లాడారు. -
పదాలతో చెడుగుడు.. పతకాలతో బుడతలు
సిటీబ్యూరో: ఆంగ్ల పదాలతో చిన్నారులు చెడుగుడాడుకున్నారు. అడిగిందే తడవుగా ఇంగ్లిష్ వర్డ్స్ స్పెల్లింగులను గడగడా చెప్పి విద్యార్థులు ఔరా అనిపించారు. పిల్లల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ వినూత్నంగా నిర్వహిస్తున్న సాక్షి ఇండియా స్పెల్ బీ-2014 ఫైనల్స్ శనివారం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు నగదు బహుమతులు అందజేశారు. ఫైనల్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలు కూడా ఇచ్చారు. బంగారు పతాక విజేతలకు రూ. 25 వేలు, రజత పతకం గెలుపొందిన వారికి రూ.15 వేలు, కాంస్య పతకాలు పొందిన వారికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఇరు రాష్ట్రాల నుంచి మొత్తం 25 వేల మంది ఈ పోటీలకు నమోదు చేసుకోగా దాదాపు 160 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. శుక్రవారం నగరంలోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఫైనల్ పోటీలు జరిగాయి. నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో ఒక్కో కేటగిరి నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 24 మందిని పతకాలు వరించాయి. ముఖ్య అతిథులుగా హాజరైన సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డిలు విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. వీరితోపాటు భారతి సిమెంట్ మార్కెటింగ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎం.సి.మల్లారెడ్డి, అడ్వటైజింగ్ ఏజీఎం బి.చంద్రశేఖర్, పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మేథో పోటీల్లో అమిత ఉత్సాహంగా పాలుపంచుకోవడం సంతోషకరమన్నారు. అందరూ పతకాలు పొందలేకపోయినా ఫైనల్స్ వరకూ రావడమే గొప్ప విజయంగా అభివర్ణించారు. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి విద్యార్థులను ఇంత దూరం తీసుకొచ్చి వారి ఆసక్తి, ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల్లో మేధస్సు సంపత్తిని పెంపొందించే మరిన్ని పోటీలు నిర్వహించేందుకు సాక్షి సిద్ధంగా ఉందని రామచంద్రమూర్తి వెల్లడించారు. సాక్షి ఇండియా స్పెల్ బీ పోటీలు నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. వచ్చే ఏడాది జనవరిలో సాక్షి జీయో బీ-2015 పేరిట ప్రత్యేక పోటీలకు కూడా సాక్షి మీడియా శ్రీకారం చుట్టింది.