పదాలతో చెడుగుడు.. పతకాలతో బుడతలు
సిటీబ్యూరో: ఆంగ్ల పదాలతో చిన్నారులు చెడుగుడాడుకున్నారు. అడిగిందే తడవుగా ఇంగ్లిష్ వర్డ్స్ స్పెల్లింగులను గడగడా చెప్పి విద్యార్థులు ఔరా అనిపించారు. పిల్లల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ వినూత్నంగా నిర్వహిస్తున్న సాక్షి ఇండియా స్పెల్ బీ-2014 ఫైనల్స్ శనివారం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు నగదు బహుమతులు అందజేశారు. ఫైనల్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలు కూడా ఇచ్చారు. బంగారు పతాక విజేతలకు రూ. 25 వేలు, రజత పతకం గెలుపొందిన వారికి రూ.15 వేలు, కాంస్య పతకాలు పొందిన వారికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
ఇరు రాష్ట్రాల నుంచి మొత్తం 25 వేల మంది ఈ పోటీలకు నమోదు చేసుకోగా దాదాపు 160 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. శుక్రవారం నగరంలోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఫైనల్ పోటీలు జరిగాయి. నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో ఒక్కో కేటగిరి నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 24 మందిని పతకాలు వరించాయి. ముఖ్య అతిథులుగా హాజరైన సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డిలు విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. వీరితోపాటు భారతి సిమెంట్ మార్కెటింగ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎం.సి.మల్లారెడ్డి, అడ్వటైజింగ్ ఏజీఎం బి.చంద్రశేఖర్, పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మేథో పోటీల్లో అమిత ఉత్సాహంగా పాలుపంచుకోవడం సంతోషకరమన్నారు.
అందరూ పతకాలు పొందలేకపోయినా ఫైనల్స్ వరకూ రావడమే గొప్ప విజయంగా అభివర్ణించారు. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి విద్యార్థులను ఇంత దూరం తీసుకొచ్చి వారి ఆసక్తి, ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల్లో మేధస్సు సంపత్తిని పెంపొందించే మరిన్ని పోటీలు నిర్వహించేందుకు సాక్షి సిద్ధంగా ఉందని రామచంద్రమూర్తి వెల్లడించారు. సాక్షి ఇండియా స్పెల్ బీ పోటీలు నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. వచ్చే ఏడాది జనవరిలో సాక్షి జీయో బీ-2015 పేరిట ప్రత్యేక పోటీలకు కూడా సాక్షి మీడియా శ్రీకారం చుట్టింది.