నా వెనక ‘దేశం’.. నాకేం భయం
కాకినాడ సిటీ :రైతుబజార్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, మూడు షాపులను ఏర్పాటు చేసుకుని, అద్దె వసూలు చేసుకుంటున్న అధికార తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు మాకిరెడ్డి భాస్కర్ శనివారం మరోసారి గలాటా సృష్టించడం ఉద్రిక్తతకు దారితీసింది. రైతు బజార్ విస్తరణ చేపడితే తాను ఆక్రమించిన స్థలంలోని షాపులు పోతాయనే భయంతో భాస్కర్.. రెండు నెలల క్రితం మా ర్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది చేపట్టిన సర్వేను అడ్డుకోవడమే కాక, రైతులను దుర్భాషలాడి, ఎస్టేట్ అధికారితో పాటు సిబ్బందిని గదిలో నిర్బంధించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆర్టీసీ కాం ప్లెక్స్ వద్ద ఉన్న రైతుబజార్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా భాస్కర్ రైతులపై ఆరోపణలు చేశారు. మంత్రి వెళ్లాక భాస్కర్ అనుచరులు ఓ రైతుపై దాడి చేయగా రైతులు, వ్యాపారులు తిరగబడడంతో ఉద్రిక్తత నెలకొంది.
న్యాయం జరిగే వరకూ మూసివేతే..
రైతుపై భాస్కర్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడడాన్ని నిరసిస్తూ రైతులు, వ్యాపారులు రైతుబజార్‌ను మూసివేశారు. అతడి నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ టూ టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి, భాస్కర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే భాస్కర్ సంబంధం లేని వ్యక్తితో రైతులపై అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదు చేయించడంపై వ్యాపారులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తమకు భాస్కర్ నుంచి తరచూ ఇబ్బందులు ఎదురువుతున్నాయని, అతడు ఆక్రమించిన షాపులను తొలగించి గోడ నిర్మించాలని రైతుబజార్ వ్యాపారుల సంఘ నాయకులు గంగాధర్, కృష్ణస్వామి, కొండలరావు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేసేవరకు రైతుబజార్‌ను తెరిచేది లేదంటూ నినాదాలు చేశారు. కాగా తరచూ రైతుబజార్లో గొడవ సృష్టిస్తున్న భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అత డి ఆక్రమణల తొలగింపు విషయంలో వెనుకాడడంలో అధికారుల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.