Bhuvneshwar
-
బీచ్‌లో స్నానం.. అంతలోనే తండ్రిని మింగేసిన అల..
భువనేశ్వర్: పూరీ బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రపు స్నానం ఓ బాలుడికి తండ్రిని దూరం చేసింది. ఈ ఘటన ఒడిశాలోని పూరీలో చోటు చేసుకుంది. బాలాసోర్‌కు చెందిన బన్సిధర్ బెహెరా(35) కుటుంబసభ్యులతో కలసి వేసవి టూర్ కోసం పూరీ సముద్ర తీరానికి వెళ్లారు. శనివారం తండ్రీకొడుకులు సరదాగా బీచ్‌లోకి దిగి.. ఆడుతుపాడుతూ స్నానం చేశారు. అలా వారు స్నానం చెస్తూ.. సముద్రపు ఓ పెద్ద అల వైపు బన్సిధర్ బెహెరా దూకాడు. దీంతో ఆ పెద్ద అల వారిని అతలాకుతలం చేసింది. అల నుంచి బన్సిధర్ బెహెరా తిరిగి రాలేదు. 12 ఏళ్ల అతని కొడుకు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అతని కుటుంబసభ్యులు అప్రమత్తమైనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతని మృతదేహం కోసం డైవర్లు, ఫైర్ సిబ్బంది సముద్రంలో వెతుకుతున్నారు. సముద్రంలోకి దిగి స్నానం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడకు వచ్చే పర్యటకులకు చెబుతామని పూరీ బీచ్ పోలీసులు తెలిపారు. అయితే కొంతమంది తాము చెప్పే సూచనలు నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. దాని వల్లే ఇలాంటి ప్రమాదలు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఘటనను కుటుంబసభ్యుల్లో ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. బన్సిధర్ బెహెరా బాలాసోర్‌లో చిరు వ్యాపారిగా పనిచేస్తున్నారు. -
4 నిమిషాల 27.82 సెకన్లలో పరుగు పూర్తి.. మన భాగ్యలక్ష్మికి స్వర్ణం
భువనేశ్వర్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్రీడాకారిణి డి.భాగ్యలక్ష్మి స్వర్ణ పతకాన్ని సాధించింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన భాగ్యలక్ష్మి 1500 మీటర్ల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఆమె 4 నిమిషాల 27.82 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వర్ష (కురుక్షేత్ర యూనివర్సిటీ– 4ని:30.01 సెకన్లు) రజతం, సునీత (హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీ–4ని:30.15 సెకన్లు) కాంస్యం సాధించారు. ‘ద్రోణాచార్య’ అవార్డీ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న భాగ్యలక్ష్మి విజేత హోదాలో ఈ ఏడాది జూన్–జూలైలో చైనాలో జరిగే ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్ -
తాళంతో..వేళాకోళమా..?
భువనేశ్వర్ : పూరీ జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు నేపథ్యంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించింది. శ్రీ మందిరం నిర్వహణలో లోపాలపట్ల సుప్రీం కోర్టు పెదవి విరిచింది. దేవస్థానం పాలనా వ్యవహారాల్లో లోపాల సవరణ కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రముఖ దేవస్థానాల నిర్వహణ పరిశీలించాలి. ఈ నెల 30 నాటికి సమగ్ర నివేదికను దాఖలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. జూలై నెల 5వ తేదీన శ్రీ మందిరం నిర్వహణ లోపాలకు సంబంధించి తదుపరి విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. జగన్నాథుని దేవస్థానం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు వ్యవహారాన్ని పురస్కరించుకుని కటక్ మహానగరంలో ఉంటున్న మృణాళిని పాఢి అనే మహిళ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 3 ప్రధాన అంశాలతో ఈ కేసు దాఖలైంది. భక్తులు, యాత్రికులకు వేధింపులు, లోపిస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ, దేవస్థానం నిర్వహణ లోపం అంశాలపట్ల సుప్రీం కోర్టు దృష్టిని ఆకట్టుకునేందుకు ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆమె వివరించారు. లక్షలాది యాత్రికులు, భక్తులు సందర్శించే ప్రముఖ దేవస్థానాలు మోసాలకు పాల్పడరాదు. భక్తులు సమర్పించే విరాళాలు దేవుని ఖాతాలో దేవస్థానం సమగ్ర అభివృద్ధి కోసం వెచ్చించాలి తప్ప సేవాయత్‌లు, ఇతరేతర ఆలయ సిబ్బంది బాగోగుల కోసం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వర్గపు జీతభత్యాల్ని దేవస్థానం కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దేవస్థానానికి విచ్చేసే భక్తులకు సునాయాశంగా దైవదర్శనం కల్పించాలి. అర్చకులు ఇతరేతర అనుబంధ వర్గాలు భక్తుల నుంచి దోపిడీ వంటి చర్యలకు పాల్పడడం ఎంత మాత్రం తగదని సుప్రీం కోర్టులో విచారణ జరిపిన జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం అభిప్రాయపడింది. యాత్రికులు, భక్తుల నుంచి ఆలయ వర్గాలు ప్రత్యక్షంగా విరాళాలు, దక్షిణలు గుంజుతున్న ఆచారంపట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసాకు లెక్క ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దేవస్థానాల ఆర్థిక ప్రణాళిక, వ్యవహారాలు పూచీదారితనంతో కొనసాగాలని అభిప్రాయపడింది. ప్రత్యేక ప్యానెల్‌తో పరిశీలన దేశంలో ప్రముఖ దేవస్థానాల సాంస్కృతిక, నిర్మాణ శైలి పరిరక్షణ కార్యాచరణ పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశంలో పేరొందిన వైష్ణోదేవి, తిరుపతి, షిర్డీ సాయి, సోమనాథ్, అమృతసర్ స్వర్ణ ఆలయాల్లో భక్తులు, యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దేవస్థానం నిర్వహణ, ఆలయాల సంరక్షణ వగైరా అంశాల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పరిశీలన నేపథ్యంలో జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలో సంస్కరణలకు సిఫారసు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ నెల 30 నాటికి నివేదిక శ్రీ మందిరానికి విచ్చేస్తున్న భక్తులు ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, భక్తజనం నుంచి బలవంతంగా దక్షిణలు గుంజడం వగైరా అంశాలపై వాస్తవ స్థితిగతులతో సమగ్ర నివేదికను పూరీ జిల్లా జడ్జి ప్రదానం చేయాల్సి ఉంది. ఈ నెల 30వ తేదీ నాటికి ఈ నివేదిక దాఖలు చేసేందుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నివేదిక రూపకల్పనలో జిల్లా కలెక్టర్‌తో పాటు అనుబంధ యంత్రాంగం, శ్రీ మందిరం పాలక మండలి పూర్తి స్థాయిలో జిల్లా జడ్జికి సహకరించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. శ్రీ మందిరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, వాటి పని తీరు, పర్యవేక్షకుల వివరాల్ని నివేదికలో వివరిస్తారు. నివేదిక పరిశీలకు యామికస్ క్యూరీ జగన్నాథుని దేవస్థాన సంస్కరణలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కమిటీ, పూరీ జిల్లా జడ్జి నివేదికల పరీశీలనకు యామికస్ క్యూరీగా గోపాల సుబ్రహ్మణ్యంను నియమించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నివేదికను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సుప్రీంకోర్టుకు వివరించాల్సి ఉంది. ఈ వివరణ ఆధారంగా జూలై 5వ తేదీన సుప్రీం కోర్టు తదుపరి విచారణ చేపడుతుంది. వాస్తవాల్ని బయట పెట్టండి : గవర్నర్ గణేషీ లాల్ భువనేశ్వర్ : శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు వివాదాన్ని పురస్కరించుకుని గవర్నర్ పెదవి కదిపారు. తీవ్ర కలకలం రేకెత్తించిన ఈ సంఘటన వెనక వాస్తవాల్ని బయట పెట్టేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ శుక్రవారం అన్నారు. తాళం చెవి కనబడకుండా పోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ కమిషను ఏర్పాటుకు ఆదేశించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
ఎందుకో..ఏమో..!
భువనేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో త్వరలో భేటీ కానున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మే నెల తొలి వారంలో భేటీ అయ్యేందుకు కార్యక్రమం ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర పర్యటనకు విచ్చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు తొలుత ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని దర్శించుకుంటారు. అనంతరం ఆయన నవీన్ పట్నాయక్‌తో భేటీ అవుతారు. 2019వ సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ప్రాంతీయ పార్టీల వ్యూహాత్మక కార్యాచరణ నేపథ్యంలో వీరిద్దరూ భేటీకి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఉభయ బిజూ జనతా దళ్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నుంచి దూరంగా ఉంటున్నాయి. భావి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెసేతర వర్గాలు కూటమిగా ఆవిర్భవించి పోటీ చేయాలనే యోచనతో దేశంలోని పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ప్రముఖులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో తరచూ భేటీ అవుతున్నారు. లోగడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో గత నెలలో భేటీ అయ్యారు. 2019వ సంవత్సరపు సార్వత్రిక ఎన్నికల్లో తృతీయ కూటమి ఆవిష్కరణకు ఈ వర్గాలు కృషి చేస్తున్నట్లు సంకేతాలు లభిస్తున్నాయి. తృతీయ కూటమి ఆవిష్కరణ, మైత్రి వగైరా అంశాలపట్ల సకాలంలో స్పందిస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరచూ దాట వేస్తున్నారు. -
జగన్నాథునికి నిద్రాహారాలు కరువు
భువనేశ్వర్ : విశ్వవిఖ్యాత జగన్నాథునికి కూడా కష్టాలు తప్పడం లేదు. ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాల్లో న్యాయ, అధికారిక సంస్కరణలు జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలో తీవ్ర అలజడిని రేకెత్తించాయి. శ్రీ మందిరం రత్న వేదికపై జగన్నాథునితో కొలువు దీరిన బలభద్రుడు, దేవీ సుభద్ర, సుదర్శనుడు గత రెండురోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉపవాసంతో జాగారం చేయాల్సి వచ్చింది. వరుసగా సోమ, మంగళవారాల్లో ఇదే పరిస్థితి తారసపడింది. జగతి నాథునికి కష్టాలు తెచ్చిపెడుతున్న శ్రీ మందిరం దేవస్థానం సేవాయత్‌లు, అధికార వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ తీరు పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. భగవంతుడు ఒక వైపు ఉపవాసం, జాగారాలతో నిరీక్షిస్తుండగా శ్రీ మందిరం ఆలయ వైకుంఠం (కొయిలి వైకుంఠొ) ప్రాంగణంలో అమూల్యమైన జగన్నాథుని అన్న ప్రసాదాల్ని పాతిబెట్టారు. దీంతో ఈ ప్రసాదాల కోసం పరితపించే భక్త జనానికి తీవ్ర మనస్తాపం ఎదురైంది. జగమోహన మండపం వివాదమే కారణమా! దాదాపు 2 ఏళ్లుగా మూతబడిన శ్రీ మందిరం ప్రాంగణంలోని జగ మోహన మండపాన్ని ఈ నెల 16వ తేదీన పునఃప్రారంభించారు. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కార్యాచరణ చేపట్టారు. దైనందిన సేవలకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని గర్భగుడిలోకి అనుమతించ రాదని హై కోర్టు ఆంక్షలు విధించింది. తరతరాలుగా కొనసాగుతున్న ఆచారానికి ఈ ఉత్తర్వులు కళంకమంటూ సేవాయత్ వర్గం ఆక్షేపించింది. గర్భగుడిలోకి ప్రవేశించడంపట్ల ఆంక్షలు నివారించాలని పట్టుబట్టింది. ఈ మేరకు హైకోర్టు నుంచి సానుకూల స్పందన కొరవడింది. దీంతో సేవాయత్ వర్గం ఎదురు దాడికి పరోక్షంగా సిద్ధమైంది. గర్భగుడి రత్నవేదికపై సేవల్ని నిర్వహించాల్సిన సింఘారి సేవాయత్ వర్గీయులకు అనివార్య కారణాలతో గర్భగుడిలోకి అడుగిడే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంగా సేవల్ని నిర్వహించేందుకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని రాష్ట్ర హై కోర్టు నివారించినందున అనుబంధ సేవల్ని నిర్వహించేందుకు ఇతర వర్గాల సేవాయత్‌లు కూడా నిరాకరించారు. ఇలా సోమవారం శ్రీ మందిరంలో జగమోహన మండపం పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని వివాదం తలెత్తడంతో నిత్యసేవలకు గండి పడింది. ప్రభావితమైన నిత్యసేవలు సోమవారం మంగళహారతి నుంచి ఇతర సేవలన్నీ ప్రభావితమయ్యాయి. ప్రాతఃకాల ధూపాదుల కార్యక్రమాన్ని సోమ వారం మధ్యాహ్నం ఆలస్యంగా నిర్వహించారు. ఈ క్రమంలో అపరాహ్న సేవలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. నిత్య కార్యకలాపాల్లో భాగంగా స్వామి వారి నివేదన కోసం వండిన అన్న ప్రసాదాలు పోటు ప్రాంగణంలోనే మగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో గర్భగుడి రత్నవేదికపై జగన్నాథునికి భోజనం లేకుండా పోయింది. నిత్య సేవల్లో క్రమం తప్పడంతో సోమవారం రాత్రి స్వామి వారికి ఏకాంత సేవ కూడా జరగలేదు. దీంతో స్వామి సోమవారం రాత్రి జాగారం చేయాల్సి వచ్చింది. భక్తులకూ దక్కని స్వామి ప్రసాదం మొత్తంమీద స్వామి వారికి అన్న ప్రసాదాల నివేదన జరగనందున నివేదనకు నోచుకోని అన్న ప్రసాదాల్ని శ్రీ మందిరం సముదాయంలో ఉన్న కోవెల వైకుంఠం (మూల విరాట్ల స్మశాన వాటిక)లో మట్టిలో పాతి బెట్టి చేతులు దులిపేసుకున్నారు. నిత్యం 56 రకాల వంటకాలతో అన్న ప్రసాదాల్ని సేవించాల్సిన స్వామికి వరుసగా రెండు రోజులపాటు వీటి నివేదన జరగకపోవడంతో జాతీయ, అంతర్జాతీయ జగన్నాథుని భక్తులు తీవ్ర మనస్తాపం చెందారు. స్వామి ఉపవాసం పాలు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే అశేష సంఖ్య భక్తులు, యాత్రికులకు జగన్నాథుని మహా ప్రసాదం లభ్యం కాలేదు. -
ధోని చెప్పాడు.. నేను ఆడేశా!
పల్లెకెలె: శ్రీలంకతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించడానికి సహచర ఆటగాడు ఎంఎస్ ధోనినే కారణమంటున్నాడు పేసర్ భువనేశ్వర్ కుమార్. 'నేను క్రీజ్ లోకి వచ్చిన క్షణంలో నాకు ధోని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. ముందు ఒత్తిడి లోనుకాకుండా నా సహజసిద్ధమైన ఆటను ఆడమన్నాడు. ఇక్కడ చాలా ఓవర్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నాడు. ప్రధానంగా టెస్టుల్లో నువ్వు ఏ రకంగా ఆడతావో, అదే తరహాలో బ్యాటింగ్ కొనసాగించమన్నాడు. దాంతో నాపై ఒత్తిడిని తగ్గించుకునే యత్నం చేశా. ధోని చెప్పినట్లే క్రీజ్ లో నిలబడటానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి ఒక్కో పరుగును కూడబెడతూ ముందుగా సాగా. ఆ క్రమంలోనే విలువైన భాగస్వామ్యం నమోదైంది. అదే జట్టు విజయానికి దోహదం చేసింది' అని భువీ తెలిపాడు. -
మూడో టెస్టుకు భువనేశ్వర్ దూరం
ఇండోర్: న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరుగనున్న మూడో టెస్టుకు భారత ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. కోల్ కతా లో ఈడెన్ గార్డెన్లో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డ భువనేశ్వర్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తాజా ప్రకటనలో వెల్లడించింది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే ఇషాంత్ శర్మ టెస్టు సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇషాంత్ కు చికెన్ గున్యా సోకడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు భువీ కూడా మూడో టెస్టుకు దూరం కావడంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న భావిస్తున్న భారత జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత టెస్టు మ్యాచ్ లో ఆరు వికెట్లు సాధించి జట్టు విజయంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో కివీస్ వెన్నువిరిచిన భువీ.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీశాడు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ఈనెల 8వ తేదీ నుంచి జరుగనుంది. -
మెరుగైన సాహా, రోహిత్, భువీ ర్యాంకులు
దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా ఆడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రోహిత్ శర్మ, పేసర్ భువనేశ్వర్‌ల ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్‌సలో సాహా 18 ర్యాంకులను మెరుగుపర్చుకుని 56వ స్థానానికి చేరాడు. ఇక రోహిత్ కూడా 14 స్థానాలను ఎగబాకి 38వ ర్యాంకులో ఉన్నాడు. పుజారా 15వ ర్యాంకులో ఉండగా.. మురళీ విజయ్ ఐదు స్థానాలు దిగజారి 21వ ర్యాంకుకు చేరాడు. స్టీవ్ స్మిత్ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ తొమ్మిది స్థానాలను మెరుగుపర్చుకుని 26వ ర్యాంకుకు చేరాడు. అశ్విన్ రెండు నుంచి మూడో ర్యాంకుకు చేరాడు. -
'ఆ బౌలర్ల వల్లే మెరుగుపడ్డా'
హరారే: తన పేస్ బౌలింగ్ మరింత మెరుపడ్డానికి టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా, సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్లే కారణమంటున్నాడు యువ బౌలర్ బరిందర్ శ్రవణ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆ ఇద్దరి బౌలర్ల నుంచి కొన్ని మెళకువలు నేర్చుకోవడం వల్లే తన ప్రదర్శన మెరుగుపడిందని తాజాగా స్పష్టం చేశాడు. 'ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు జట్టుకు ఆడే క్రమంలో మేము ముగ్గురం అనేక విషయాలు షేర్ చేసుకున్నాం. వారు సీనియర్లు కావడంతో నాకు చాలా సలహాలిచ్చారు. ప్రత్యేకంగా సీమ్ పొజిషన్ పై వారు నాకు కొన్ని అమూల్యమైన సలహాలిచ్చారు. అదే నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది' అని శ్రవణ్ అన్నాడు. ఏ విధమైన సందేహాన్ని అడిగినా వారిద్దరూ ఎంతో సహనంతో తనకు సహకరించేవారని కొనియాడాడు. ప్రస్తుతం తన సీమ్ బౌలింగ్ పొజిషన్ ను కొద్దిగా మార్చుకోవడానికి వారిద్దరే ప్రధాన కారణమన్నాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం కోసమే స్వల్ప మార్పులు చేసుకున్నట్లు తెలిపాడు. తన జింబాబ్వే పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రవణ్.. ఇంకా తాను ఫిట్ నెస్ పరంగా, బౌలింగ్ పరంగా ఇంకా చాలా మెరుగపడాల్సి ఉందని పేర్కొన్నాడు. -
'గేమ్ ప్లాన్ ప్రకారమే కట్టడి చేశాం'
రాజ్ కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కచ్చితమైన ప్రణాళికలు అమలు చేయడంతోనే తమ జట్టు ఘన విజయం సాధించిందని సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకన్న తాము గేమ్ ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేసి పటిష్టమైన గుజరాత్‌ను కట్టడి చేశామన్నాడు. తమ జట్టు బౌలింగ్‌లో మెరుగ్గా ఉండటంతో గుజరాత్‌ను 150 పరుగుల లోపే నిలువరించాలనుకునే బరిలోకి దిగామన్నాడు. ఈ ప్రణాళికను సమగ్రంగా అమలు చేయడంతో గుజరాత్ 135 పరుగులకే పరిమితమైందన్నాడు. తద్వారా తమ గెలుపు సునాయాసమైందని పేర్కొన్నాడు. ' స్లో కట్టర్లను ప్రధానంగా సంధించి బ్యాట్స్‌మెన్ ఊరించే యత్నం చేశాం. ఆ ప్రణాళిక ఫలించింది. గుజరాత్ జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లు భారీ షాట్లకు వెళ్లి వికెట్లు సమర్పించుకున్నారు. తొలి ఓవర్ నాల్గో బంతికి అరోన్ ఫించ్ పెవిలియన్ చేరడంతో షాక్ తిన్న గుజరాత్ ఆ తరువాత తేరుకోలేదు. పరుగుల వేటలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆపై మా బ్యాట్స్‌మెన్ మిగతా పనిని సమగ్రం పూర్తి చేయడంతో విజయం సాధించాం' అని భువనేశ్వర్ అన్నాడు. -
వీళ్ల సంగతేంటి !
► మ్యాచ్‌లు దక్కని హర్భజన్, నేగి ► ఇప్పటి వరకు డగౌట్‌కే పరిమితం ► భువనేశ్వర్నూ ఆడించట్లేదు ► ఇప్పటికైనా అవకాశం ఇస్తారా! సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ మూడు సిరీస్‌లుగా భారత జట్టుతో పాటే తిరుగుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్లో ప్రదర్శన చూసి లంక సిరీస్ నుంచే లెఫ్టార్మ్ స్పిన్నర్ పవన్ నేగిని ఎంపిక చేశారు. కానీ అసలు అతను అంతర్జాతీయ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోగలడా అని కనీసం పరీక్షించే ప్రయత్నం చేయలేదు. వీరిద్దరూ ప్రపంచకప్ జట్టులో ఉన్న బౌలర్లు. కోహ్లి విశ్రాంతితో, ధావన్ గాయంతో రహానే ఆడగలిగాడు గానీ లేదంటే అతనూ ఎక్స్‌ట్రాగానే మిగిలిపోయేవాడు. ఇక రిజర్వ్ ఆటగాడిగా ఉంటూ వస్తున్న భువనేశ్వర్ కూడా డగౌట్‌కే పరిమితమవుతున్నాడు. ప్రపంచకప్‌లోగా షమీ కోలుకోకపోతే అతనికి జట్టులో చోటు దక్కవచ్చు. పిచ్‌లు పేస్‌కు అనుకూలిస్తున్న చోట భువీకి అవకాశం ఇస్తే అతని తాజా ఫామ్ ఏమిటో తెలిసేది. సాధారణంగా చిన్న జట్లతో మ్యాచ్‌ల్లో కూడా తుది జట్టును మార్చడానికి ధోని పెద్దగా ఇష్టపడడు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ప్రయోగాలపై ఆసక్తి చూపించడు. ఈసారి అతని ఆలోచనల్లో ఏమైనా మార్పు ఉంటుందా అనేది చూడాలి. సాక్షి క్రీడా విభాగం భారత జట్టు 2016లో ఇప్పటికే తొమ్మిది టి20 మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియాలో మొదలైన విజయపరంపర ఒక్క మ్యాచ్ మినహా నిరాటంకంగా సాగుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఒక మార్పు తప్ప అదే 11 మందితో టీమిండియా జోరు ప్రదర్శిస్తోంది. విజయాలు సాధిస్తున్న జట్టును మార్చకూడదని క్రికెట్ అనుభవజ్ఞులు చెప్పే మాట. కానీ విశ్వ వేదికపై సవాల్‌కు ముందు అందుబాటులో ఉన్న అన్ని వనరులను పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రకంగా చూస్తే కొత్త ఆటగాడు నేగితో పాటు హర్భజన్, భువనేశ్వర్‌ల ఫామ్‌పై కూడా ఒక అంచనాకు రావాలి. ఏదైనా మ్యాచ్‌లో తప్పనిసరిగా బరిలోకి దించాల్సి వస్తే అంతకు ముందు కాస్త మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేకపోతే ఎలా? సుదీర్ఘ సమయం పాటు డగౌట్లోనే ఉండిపోవడం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రమాదం కూడా ఉంది. నేగి ఎలా ఆడతాడు? శ్రీలంకతో సిరీస్‌కు, ఆపై ఆసియా కప్, ప్రపంచకప్‌లకు ఎంపిక కావడం వల్ల పవన్ నేగికి ఏదైనా మంచి జరిగింది అంటే అది ఐపీఎల్లో భారీ మొత్తం పలకడమే! అతడికి కేవలం 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవమే ఉన్నా... టి20ల్లో మంచి ప్రదర్శన కారణంగా నేరుగా భారత జట్టులో అవకాశం దక్కింది. లెఫ్టార్మ్ స్పిన్‌తో పాటు చివర్లో ధాటిగా ఆడగల అతని నైపుణ్యం ఐపీఎల్లో కనిపించింది. అయితే కనీసం శ్రీలంకతో సిరీస్‌లో అయినా ఆడిస్తే అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం వచ్చేది. రవీంద్ర జడేజా శైలితో అతనికి సరిగ్గా సరిపోయే ప్రత్యామ్నాయం కాగల ఈ ఆల్‌రౌండర్‌ను కెప్టెన్ పెద్దగా పట్టించుకోలేదు. బౌలింగ్‌లో కచ్చితత్వం ప్రదర్శిస్తున్నా బ్యాట్స్‌మన్‌గా జడేజా ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. నేగిని పరీక్షించి ఉంటే వరల్డ్ కప్ వ్యూహాల్లో అతను కూడా భాగమయ్యేవాడు. రేపు అవసరమై కీలక మ్యాచ్‌లో ఆడించాల్సి వస్తే అలాంటి మెగా టోర్నీలో నేరుగా కొత్త ఆటగాడినుంచి ఎలాంటి ప్రదర్శన ఆశించగలం. సీనియర్ అయినా... మరో వైపు హర్భజన్ సింగ్‌ది భిన్నమైన పరిస్థితి. భారత నంబర్‌వన్ స్పిన్నర్‌గా అశ్విన్ ఎదిగిన తర్వాత భజ్జీ దాదాపు తెరమరుగైపోయాడు. కోహ్లి అభిమానం వల్ల లంకతో టెస్టు ఆడగలిగినా... టి20ల్లో గత మూడు సిరీస్‌లుగా అతడికి మ్యాచ్ దక్కడం లేదు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ ఆడిన అతని ఆట అక్కడితోనే ఆగిపోయింది. ఎక్కువ మంది లెఫ్ట్ హ్యండ్ బ్యాట్స్‌మెన్ ఉండే శ్రీలంకలాంటి జట్టుతో మ్యాచ్ ఆడినప్పుడు భజ్జీ అవసరం ఉండవచ్చంటూ ధోని చెబుతూ వచ్చినా... ఇప్పటి దాకా అది జరగలేదు. అతని అనుభవాన్ని బట్టి చూస్తే కొత్తగా పరీక్షించేందుకు ఏమీ లేకపోయినా... మ్యాచ్ ప్రాక్టీస్, ఫామ్ కోసమైనా ఆడించాల్సింది. రిజర్వ్‌గానే భువి కొన్నాళ్ల క్రితం వరకు భారత టాప్ పేసర్‌గా ఉన్న భువనేశ్వర్ గతి తప్పి జట్టులో అవకాశం కోల్పోయాడు. ముందుగా ఆసియా కప్ జట్టులో లేకపోయినా షమీ గాయంతో అవకాశం దక్కింది. షమీ ఫిట్నెస్ పరిస్థితి చూస్తే ప్రపంచకప్‌లోగా కోలుకుంటాడా అనేది సందేహమే. అదే జరిగితే భువీ కొనసాగే అవకాశం ఉంది. భజ్జీ ఆడిన మ్యాచ్‌లోనే ఆఖరిసారి బరిలోకి దిగిన భువనేశ్వర్ మళ్లీ మైదానంలోకి దిగలేదు. ఇప్పుడు కాస్త రనప్ పెంచడంతో పాటు మరింత ఫిట్‌గా మారిన భువీని... బంగ్లాదేశ్‌లోని పేస్ పిచ్‌లపై ఒక్క మ్యాచ్ ఆడిస్తే అతని సత్తా తెలిసేది. భారీ హిట్టర్లతో బలంగా ఉన్న బ్యాటింగ్ లైనప్‌లో రహానేకు చోటు దాదాపు అసాధ్యంగా మారింది. పాక్‌తో మ్యాచ్‌లో ఆమిర్ అద్భుత బంతికి అతను వెనుదిరగ్గా, వెంటనే పక్కన పెట్టి ధావన్‌ను మళ్లీ తీసుకున్నారు. అంటే ఎవరైనా గాయపడితే తప్ప రహానేకు చోటు లేదు. నేడు యూఏఈతో పోరు రా. గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం ఆసియా కప్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు (గురువారం) భారత్ జట్టు యూఏఈతో తలపడుతుంది. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా, మూడు మ్యాచ్‌లు ఓడిన యూఏఈ నిష్ర్కమించింది. దాంతో టోర్నీపరంగా ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయితే రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించేందుకు భారత్ దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మార్పులైతే ఉంటాయి కానీ ఎంత మందనేది ఇప్పుడే చెప్పలేమని కెప్టెన్ ధోని అన్నాడు. ఈ ఏడాది 9 మ్యాచ్‌లూ ఆడిన నెహ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మరో వైపు టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లలో యూఏఈ బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఆ జట్టు పరాజయం పాలైనా ముగ్గురు ప్రత్యర్థులనూ ఇబ్బంది పెట్టింది. భారత్, యూఏఈ మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్లతో యూఏఈని చిత్తు చేసింది. -
ఐసీసీ అవార్డు రేసులో భువనేశ్వర్
దుబాయ్: భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరును ఐసీసీ అవార్డుకు నామినేట్ చేశారు. పీపుల్స్ చాయిస్ అవార్డుకు భువితో పాటు మరో నలుగురు క్రికెటర్లను నామినేట్ చేశారు. అయితే వీరిలో ఒక్కరినే అవార్డుకు ఎంపిక చేస్తారు. క్రికెట్ అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. గెలిచిన వారికి వార్షిక ఐసీసీ అవార్డుల కార్యక్రమంలో అందజేస్తారు. www.lgiccawards.com ద్వారా తమ అభిమాన క్రికెటర్‌కు ఓటు వేయవచ్చు. అవార్డు రేసులో భవితో పాటు ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్, ఆస్ట్రేలియా ఫేసర్ మిచెల్ జాన్సన్, శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ ఉన్నారు.