'గేమ్ ప్లాన్ ప్రకారమే కట్టడి చేశాం'
రాజ్ కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో కచ్చితమైన ప్రణాళికలు అమలు చేయడంతోనే తమ జట్టు ఘన విజయం సాధించిందని సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకన్న తాము గేమ్ ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేసి పటిష్టమైన గుజరాత్ను కట్టడి చేశామన్నాడు. తమ జట్టు బౌలింగ్లో మెరుగ్గా ఉండటంతో గుజరాత్ను 150 పరుగుల లోపే నిలువరించాలనుకునే బరిలోకి దిగామన్నాడు. ఈ ప్రణాళికను సమగ్రంగా అమలు చేయడంతో గుజరాత్ 135 పరుగులకే పరిమితమైందన్నాడు. తద్వారా తమ గెలుపు సునాయాసమైందని పేర్కొన్నాడు.
' స్లో కట్టర్లను ప్రధానంగా సంధించి బ్యాట్స్మెన్ ఊరించే యత్నం చేశాం. ఆ ప్రణాళిక ఫలించింది. గుజరాత్ జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లు భారీ షాట్లకు వెళ్లి వికెట్లు సమర్పించుకున్నారు. తొలి ఓవర్ నాల్గో బంతికి అరోన్ ఫించ్ పెవిలియన్ చేరడంతో షాక్ తిన్న గుజరాత్ ఆ తరువాత తేరుకోలేదు. పరుగుల వేటలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆపై మా బ్యాట్స్మెన్ మిగతా పనిని సమగ్రం పూర్తి చేయడంతో విజయం సాధించాం' అని భువనేశ్వర్ అన్నాడు.