bigger
-
బీహార్‌లో అయోధ్యను మించిన రామాలయం
అయోధ్య రామాలయం.. ఈ మాట వినగానే ఇది శ్రీరామునికి సంబంధించిన ఘనమైన ఆలయం అని మనకు అనిపిస్తుంది. అయితే దీనికి మించిన ఆలయం బీహార్‌లో నిర్మితమవుతోంది. పైగా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కూడా సంతరించుకోనుంది.బీహార్‌లోని తూర్పు చంపారణ్ జిల్లాలో కేసరియా-చాకియా రహదారిపై నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ పనులు 2023, జూన్ 20 నుండి ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మహావీర్ టెంపుల్ ట్రస్టు కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ తెలిపారు. రెండవ దశలో 26 అడుగుల ఎత్తున ఉండే ప్లింత్‌ను నిర్మిస్తారు. దీన్ని పటిష్టం చేసేందుకు 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో కాంక్రీట్ పైకప్పును నిర్మిస్తారు. ఆ తర్వాత మూడు అంతస్తుల నిర్మాణం సాగనుంది. ఒక్కో అంతస్తు 18 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.22 దేవాలయాల సముదాయమైన ఈ ఆలయంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా దృశ్యాలు కనిపించనున్నాయి. అలాగే ప్రధాన దేవతల ఆలయాలు నిర్మితం కానున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ఏడాదిన్నర, రెండేళ్లలో పూర్తి చేయాలని మహావీర్ టెంపుల్ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ రామాయణ దేవాలయ రెండో దశ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రధాన శిఖరం 270 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అయోధ్యలో రామ మందిరం కంటే అతిపెద్ద రామాలయంగా పేరు తెచ్చుకోనుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. -
మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్! ఇక ఆ వ్యాధి..
మానవ మెదళ్లు పరిమాణంలో వస్తున్న మార్పులను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఒక తరానికి మరొక తరానికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడించారు. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ హెల్త్ బృందం నిర్థారించింది. ఈ మేరకు యూఎస్‌లోని దాదాపు 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మూడు వేల మంది వృద్ధులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. 1930లలో జన్మించిన వారి కంటే 1970లలో (జనరేషన్ X) మొత్తం మెదడు పరిమాణం 6.6 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మునపటితరం సభ్యులకంటే ప్రస్తుత జనరేషన్ మెదడులో దాదాపు 8% ఎక్కువ వైట్ మ్యాటర్, 15% ఎక్కువ గ్రే మ్యాటర్ ఉందని పరిశోధనలో తేలింది. అంటే.. మునపటితరంతో పోలిస్తే ఇక్కడ మెదడు వాల్యూమ్ 5.7% పెరిగిందని తెలిపారు. దీని కారణంగా నేర్చుకోవడం, జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉంటుందన్నారు. అలాగే వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చెప్పారు. ఎవరైనా జన్మించినప్పుడు ఉన్న మెదడు పరిమాణం పైనే దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇలా మెదడు పరిమాణం పెరిగితే వృద్ధాప్య వ్యాధులకు వ్యతిరేకంగా శక్తి పెరుగుతుందన్నారు. తత్ఫలితంగా అల్జీమర్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పారు పరిశోధకులు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది ప్రజలను ప్రభావితం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమెరికాలో దాదాపు 7 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితోనే బాధపడుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి. (చదవండి: గుడ్లు ఎక్కువగా తింటున్నారా ? పరిశోధనలో షాకింగ్ విషయాలు!) -
అబ్బో ఎంత పెద్ద ఇళ్లో... విస్తీర్ణమైన గృహాలకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇంటి కొనుగోలు నిర్ణయంలో విస్తీర్ణం కూడా ప్రధానమైనదే. ఎవరు ఇంటికొచ్చినా అబ్బా ఎంత పెద్ద ఇళ్లో అనిపించుకోవాలనే కోరిక ప్రతీ గృహ కొనుగోలుదారులకు ఉంటుంది. ఫలితంగా దేశంలో ఏటేటా గృహ విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇంటి విస్తీర్ణాలలో 7 శాతం వృద్ధి నమోదైంది. 2018లో 1,150 చ.అ.లుగా ఉన్న ఇంటి సగటు విస్తీర్ణం.. 2023 నాటికి 1,225 చ.అ.లకు పెరిగిందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. గృహ కొనుగోలు ఎంపికలో కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2020 కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటు గృహాలకు ఆర్ధిక ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ఈ ఇళ్ల నిర్వహణ సులువు వంటి రకరకాల కారణాలతో చిన్న సైజు గృహాలను కొనుగోలుదారులకు ఎక్కువగా కోరుకునేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్, ఐసోలేషన్ గది వంటి కొత్త అవసరాలు ఏర్పడటంతో ఇంటి విస్తీర్ణాలు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గత నాలుగేళ్లలో తొలిసారికి గృహ విస్తీర్ణాలు పెరగడం ప్రారంభమైంది. 2023 నుంచి ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ.. పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాదీలు విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లోనే యూనిట్ సైజులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఫ్లాట్ విస్తీర్ణం సగటున 2,200 చ.అ.లుగా ఉన్నాయి. ఏడాదిలో ఫ్లాట్ల సైజులలో 29 శాతం మేర వృద్ధి నమోదయింది. 2022 క్యూ1లో 1,700 చ.అ.లుగా ఉన్న ఫ్లాట్ల సగటు విస్తీర్ణం.. 2023 క్యూ1 నాటికి 2,200 చ.అ.లకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోనే పెద్ద సైజు గృహాలలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. అత్యధికంగా ఎన్సీఆర్లో ఫ్లాట్ల సైజులు 50 శాతం మేర పెరిగాయి. 2022 తొలి త్రైమాసికం (క్యూ1)లో 1,130 చ.అ.లుగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 1,700 చ.అ.లకు పెరిగాయి. బెంగళూరులలో 1,200 చ.అ. నుంచి 1,300 చ.అ.లకు, కోల్‌కతాలో 800 చ.అ.ల నుంచి 1,150 చ.అ., పుణేలో 877 చ.అ. నుంచి 1,013 చ.అ.లకు పెరిగాయి. ముంబై,చెన్నైలలో క్షీణత: ఆశ్చర్యకరంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నైలలో గృహ విస్తీర్ణాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. 2013లో 932 చ.అ.లుగా ఉన్న ఇంటి సగటు విస్తీర్ణాలు.. 2022 క్యూ1 నాటికి 783 చ.అ.కు, 2023 క్యూ1 నాటికి 743 చ.అ.కు పడిపోయాయి. 2019తో పోలిస్తే 2020లో మాత్రమే ఫ్లాట్ల విస్తీర్ణాలలో 21 శాతం వృద్ధి నమోదు కాగా.. ఆ తర్వాతి ఏడాది నుంచి విస్తీర్ణాలలో క్షీణతే కనిపిస్తుంది. చెన్నైలో ఏడాది కాలంలో విస్తీర్ణాలు 6 శాతం మేర తగ్గాయి. 2022 క్యూ1లో 1,250 చ.అ. లుగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 1,175 చ.అ.లకు క్షీణించాయి. కరోనా తొలి దశలో చిన్నవైనా పర్లేదు సొంతిల్లు కావాలనే భావన గృహ కొనుగోలుదారులలో రావటంతో అప్పటి నుంచి ఎంఎంఆర్‌లో ఫ్లాట్ల విస్తీర్ణాలు క్రమంగా తగ్గుతున్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఎంఎంఆర్, చెన్నైలలో పెద్ద సైజు గృహాల సరఫరా తగినంత ఉండటం, ఖరీదైన మార్కెట్లు కావటం కూడా చిన్న సైజు ఇళ్ల సరఫరా పెరగడానికి కారణమని పూరీ వివరించారు. -
కుక్కంత ఎలుక!
మెల్బోర్న్: ప్రస్తుత ఎలుకలకు దాదాపు పది రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న ఏడు భారీ ఎలుక శిలజాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఏకంగా శునకం పరిమాణంలో ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జూలియన్ లూయిస్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం తూర్పు తైమూర్‌లో ఈ శిలాజాలను గుర్తించింది. ఇప్పటివరకూ గుర్తించిన ఎలుక జాతుల్లో ఇవే అతిపెద్దవని లూయిస్ తెలిపారు. ఇవి ఐదు కిలోలకు పైగా ఉన్నట్లు చెప్పారు.సాధారణంగా ఎలుకలు అరకిలో ఉంటాయని తెలిపారు. తాజాగా గుర్తించిన ఎలుక జాతులు అంతరించిపోవడానికి గల కారణాలపై ప్రస్తుతం దృష్టిసారించినట్లు చెప్పారు. ఖనిజ పనిముట్లు వాడకం ప్రారంభమైన తరువాత పెద్ద సంఖ్యలో అడవులు నరికివేత కారణంగా ఈ ఎలుక జాతులు కనుమరుగై ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య ఆసియాలో తొలి మానవ సంచారం గురించి తెలుసుకునే ప్రాజెక్టులో భాగంగా లూయిస్ బృందం పనిచేస్తోంది.