bigotry
-
నైరాశ్యంలో విపక్షాలు
న్యూఢిల్లీ: ప్రజలు తమను ఆదరించడం లేదన్న నిరాశతో విపక్షాలు విభజన రాజకీయాలకు తెర తీశాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మండిపడ్డారు. మోదీ పాలనలో దేశంలో మతోన్మాదం పెరుగుతోందంటూ 13 విపక్ష పార్టీలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దేశవాసులనుద్దేశించి సోమవారం ఆయన లేఖ రాశారు. ‘‘ఓటుబ్యాంకు, విభజన రాజకీయాలకు పాల్పడి కూడా వరుస ఎన్నికల్లో విపక్షాలు ఘోర ఓటమినే మూటగట్టుకుంటున్నాయి. మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు సాధికారత లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. అభివృద్ధిని అడ్డుకోజూస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకతే ఏకైక ఎజెండాగా ఒక్కటై విభజన రాజకీయాలకు తెర తీస్తున్నాయి’’ అంటూ మండిపడ్డారు. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన వాళ్లు ఇప్పుడు సోదిలో కూడా లేకుండా పోతుండటంపై ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కాంగ్రెస్‌కు చురకలు వేశారు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు అధికారంలో ఉన్న రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న మత ఘర్షణలు, రాజకీయ హింసపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మత హింసకు కారకులు మీరే విపక్షాల అసలు రంగు ప్రజల ముందు క్రమంగా బయట పడుతోందని నడ్డా అన్నారు. దాంతో వాటికి ఎటూ పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘1966లో గో వధను నిషేధించాలంటూ పార్లమెంటు బయట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాధువులపై నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాల్పులు జరిపించలేదా? ఆమె హత్యానంతరం సిక్కులపై భారీ హత్యాకాండ జరిగితే, పెద్ద చెట్టు కూలినప్పుడు ఆ మాత్రం ప్రకంపనలుంటాయని కుమారుడు రాజీవ్‌గాంధీ బాధ్యాతారహితంగా మాట్లాడలేదా? 1969లో గుజరాత్లో, 1980లో మొరాదాబాద్, 1984లో భివాండీ, 1989లో భాగల్పూర్ తదితర చోట్ల మత ఘర్షణలకు కారకులెవరు? దారుణమైన మత హింస బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు కాదా?’’ అని నడ్డా ప్రశ్నించారు. ఇప్పటికైనా విభజనవాదం వదిలి అభివృద్ధి రాజకీయాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. -
ఎయిర్‌టెల్‌పై మండిపడుతున్న నెటిజన్లు
న్యూఢిల్లీ : ఓ మహిళా వినియోగదారురాలు ‘హిందూ కస్టమర్ సర్వీస్ పర్సన్నే పంపించండం’టూ చేసిన వివాదాస్పద అభ్యర్ధనను అంగీకరించడంతో ట్విటర్లో తెగ ట్రోల్ అవుతుంది టెలికాం దిగ్గజం ఎయిర్టెల్. వివరాల ప్రకారం...పూజా సింగ్ అనే మహిళా కస్టమర్ తన ఎయిర్టెల్ డీటీహెచ్ కనెక్షన్లో సమస్య ఉంది, దాన్ని పరిష్కరించమని ఎయిర్టెల్ కస్టమర్ సెంటర్‌కు ఫోన్ చేసింది. కొద్ది సేపటి తరువాత కంపెనీ, కస్టమర్ పూజ చేసిన కంప్లైంట్‌ను పరిష్కరించడానికి షోయబ్ అనే సర్వీస్ ఇంజనీర్‌ను పంపించింది. అందుకు పూజా కోపంతో ‘తాను ఇండియన్ హిందువునని..తనకు ముస్లింల సర్వీస్ మీద నమ్మకం లేదని..వెంటనే షొయబ్ స్థానంలో మరో హిందూ సర్వీస్ ఇంజనీర్‌ను పంపిచాలని’ కంపెనీకి ట్విటర్లో పోస్టు చేసింది. అందుకు స్పందించిన ఎయిర్టెల్ కంపెనీ వెంటనే షోయాబ్ స్థానంలో మరో హిందూ కస్టమర్ సర్వీస్ ఇంజనీర్‌ను పంపించింది. కంపెనీకి తనకు మధ్య జరిగిన మెసేజ్ చాట్‌ను ట్విటర్లో పోస్టు చేసింది పూజ. ఈ మెసేజ్‌లను చూసిన నెటిజన్లు ఎయిర్టెల్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘మీ కంపెనీ ఉద్యోగికి మద్దతు తెలపకుండా మత దురభిమానం ఉన్న వారిని ప్రోత్సాహిస్తున్నారంటూ’ ఎయిర్‌టెల్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గరం... ఎయిర్టెల్ చేసిన పనిని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విషయం గురించి ‘ఎయిర్టెల్ కంపెనీ తన ఉద్యోగులను మతం పేరుతో వేరు చేసి చూస్తుంది. మత దురభిమానాన్ని ప్రచారం చేసే ఇలాంటి కంపెనీకి కస్టమర్‌గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఇక మీదట నా సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఎయిర్టెల్ సేవల కోసం ఖర్చు చేయను. తక్షణమే నా నంబర్‌ను వేరే సర్వీస్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. అంతేకాక నా ఎయిర్టెల్ డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ కనేక్షన్‌లను కూడా తొలగించాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేసారు. ఇందుకు ఎయిర్టెల్ కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ ‘జరిగిన విషయానికి మేము చింతిస్తున్నాము. కంపెనీ ఎప్పుడు కూడా తన వినియోగదారులను, ఉద్యోగులను, భాగస్వాములను కుల, మత ప్రాతిపదికన వేరు చేసి చూడదం’టూ రీట్వీట్ చేసింది. -
కలసి తిరిగారంటే ఖతమ్..
మోరల్ పోలీసింగ్... ఇటీవల ఈ మాట తరచుగా వినిపిస్తూనే ఉంది. యువకులు, ప్రేమ జంటలపై మోరల్ పోలీసింగ్ పేరుతో మత ఛాందస వాదులు దాడులు చేయడం సర్వసాధారణమైపోయింది. కొన్ని మత సంస్థలకు చెందిన ముఠాలు నవ్యనాగరికతపై కన్నెర్ర చేస్తూ దాడులకు తెగబడుతున్నాయి. రాజ్యాంగం వీరికి ఎటువంటి హక్కులూ కట్టబెట్టక పోయినా... మతోన్మాదానికి మోరల్ పోలీసింగ్ పేరు పెట్టి హింసాతక్మక చర్యలకు పాల్పడుతున్నా, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటున్నా పట్టించుకునే నాధుడే ఉండడు. మోరల్ పోలీసింగ్ అంటూ ఇటీవల మంగుళూరులో ఓ ముస్లిం వ్యక్తిని కరెంటు స్తంభానికి కట్టి చావబాదారు. హిందూ మహిళతో మాట్లాడటమే అతడి తప్పైంది. కర్నాటక కోస్తా తీర ప్రాంతంలో మత, మూఢవిశ్వాసాలకు ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే మంగుళూరుకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని ఓ కళాశాలనుంచి ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేయడం, వారు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడం వెనుక కూడ మత విశ్వాసాన్ని అతిక్రమించడమే కారణంగా కనిపిస్తుంది. నిజానికి మోరల్ పోలీసింగ్ మాటున మారుమూల గ్రామాల్లో జరుగుతున్న కొన్ని మతతత్వ దాడులు వెలుగులోకి కూడా రావడం లేదు. కొంతకాలం క్రితం కర్నాటకలోని మారుమూల ప్రాంతంలో జరిగిన మూడు ఘటనలను గమనిస్తే ఈ నిజం తెలుస్తుంది. మంగుళూరుకు దగ్గరలోని విట్టల్ గ్రామంలోముగ్గురు యువకులు 'ముఠా' కాలేజీ క్యాంపస్ లో యువతీ యువకులు మాట్లాడుకుంటుండగా వారిపై దాడి చేశారు. దీని వెనుక మతతత్వం కనిపిస్తుంది. వారిద్దరూ రెండు మతాలకు చెందినవారు కావడమే కారణం. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేయడంతో వాతావరణం సర్దుమణిగింది. అలాగే పుత్తూరులోని ఓ సినిమాహాలు వద్ద ముస్లిం యువతితో హిందూ యువకుడు మాట్లాడినందుకు జరిగిన ఘటన మోరల్ పోలీసింగ్ పేరిట మతతత్వ దాడులకు దారి తీసింది. కర్నాటక కోస్తా తీర ప్రాంతంలో ఈ దాడులు సర్వ సాధారణమైపోయాయి. వందలాది ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలన్నీ జరిగిన సమయంలో ఏదో స్థానిక వార్తల్లో ఏమూలో కనిపించి మాయమవ్వడమే తప్ప... బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియడం లేదు. ముఖ్యంగా మోరల్ పోలీసింగ్ పేరున కర్నాటక దక్షిణ కోస్తాలో ఈ దాడులు తీవ్రమౌతున్నాయి. మోరల్ పోలీసింగ్ మాటున మూఢత్వం పెచ్చుమీరుతోంది. యువసంఘాలూ, సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి... సమాజానికి క్రమశిక్షణ నేర్పుతామన్న ధోరణిలో దాడులకు తెగబడుతున్నాయి. స్థానిక పౌరులను ప్రజలనూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పోలీసులే చెప్తున్నారు. వీటిలో చాలావరకూ కనీసం పోలీస్ స్టేషన్ వరకూ కూడ రావడం లేదు. ఈ ఏడాది పన్నెండు మోరల్ పోలీసింగ్ ఘటనలు ఈ ప్రాంతంలో వెలుగు చూశాయంటే ఇక్కడ వీరి ప్రభావం ఎంతగా ఉందో తెలుస్తుంది. ఇక స్థానిక ప్రజలు కూడ మోరల్ పోలీసింగ్ భయంతో వణికిపోతున్నారు. తల్లితండ్రులు తమ పిల్లలకు భద్రత లేకుండాపోయిందని వాపోతున్నారు. స్నేహితులపై కూడా దాడులకు పాల్పడుతున్న నేటి పరిస్థితుల్లో ప్రాచీన నాగరికతను దృష్టిలో పెట్టుకొని రాసిన కొన్ని చట్టాలను ఆధునిక సమాజంలో తిరగ రాయాల్సిన అవసరం ఉందని అభ్యుదయ వాదులు అభిప్రాయ పడుతున్నారు. అసభ్యత, అశ్లీలత వంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు పోలీసులు కేసులు పెట్టాలి. విచారించి చర్యలు తీసుకోవాలి. కానీ యువత మోరల్ పోలీసింగ్ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నైతిక విలువలను కాపాడేందుకు ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఛాందస వాదాన్ని భుజాన వేసుకొని దాడులకు తెగబడటం ఎంతమాత్రం సమంజసం కాదు.