Bikaner rape case
-
ప్రతీకారం తీర్చుకునేందుకు.. రేప్ కేసు పెట్టాడు
బికనీర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బికనీర్ రేప్ కేసు అవాస్తవమని రాజస్థాన్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనితా బడేల్ ప్రకటించారు. స్కూలు టీచర్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు బాలిక తండ్రి తప్పుడు కేసు పెట్టాడని, అతను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు. బికనీర్‌లో ఎనిమంది టీచర్లు 13 ఏళ్ల బాలికపై ఏడాదిన్నర పాటు అత్యాచారం చేశారని ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఇతర మంత్రులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఈ అమ్మాయి స్కూలు మానేసి నాలుగేళ్లు అవుతోందని, ఆమెపై టీచర్లు లైంగికదాడి చేయలేదని విచారణలో తేలినట్టు మంత్రి చెప్పారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్టు బాలిక తండ్రి అంగీకరించాడని తెలిపారు. గతంలో స్కూలు యాజమాన్యం ఆయనపై కేసు పెట్టినట్టు విచారణలో తేలిందని, దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీచర్లపై అసత్య ఆరోపణలు చేశాడని చెప్పారు. సంబంధిత బాలికతో మాట్లాడనివ్వకుండా ఇంట్లో పెట్టి తాళం వేశాడని తెలిపారు. టీచర్లపై నమోదైన కేసును తొలగిస్తామని, బాలిక తండ్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. -
టీచర్ల రేప్ కేసులో విషాదకర వాస్తవాలు
బికనీర్: రాజస్థాన్‌లోని బికనీర్‌లో 13 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది టీచర్లు సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో విషాదకర, దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు ఏడాదన్నర పాటు బాధితురాలికి నరకం చూపించారు. ఫోటొలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ అమ్మాయి గర్భం దాల్చకుండా ఉండేందుకు బలవంతంగా అబార్షన్ పిల్స్ వాడించారు. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న బాధితురాలు ప్రస్తుతం బికనీర్ మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆ అమ్మాయి శరీరంలో సున్నిత భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న టీచర్లు మృగాళ్లా ప్రవర్తించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా చెప్పారు. బాధితురాలికి వైద్యం చేయించే బాధ్యతను ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తీసుకున్నారు. ముఖ్యమంత్రి వసుంధర రాజె స్వయంగా ఈ కేసును పరిశీలిస్తున్నారు.