టీచర్ల రేప్ కేసులో విషాదకర వాస్తవాలు
బికనీర్: రాజస్థాన్‌లోని బికనీర్‌లో 13 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది టీచర్లు సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో విషాదకర, దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు ఏడాదన్నర పాటు బాధితురాలికి నరకం చూపించారు. ఫోటొలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ అమ్మాయి గర్భం దాల్చకుండా ఉండేందుకు బలవంతంగా అబార్షన్ పిల్స్ వాడించారు.
బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న బాధితురాలు ప్రస్తుతం బికనీర్ మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆ అమ్మాయి శరీరంలో సున్నిత భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న టీచర్లు మృగాళ్లా ప్రవర్తించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా చెప్పారు. బాధితురాలికి వైద్యం చేయించే బాధ్యతను ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తీసుకున్నారు. ముఖ్యమంత్రి వసుంధర రాజె స్వయంగా ఈ కేసును పరిశీలిస్తున్నారు.