ఐదు వన్డేల్లో నాలుగో హాఫ్ సెంచరీ..
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక యువ సంచలనం కుశాల్ మెండిస్ మరోసారి రాణించాడు. ఓ వైపు ఆసీస్ పేసర్ స్టార్క్, మరోవైపు స్పిన్నర్ లియాన్ 12 పరుగులకే లంక ఓపెనర్లను పెవిలియన్ బాట పట్టించగా కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ(69 బంతుల్లో 69 పరుగులు: 9 ఫోర్లు) చేశాడు. 27వ ఓవర్ చివరి బంతికి జంపా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటై నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
కుశాల్ మెండిస్ అతడి వన్డే కెరీర్ లో ఇది ఐదవ అర్థ శతకం కాగా, చివరి ఐదు వన్డేల్లో ఇది నాలుగోది కావడంవిశేషం. ఇది అతడికి కేవలం 9వ వన్డే మాత్రమే. ఆసీస్ తో టెస్టు సిరీస్ లో అరంగేట్రంలోనే అదరగొట్టిన కుశాల్ వన్డే సిరీస్ లో జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 28 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. మరో బ్యాట్స్ మన్ చండిమల్(67 బంతుల్లో 48 పరుగులు: 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. చివరి ఐదు వన్డేల్లో హాఫ్ సెంచరీలు నమోదుచేసిన చండిమల్ జంపా బౌలింగ్ లోనే వికెట్లు ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం మాథ్యూస్(7), డి సిల్వా(6) క్రీజులో ఉన్నారు.