blue tongue
-
విస్తరిస్తున్న బ్లూటంగ్ మహమ్మారి
కానరాని నిర్మూలన చర్యలు పిట్టల్లా రాలుతున్న మూగజీవాలు అయోమయంలో పెంపకం దారులు పట్టించుకోని అధికారులు మెదక్ రూరల్: మూగజీవాలకు బ్లూటంగ్ అనే మహమ్మారి సోకి పిట్లల్లా రాలిపోతున్నాయి. అయినా సంబంధిత వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని గొర్రెలు, మేకల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మండలంలోని వెంకటాపూర్, గుట్టకిందిపల్లి, శివ్వాయిపల్లి, బూర్గుపల్లి, వాడి తదితర గ్రామాలలో గల గొర్రెలకు బ్లూటంగ్ అనే వ్యాధి సోకడంతో జీవాలకు నోట్లో పుండ్లు ఏర్పడి, మేత మానేసి, దగ్గు, నాలిక నీలి రంగుగా మారడం, కాళ్లు చచ్చుపడి పోయి నడవలేని స్తితికి చేరుకుని చివరికి మృతి చెందుతున్నాయి. ఇలా ఒక్కో రైతు వద్ద పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. దీంతో మూగ జీవాల మీదనే ఆధారపడి జీవించే పశుపోషకులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశువైద్యాధికారులు మాత్రం బ్లూటంగ్ వ్యాధి నిర్మూలన కోసం ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లను సరఫరా చేయలేదు. ఫలితంగా గొర్రెలు, మేకల పెంపకందారులు వేల రూపాయలను వెచ్చించి ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి మందులను తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మూగజీవాల పోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి బ్లూటంగ్ వ్యాధిని నిర్మూలనకు వాక్సిన్ను ప్రభుత్వాస్పత్రుల ద్వారా అందించాలని పెంపకం దారులు కోరుతున్నారు. వేల రూపాయల ఖర్చు గొర్రెల పెంపకం పైనే ఆధారపడి జీవిస్తున్నాం. మాయదారి రోగంతో జీవాలు ఒక్కొక్కటిగా మృతి చెందుతున్నాయి. జీవాలను కాపాడేందుకు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రైవేట్ మెడికల్ దుకాణాలలో మందులను కొనుగోలుచేస్తున్నాం. ప్రభుత్వం మందులను సరఫరా చేయడంలేదు. ఈ ఏడాదిలో సుమారు 30 జీవాలు రోగంతో మృతి చెందాయి. ఒక్కో గొర్రె నాలుగు వేల పైనే ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మందులను సరఫరా చేయాలి. - పాత్లూరితార్యా-వెంకటాపూర్ తండా జీవాలు నడవలేక పోతున్నాయి వింత రోగంతో జీవాలు ఇప్పటికే మృతి చెందాయి.ఇంకా కొన్ని జీవాలు నడవలేక పోతున్నాయి.కాపాడేందుకు వేళ రూపాయలు ఖర్చు చేస్తున్నాము. ప్రైవేట్ మెడికల్ దుఖానాలలో మందులు దొరుకుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాది నివారనకు మందులను సరఫరా చేయాలి. - మలావత్ రెడ్యా-వెంకటాపూర్ తాండా 24 రకాల వైరస్లున్నాయి బ్లూటంగ్ అనేది గొర్రెలకు సోకె ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి క్యూలీఫైర్ అనే దోమ కుట్టడం వల్ల, వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సంక్రమిస్తుంది.బ్లూటంగ్ లో 24 రకాల వైరస్లు ఉన్నాయి.సీరం తీసుకోని వాక్సిన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ప్రైవేటులో లభించే వ్యాక్సిన్లో కేవలం 5 రకాల టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. - వెటర్నరి అధికారి ఉమమసహేరా -
నీలినాలుక.. నివారణే మందు!
గొర్రెల్లో నీలినాలుక వ్యాధి.. దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి సకాలంలో గుర్తించకుంటే అనర్థం చికిత్స కంటే నివారణ చర్యలే కీలకం గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్రెడ్డి సలహాలు, సూచనలు గజ్వేల్: ప్రస్తుత సీజన్లో గొర్రెల్లో సోకే నీలి నాలుక వ్యాధి (బ్లూటంగ్) వల్ల కాపర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తమై నివారణ చర్యలు చేపడితే గొర్రెలను ప్రాణనష్టం నుంచి కాపాడుకోవచ్చని గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్రెడ్డి (సెల్ నెం: 9505056118) సూచిస్తున్నారు. ఈ వ్యాధి నివారణపై ఆయన అందించిన సలహాలు, సూచనలివి. వ్యాధి సోకే కాలం: దోమలు ఉధృతంగా ఉండే ఆగస్టు, సెప్టెంబర్ నెలలు. దేని ద్వారా సోకుతుంది: అర్జి వైరస్ క్రిముల ద్వారా. ఎలా సోకుతుంది: క్యూలికాయిడస్ అనే దోమకాటు ద్వారా సోకుతుంది. లక్షణాలు: వ్యాధి మందలోని సగం జీవాలకు సోకితే 10 శాతానికి పైగా గొర్రెలు మరణిస్తాయి. జ్వరం 105 డిగ్రీల నుంచి 107 ఫారెన్హీట్ డిగ్రీల వరకు ఉంటుంది. మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక, ముఖం వాచి ఎర్రబడుతుంది. నోటి నుంచి నురుగతో కూడిన చొంగ, కళ్లు, ముక్కులు వాచి స్రావాలు కారుతాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుగా మారుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. గిట్టల పైభాగం కరోనెట్ ఎర్రగా కందిపోయి వాచి చీము పట్టి నడవలేక జీవాలు కుంటుతుంటాయి. మేత తినలేకపోవడం వల్ల నీరసించి బరువును కోల్పోయి మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి మేకల్లో అరుదుగా సోకుతుంది. చికిత్స: వైరస్ వ్యాధి అయినందున చికిత్స వల్ల ప్రయోజనం ఉండదు. సెకండరీ బాక్టీరియా వల్ల కలిగే దుష్ఫలితాల నివారణకు యాంటీబయోటిక్ ఇంజక్షన్లు 3-5 రోజులు వాడాలి. నోటి పుండ్లను 5 శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి బోరోగ్లిజరిన్ పూయాలి. నివారణ: 22 రకాల సిరోటైపులు ఈ వ్యాధిని కలిగిస్తున్నందున టీకాల తయారీ వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. టీకాల తయారీకి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి వ్యాధిని అదుపు చేయడానికి టీకాలు ప్రస్తుతం అందుబాటులో లేనందున నివారణ చర్యలపై శ్రద్ధ చూపాలి. వ్యాధి తీవ్రతపై సూర్యరశ్మి ప్రభావం ఉంటుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలను నీడలో ఉంచి చికిత్స చేయించాలి. మందలో పంపకూడదు. ఈ వ్యాధి దోమకాటు ద్వారా ప్రధానంగా వ్యాపిస్తున్నందున దోమల నివారణకు వేపాకు లేదా నీలగిరి లేదా కలబంద లేదా పిడకల్ని కాల్చి దోమలను నివారించాలి. రాత్రి వేళల్లో ఎలక్ట్ట్లికల్ బల్బులు పెడితే వెలుతురుకు దోమల ఉధృతి తగ్గుతుంది. మాంసం, పాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాల్ని మాంసానికి కోయవద్దు. పాలను గొర్రె పిల్లలు తాగకుండా చూడాలి. జీవాలకు సక్రమంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తుంటే నీలి నాలుక వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది.