
నడవలేని స్థితిలో ఉన్న గొర్రెలు
కానరాని నిర్మూలన చర్యలు
పిట్టల్లా రాలుతున్న మూగజీవాలు
అయోమయంలో పెంపకం దారులు
పట్టించుకోని అధికారులు
మెదక్ రూరల్: మూగజీవాలకు బ్లూటంగ్ అనే మహమ్మారి సోకి పిట్లల్లా రాలిపోతున్నాయి. అయినా సంబంధిత వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని గొర్రెలు, మేకల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మండలంలోని వెంకటాపూర్, గుట్టకిందిపల్లి, శివ్వాయిపల్లి, బూర్గుపల్లి, వాడి తదితర గ్రామాలలో గల గొర్రెలకు బ్లూటంగ్ అనే వ్యాధి సోకడంతో జీవాలకు నోట్లో పుండ్లు ఏర్పడి, మేత మానేసి, దగ్గు, నాలిక నీలి రంగుగా మారడం, కాళ్లు చచ్చుపడి పోయి నడవలేని స్తితికి చేరుకుని చివరికి మృతి చెందుతున్నాయి. ఇలా ఒక్కో రైతు వద్ద పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి.
దీంతో మూగ జీవాల మీదనే ఆధారపడి జీవించే పశుపోషకులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశువైద్యాధికారులు మాత్రం బ్లూటంగ్ వ్యాధి నిర్మూలన కోసం ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్‌లను సరఫరా చేయలేదు. ఫలితంగా గొర్రెలు, మేకల పెంపకందారులు వేల రూపాయలను వెచ్చించి ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి మందులను తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మూగజీవాల పోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి బ్లూటంగ్ వ్యాధిని నిర్మూలనకు వాక్సిన్‌ను ప్రభుత్వాస్పత్రుల ద్వారా అందించాలని పెంపకం దారులు కోరుతున్నారు.
వేల రూపాయల ఖర్చు
గొర్రెల పెంపకం పైనే ఆధారపడి జీవిస్తున్నాం. మాయదారి రోగంతో జీవాలు ఒక్కొక్కటిగా మృతి చెందుతున్నాయి. జీవాలను కాపాడేందుకు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రైవేట్ మెడికల్ దుకాణాలలో మందులను కొనుగోలుచేస్తున్నాం. ప్రభుత్వం మందులను సరఫరా చేయడంలేదు. ఈ ఏడాదిలో సుమారు 30 జీవాలు రోగంతో మృతి చెందాయి. ఒక్కో గొర్రె నాలుగు వేల పైనే ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మందులను సరఫరా చేయాలి. - పాత్లూరితార్యా-వెంకటాపూర్ తండా
జీవాలు నడవలేక పోతున్నాయి
వింత రోగంతో జీవాలు ఇప్పటికే మృతి చెందాయి.ఇంకా కొన్ని జీవాలు నడవలేక పోతున్నాయి.కాపాడేందుకు వేళ రూపాయలు ఖర్చు చేస్తున్నాము. ప్రైవేట్ మెడికల్ దుఖానాలలో మందులు దొరుకుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాది నివారనకు మందులను సరఫరా చేయాలి. - మలావత్ రెడ్యా-వెంకటాపూర్ తాండా
24 రకాల వైరస్‌లున్నాయి
బ్లూటంగ్ అనేది గొర్రెలకు సోకె ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి క్యూలీఫైర్ అనే దోమ కుట్టడం వల్ల, వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సంక్రమిస్తుంది.బ్లూటంగ్ లో 24 రకాల వైరస్‌లు ఉన్నాయి.సీరం తీసుకోని వాక్సిన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ప్రైవేటులో లభించే వ్యాక్సిన్‌లో కేవలం 5 రకాల టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. - వెటర్నరి అధికారి ఉమమసహేరా