నీలినాలుక.. నివారణే మందు! | blue tongue.. prevention is must | Sakshi
Sakshi News home page

నీలినాలుక.. నివారణే మందు!

Published Tue, Sep 13 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

గొర్రెల మంద

గొర్రెల మంద

  • గొర్రెల్లో నీలినాలుక వ్యాధి..
  • దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి
  • సకాలంలో గుర్తించకుంటే అనర్థం
  • చికిత్స కంటే నివారణ చర్యలే కీలకం
  • గజ్వేల్‌ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహాలు, సూచనలు
  • గజ్వేల్‌: ప్రస్తుత సీజన్‌లో గొర్రెల్లో సోకే నీలి నాలుక వ్యాధి (బ్లూటంగ్‌) వల్ల కాపర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తమై నివారణ చర్యలు చేపడితే గొర్రెలను ప్రాణనష్టం నుంచి కాపాడుకోవచ్చని గజ్వేల్‌ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి (సెల్‌ నెం: 9505056118) సూచిస్తున్నారు. ఈ వ్యాధి నివారణపై ఆయన అందించిన సలహాలు, సూచనలివి.

    వ్యాధి సోకే కాలం:
    దోమలు ఉధృతంగా ఉండే ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు.
    దేని ద్వారా సోకుతుంది: అర్జి వైరస్‌ క్రిముల ద్వారా.
    ఎలా సోకుతుంది: క్యూలికాయిడస్‌ అనే దోమకాటు ద్వారా సోకుతుంది.
    లక్షణాలు: వ్యాధి మందలోని సగం జీవాలకు సోకితే 10 శాతానికి పైగా గొర్రెలు మరణిస్తాయి. జ్వరం 105 డిగ్రీల నుంచి 107 ఫారెన్‌హీట్‌ డిగ్రీల వరకు ఉంటుంది. మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక, ముఖం వాచి ఎర్రబడుతుంది. నోటి నుంచి నురుగతో కూడిన చొంగ, కళ్లు, ముక్కులు వాచి స్రావాలు కారుతాయి.

    వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుగా మారుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. గిట్టల పైభాగం కరోనెట్‌ ఎర్రగా కందిపోయి వాచి చీము పట్టి నడవలేక జీవాలు కుంటుతుంటాయి. మేత తినలేకపోవడం వల్ల నీరసించి బరువును కోల్పోయి మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి మేకల్లో అరుదుగా సోకుతుంది.
    చికిత్స: వైరస్‌ వ్యాధి అయినందున చికిత్స వల్ల ప్రయోజనం ఉండదు. సెకండరీ బాక్టీరియా వల్ల కలిగే దుష్ఫలితాల నివారణకు యాంటీబయోటిక్‌ ఇంజక‌్షన్లు 3-5 రోజులు వాడాలి. నోటి పుండ్లను 5 శాతం పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో శుభ్రం చేసి బోరోగ్లిజరిన్‌ పూయాలి.
    నివారణ:

    • 22 రకాల సిరోటైపులు ఈ వ్యాధిని కలిగిస్తున్నందున టీకాల తయారీ వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. టీకాల తయారీకి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి వ్యాధిని అదుపు చేయడానికి టీకాలు ప్రస్తుతం అందుబాటులో లేనందున నివారణ చర్యలపై శ్రద్ధ చూపాలి.
    • వ్యాధి తీవ్రతపై సూర్యరశ్మి ప్రభావం ఉంటుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలను నీడలో ఉంచి చికిత్స చేయించాలి. మందలో పంపకూడదు.
    • ఈ వ్యాధి దోమకాటు ద్వారా ప్రధానంగా వ్యాపిస్తున్నందున దోమల నివారణకు వేపాకు లేదా నీలగిరి లేదా కలబంద లేదా పిడకల్ని కాల్చి దోమలను నివారించాలి. రాత్రి వేళల్లో ఎలక్ట్ట్లికల్‌ బల్బులు పెడితే వెలుతురుకు దోమల ఉధృతి తగ్గుతుంది.
    • మాంసం, పాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాల్ని మాంసానికి కోయవద్దు. పాలను గొర్రె పిల్లలు తాగకుండా చూడాలి.
    • జీవాలకు సక్రమంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తుంటే నీలి నాలుక వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement