మీడియా ప్రతినిధిపై పార్కింగ్ సిబ్బంది దాడి: కేసు నమోదు
ఖైరతాబాద్: వాహన పార్కింగ్ ప్రాంతంలోకి వస్తే బండి నిలపకున్నా ఫీజు చెల్లించాల్సిందే నంటూ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద పార్కింగ్ సిబ్బంది దందాకు దిగారు. ఇదేమని ప్రశ్నించినందుకు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే..
ఓ దిన పత్రికలో సీనియర్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న బోడపాటి శ్రీనివాసరావు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇన్సూరెన్స్ చెల్లించాలని ఫోన్ రావడంతో అడ్రస్ వెతుక్కుంటూ బైక్‌పై ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఉన్న డాక్టర్ కార్స్ వద్దకు వెళ్లారు. అడ్రస్ అక్కడ కాదని వెనుదిరగ్గానే అక్కడే ఉన్న పార్కింగ్ సిబ్బంది బండి కదలకుండా తాడు అడ్డుపెట్టి పార్కింగ్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను డాక్టర్ కార్స్ వద్దకు వెళ్లానని.. ఎందుకు ఫీజు చెల్లించాలని ప్రశ్నించగా.. ఒకసారి లోపలికి ఎంటర్ అయితే ఫీజు చెల్లించాలంటూ పార్కింగ్‌లో ఉన్న జి.సుభాష్(40), నర్సింగరావుతో పాటు మరో వ్యక్తి కలిసి శ్రీనివాసరావుపై దాడి చేశారు.
బండి తాళాలు లాక్కొని దిక్కున్న చోట చెప్పుకోమంటూ దురుసుగా ప్రవర్తించారు. పార్కింగ్ యజమాని ఎవరని, మీకు జీహెచ్ఎంసీ కేటాయించిన పార్కింగ్ స్లాట్ కాపీ చూపించాలని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారంటూ బాధితుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.