ఇరిగేషన్ శాఖలో దొంగలుపడ్డారు..!
తూర్పుగోదావరి(మలికిపురం): రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో దొంగలు పడ్డారని రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్, వైఎస్సార్సీపీ రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన ప్రాజెక్టులకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. కానీ ఆ నిధులను మంత్రులు పంచుకుంటున్నారని ఆరోపించారు.
రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 7వేల కోట్లు మంజూరు చేసి పూర్తిచేస్తే ఆ ప్రాజెక్టుకు పురుషోత్తమపట్నం ప్రాజెక్టు పేరుతో మరో రూ. 2వేల కోట్లు మంజూరు చేసి ఆ నిధుల స్వాహాకు రంగం సిద్ధం చేసుకున్నారని అన్నారు. గత ఏడాది పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రూ. 1700కోట్లు మంజూరు చేసి రాజశేఖరరెడ్డి తవ్వించిన పోలవరం ప్రాజెక్టులోకి నీరు తోడినట్లే పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారన్నారు.
పట్టిసీమతోపాటు, పురుషోత్తమపట్నం ప్రాజెక్టు నిధులు కూడా గంగలో పోసినట్లేనని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ప్యాకేజీ పేరుతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని ఇరిగేషన్ శాఖలో ఖర్చు చేసి ముఖ్యమంత్రితో సహా, మంత్రులు దేవినేని, యనమల ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.