టీవీ చానల్స్ ప్రసారాల పైరసీదారుల అరెస్టు
పరారీలో ప్రధాన సూత్రధారి
హైదరాబాద్ : వందలాది టీవీ ఛానల్స్ ప్రసారాల పైరసీ నిందితులను హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. అమెరికా కేంద్రంగా ఫైసల్అఫ్తాబ్, సాజిద్సోహల్, సుమిత్హౌజాలు ‘జాదు టీవీ’ నిర్వహిస్తున్నారు. సాంకేతికత, సెటప్‌బాక్స్ లను ఉపయోగించుకొని మన దేశంలోని 115 చానల్స్‌ను పైరసీ చేశారు. వీటి కార్యక్రమాలను కొద్ది తేడాతో వారి సెటప్ బాక్స్ ల్లో ప్రసారమయ్యేలా చేసేవారు. అమెరికాలో తెలుగు టీవీ చానల్స్ సరిగా రాకపోవడంతో కొన్ని టీవీ చానల్స్ చొరవతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు.
బోయిన్‌పల్లిలోని మానసరోవర్ అపార్ట్‌మెంట్‌పై సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణా ఇన్స్పెక్టర్లు మాజిద్, కరుణాకర్‌రెడ్డిలు తమ బృందంతో దాడి చేసి కాషిఫ్ అలీ ఖాన్(27), జగదీశ్వర్‌చారి, యన్.సాయికుమార్, జె.బి.మేఘనాథలను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి సుమిత్ హౌజా పరారీలో ఉన్నాడు. త్వరలో ఇతనిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేస్తామని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ అంజనీకుమార్జైన్, జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డి, డీసీపీ పాలరాజులు పాల్గొన్నారు.