సంగీతకారుడి ఔదార్యం
అంతర్యుద్ధంలో నలిగిపోతున్న సిరియా నుంచి కుటుంబంతో సహా బయలుదేరి, ప్రమాదవశాత్తు మధ్యదరా సముద్రంలో ముగినిపోయి.. టర్కీ తీరంలో శవమై తేలిన మూడేళ్ల చిన్నారి అయిలన్ కుర్దీ ఫొటో ప్రపంచాన్ని కంటతడి పెడుతున్నది. యూరప్‌లోని పలు దేశాల్లోకి చొచ్చుకొచ్చిన శరణార్థుల సహాయం కోసం ఇప్పటికే పలువురు దాతలు భారీ విరళాలలను ప్రకటించారు. తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ సంగీతకారుడు బాబ్ గెల్డాఫ్.. కెంట్, లండన్ నగరాల్లోని తన ఇళ్లల్లో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తానన్నారు.
శుక్రవారం ఓ రేడియో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోఈ ప్రకటన చేసిన ఆయన శరణార్థులను లోపలికి అనుమతించని దేశాలపై విరుచుకుపడ్డారు. 'శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే కొత్త ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని పలు దేశాధినేతలు చెబుతున్నారు. కనీస మానవత్వం చూపని పక్షంలో మిగిలేది అపకీర్తే తప్ప మరోటికాదు. నావరకైతే చేతనైనంతలో సాయం చేయాలనుకుంటున్నా. కెంట్, లండన్లలోని నా ఇళ్లల్లో నాలుగు కుటుంబాలు హాయిగా ఉండొచ్చు. ఇవాళో, రేపో శరణార్థి శిబిరానికి వెళ్లి వారిని నా వెంట తీసుకొస్తా' అని బాబ్ చెప్పారు. సంగీతకారుడిగానేకాక, పలు సామాజిక, రాజకీయ కార్యాక్రమాల్లోనూ బాబ్ పాల్గొంటారు.
అంతర్యుద్ధంలో నలిగిపోతున్న సిరియా, లిబియా, యెమెన్ తదితర దేశాల నుంచి పలు మార్గాల ద్వారా యూరప్ నకు వచ్చిన శరణార్థుల సంఖ్య 1.5 లక్షలకు చేరింది.