మంత్రిగారికి కోపమొచ్చింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రొటోకాల్ పాటించని అధికారులపై మంత్రి ప్రసాద్‌కుమార్‌కు కోపం వచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు పాల్గొన్న కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ఆయన ఆగ్రహానికి కారణమైంది.
తన హక్కులను ఉల్లంఘించిన కలెక్టర్, ఎస్పీ సహా అటవీశాఖ అధికారులపై ఏపీ లెజిస్లేచర్ రూల్ 233(1) కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి ప్రసాద్‌కుమార్ లేఖ రాశారు. 19వ తేదీన వికారాబాద్‌లోని అనంతగిరి అటవీక్షేత్రంలో జింకలను వదిలే కార్యక్రమానికి డీజీపీ, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తనకు పిలుపు రాకపోవడాన్ని మంత్రి ప్రసాద్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు.
స్థానిక ఎమ్మెల్యే తానేననే విషయాన్ని గుర్తించకపోవడం, అత్యున్నత అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి త నను పిలువకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని కావడంతోనే అధికారయంత్రాంగం తన పట్ల వివక్ష చూపిందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించకుండా తనను అగౌరవపరిచిన హైదరాబాద్ సర్కిల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ బీఎస్ఎస్ ప్రసాద్, డీఎఫ్ఓ నాగభూషణం సహా కలెక్టర్ బి.శ్రీధర్, ఎస్పీ రాజకుమారిపై చర్యలు తీసుకునేందుకు.. ఈ అంశాన్ని హక్కుల కమిటీకి నివేదించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.