Building Regulation
-
400 ఏళ్ల చరిత్ర.. ముట్టుకుంటే ఊడిపోతోంది
సాక్షి, హైదరాబాద్: బాగా పాతబడిపోవటం, వాహన కాలుష్య ప్రభావం.. వెరసి చార్మినార్ కట్టడం పైపూత అత్యంత బలహీనంగా మారిపోతోంది. ఇప్పుడు కట్టడంలోని చాలా ప్రాంతాల్లో ముట్టుకుంటే చాలు పొరలుపొరలుగా మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య బాగా పెరిగిపోయింది. దాదాపు ఒక అంగుళం నుంచి రెండు అంగుళాల మేర కట్టడంపైనున్న డంగు సున్నం పూత అత్యంత బలహీనంగా మారినట్టు కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం గుర్తించింది. దీంతో అత్యవసర చర్యలు ప్రారంభించింది. కట్టడంలో ఏయే ప్రాంతాల్లో డంగుసున్నం పొరలు బలహీనంగా మారాయో గుర్తించి అంతమేర దాన్ని తొలగించి సంప్రదాయ డంగుసున్నం మిశ్రమాన్ని మెత్తే పని ప్రారంభించారు. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పై పొర తొలగించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించనున్నట్టు తెలిసింది. సీనియర్ కన్సర్వేషన్ అసిస్టెంట్ భానుప్రకాశ్ వర్మ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ఆరు నెలలపాటు పనులు.. చార్మినార్ పరిరక్షణ చర్యలు తరచూ జరిగేవే. అయితే ఒకేసారి కావాల్సినన్ని నిధులు ఇవ్వకపోవడంతో మధ్యమధ్య విరామం ఇస్తూ పనులు చేస్తున్నారు. ఇది కూడా సమస్యలకు కారణమవుతోంది. రెండేళ్లక్రితం మరమ్మతు పనులు నిర్వహించారు. అప్పట్లో రెండు దఫాల్లో రూ.35 లక్షలు రావటంతో వాటితో పనులు చేసి ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కేంద్రం కొన్ని నిధులు ఇవ్వటంతో వాటితో అత్యవసరంగా పనులు ప్రారంభించారు. విరామం లేకుండా పనులు జరిగితే దాదాపు ఏడాదిన్నర కాలంలో మొత్తం పనులు పూర్తవుతాయి. రెండేళ్ల క్రితం మొదటి అంతస్తు నుంచి మినార్ల వరకు పరిరక్షణ చర్యలు పూర్తి చేశారు. ఇప్పుడు దిగువ భాగంలో పనులు ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల క్రితం పనులు చేసిన చోట కూడా మట్టి రాలిపోతోంది. అప్పట్లో లేపనంలాగా అద్దిన పైపూత పటిష్టంగానే ఉన్నా... దానిలోపలి సున్నం మిశ్రమం బలహీనంగా మారటంతో పై పూత ఊడిపోతోంది. ఎందుకీ సమస్య.. కులీకుతుబ్‌షా 1591లో దీన్ని నిర్మాణం చేపట్టారు. 430 ఏళ్లు గడుస్తున్నందున స్వతహాగా కట్టడం మట్టి భాగం బలహీనపడింది. అయినప్పటికీ అది లోపలి రాతి నిర్మాణాలు పట్టుకుని నిలిచిఉంటుంది. కానీ.. దశాబ్దాలుగా కట్టడానికి అతి చేరువగా వాహనాలు తిరుగుతుండటంతో కాలుష్యం కాటేస్తోంది. వానాకాలంలో తడితో కలిసి రసాయన చర్య ఏర్పడి క్రమంగా గోడల డంగు సున్నం పొరలు బలహీనపడిపోయాయి. దీంతో పటుత్వం కోల్పోయి మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో సమస్య బాగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో పై పూతను తొలగించి కొత్త మిశ్రమాన్ని పూసి, ఆయా ప్రాంతాల్లో ఉండాల్సిన నగిషీలను తిరిగి ఏర్పాటు చేయనున్నారు. సోమవారం నుంచి ఆ పనులు మొదలు కానున్నాయి. తొలుత లాడ్‌బజార్ వైపు భాగానికి పనులు చేపట్టనున్నట్టు సమాచారం. -
క్రమబద్ధీకరణలో అక్రమాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ పరిధిలో లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. 2015 అక్టోబర్ 28 కటాఫ్ తేదీ తర్వాత అక్రమంగా నిర్మించిన భవనాలు, లే అవుట్ల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశంతో పురపాలక మంత్రి కె. తారక రామారావు... ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల అమల్లో అవినీతి, అక్రమాలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. అధికారులపై వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక బృందాలను రంగంలో దింపాలని సూచించారు. అక్రమార్కులపై నిఘా కోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని సైతం ప్రయోగించాలని యోచిస్తున్నారు. కటాఫ్ తేదీ తర్వాత వెలసిన భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం సైతం వేల సంఖ్యలో దరఖాస్తులొచ్చినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఈ దరఖాస్తుదారులకు నగర టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది సహకారం అందిస్తున్నారని కేటీఆర్ దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వం 2007-08లో ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ఆసరాగా చేసుకుని 2010లో నిర్మించిన అక్రమ భవనాలు, లే అవుట్లను కూడా పెద్ద ఎత్తున క్రమబద్ధీకరించినట్లు గతంలో వెలుగు చూసింది. అప్పట్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఈసారీ అక్రమాలకు తెరలేపేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ దృష్టికి సైతం వచ్చింది. దీనిపై గట్టి నిఘా ఉంచాలని సీఎం ఆదేశించడంతోనే మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. 2015 అక్టోబర్ 28న తీసిన జీపీఎస్‌తోపాటు శాటిలైట్ చిత్రాలతో పోల్చితే కటాఫ్ తేదీకి ముందు, ఆ తర్వాత నిర్మించిన భనవాలు, లే అవుట్ల సమాచారం స్పష్టంగా తెలిసిపోనుంది. -
జీవీఎంసీ ఆదాయానికి బీపీ‘ఎస్’
- అనధికారిక భవనాల క్రమబద్ధీకరణ - 10 వేల దరఖాస్తులొస్తాయని అంచనా - రెండు మాసాల గడువు విశాఖపట్నం సిటీ : గ్రేటర్ విశాఖ పరిధిలో అక్రమ నిర్మాణాలను అపరాధ రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2014 డిసెంబర్ 31వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. ఆలోగా నిర్మించుకున్న భవనాల అతిక్రమణలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. వాణిజ్య భవనాలు, నివాస భవనాలు, నివాసేతర భవన యజమానులకు ఇది ఉపశమనమి చ్చే సమాచారం. ఇందుకు రెండు మాసాల గడువు ఇచ్చింది. బుధవారం నుంచీ బీపీఎస్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తులు జీవీఎంసీకి వచ్చిపడుతున్నాయి. రెండు రోజుల్లోనే సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జీవీఎంసీలో ఈసారి 10 వేల భవనాలకు సంబంధించి దరఖాస్తులు వస్తాయని పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు భావిస్తున్నారు. గతంలో 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో17 వేల దరఖాస్తులను పరిష్కరించారు. అయిదారు వేల భవనాలుండిపోయాయి. గెడ్డలు ఆక్రమించి కట్టేయడం, ప్రభుత్వ భూముల్లో నిర్మించేయడం, రోడ్లు లేకుండా నిర్మాణాలు చేసేయడం వంటి సమస్యలతోపాటు సాంకేతిక అడ్డంకులున్న భవనాలకు అనుమతి ఇవ్వలేదు. ఆ భవనాలను క్రమబద్ధీకరించలేదు. ఈ సారి కొత్తగా 10 వేల ద రఖాస్తులు మాత్రమే వస్తాయని అంచనా. వీటి వల్ల జీవీఎంసీకి రూ. 50 కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని భావిస్తున్నారు. దరఖాస్తు ఇలా: - ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు రూ.10 వేల ఫీజును సౌకర్యంలో గానీ, మీ-సేవలో గానీ చెల్లించాలి. లేదా నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ ద్వారా చెల్లించవచ్చు. - నిబంధనలు అతిక్రమించిన నిర్మించిన మొత్తం స్థలానికి అపరాధ రుసుం లెక్కిస్తారు. 30 రోజుల్లో దీనిని చెల్లించవచ్చు. లేదా దరఖాస్తుతో బాటు చెల్లించవచ్చు - దర ఖాస్తు తిరస్కరిస్తే జరిమానాలో 10 శాతాన్ని మినహాయించుకుని మిగిలింది వాపసు చేస్తారు. - మురికివాడల్లోని భవనాలకు 50 శాతం అపరాధ రుసుం మినహాయింపు అమల్లో ఉంది. - దరఖాస్తుతోపాటు రూ. 10 వేలు చెల్లించిన రశీదు, దస్తావేజులు, ప్లాన్ కాపీ,తాజా పన్ను కాపీ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఉంటే ఇలవవ్వచ్చు లేదా అగ్నిమాపక శాఖ జారీ చేసిన సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఇంజనీర్ భవన ధృఢత్వం తెలిపే సర్టిఫికెట్ వంటి వన్నీ జతచేయాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి పత్రం కూడా జత చేయాలి.