క్రమబద్ధీకరణలో అక్రమాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ పరిధిలో లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. 2015 అక్టోబర్ 28 కటాఫ్ తేదీ తర్వాత అక్రమంగా నిర్మించిన భవనాలు, లే అవుట్ల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశంతో పురపాలక మంత్రి కె. తారక రామారావు... ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ల అమల్లో అవినీతి, అక్రమాలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. అధికారులపై వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక బృందాలను రంగంలో దింపాలని సూచించారు.
అక్రమార్కులపై నిఘా కోసం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని సైతం ప్రయోగించాలని యోచిస్తున్నారు. కటాఫ్ తేదీ తర్వాత వెలసిన భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం సైతం వేల సంఖ్యలో దరఖాస్తులొచ్చినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఈ దరఖాస్తుదారులకు నగర టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది సహకారం అందిస్తున్నారని కేటీఆర్ దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వం 2007-08లో ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలను ఆసరాగా చేసుకుని 2010లో నిర్మించిన అక్రమ భవనాలు, లే అవుట్లను కూడా పెద్ద ఎత్తున క్రమబద్ధీకరించినట్లు గతంలో వెలుగు చూసింది.
అప్పట్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఈసారీ అక్రమాలకు తెరలేపేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ దృష్టికి సైతం వచ్చింది. దీనిపై గట్టి నిఘా ఉంచాలని సీఎం ఆదేశించడంతోనే మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. 2015 అక్టోబర్ 28న తీసిన జీపీఎస్‌తోపాటు శాటిలైట్ చిత్రాలతో పోల్చితే కటాఫ్ తేదీకి ముందు, ఆ తర్వాత నిర్మించిన భనవాలు, లే అవుట్ల సమాచారం స్పష్టంగా తెలిసిపోనుంది.