జీవీఎంసీ ఆదాయానికి బీపీ‘ఎస్’
- అనధికారిక భవనాల క్రమబద్ధీకరణ
- 10 వేల దరఖాస్తులొస్తాయని అంచనా
- రెండు మాసాల గడువు
విశాఖపట్నం సిటీ : గ్రేటర్ విశాఖ పరిధిలో అక్రమ నిర్మాణాలను అపరాధ రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2014 డిసెంబర్ 31వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. ఆలోగా నిర్మించుకున్న భవనాల అతిక్రమణలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. వాణిజ్య భవనాలు, నివాస భవనాలు, నివాసేతర భవన యజమానులకు ఇది ఉపశమనమి చ్చే సమాచారం. ఇందుకు రెండు మాసాల గడువు ఇచ్చింది. బుధవారం నుంచీ బీపీఎస్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తులు జీవీఎంసీకి వచ్చిపడుతున్నాయి. రెండు రోజుల్లోనే సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జీవీఎంసీలో ఈసారి 10 వేల భవనాలకు సంబంధించి దరఖాస్తులు వస్తాయని పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు భావిస్తున్నారు. గతంలో 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో17 వేల దరఖాస్తులను పరిష్కరించారు.
అయిదారు వేల భవనాలుండిపోయాయి. గెడ్డలు ఆక్రమించి కట్టేయడం, ప్రభుత్వ భూముల్లో నిర్మించేయడం, రోడ్లు లేకుండా నిర్మాణాలు చేసేయడం వంటి సమస్యలతోపాటు సాంకేతిక అడ్డంకులున్న భవనాలకు అనుమతి ఇవ్వలేదు. ఆ భవనాలను క్రమబద్ధీకరించలేదు. ఈ సారి కొత్తగా 10 వేల ద రఖాస్తులు మాత్రమే వస్తాయని అంచనా. వీటి వల్ల జీవీఎంసీకి రూ. 50 కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని భావిస్తున్నారు.
దరఖాస్తు ఇలా:
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు రూ.10 వేల ఫీజును సౌకర్యంలో గానీ, మీ-సేవలో గానీ చెల్లించాలి. లేదా నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ ద్వారా చెల్లించవచ్చు.
- నిబంధనలు అతిక్రమించిన నిర్మించిన మొత్తం స్థలానికి అపరాధ రుసుం లెక్కిస్తారు. 30 రోజుల్లో దీనిని చెల్లించవచ్చు. లేదా దరఖాస్తుతో బాటు చెల్లించవచ్చు
- దర ఖాస్తు తిరస్కరిస్తే జరిమానాలో 10 శాతాన్ని మినహాయించుకుని మిగిలింది వాపసు చేస్తారు.
- మురికివాడల్లోని భవనాలకు 50 శాతం అపరాధ రుసుం మినహాయింపు అమల్లో ఉంది.
- దరఖాస్తుతోపాటు రూ. 10 వేలు చెల్లించిన రశీదు, దస్తావేజులు, ప్లాన్ కాపీ,తాజా పన్ను కాపీ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఉంటే ఇలవవ్వచ్చు లేదా అగ్నిమాపక శాఖ జారీ చేసిన సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఇంజనీర్ భవన ధృఢత్వం తెలిపే సర్టిఫికెట్ వంటి వన్నీ జతచేయాలి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి పత్రం కూడా జత చేయాలి.