captain lakshmikantha rao
-
ఈ నెల 16న కారెక్కనున్న కౌశిక్ రెడ్డి.. ఆయనతోపాటు మరొకరు?
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ కేంద్రంగా కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆది, సోమవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరిగాయి. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణలు లీక్ అయిన వెంటనే వేగంగా పావులు కదిలాయి. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడం జరిగిపోయింది. ఈ నెల 16న హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇటీవల టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే. లక్ష్మికాంతారావుతో పెద్దిరెడ్డి భేటీ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్దిరెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందగా, వయో భారంతో కెప్టెన్ పరామర్శకు వెళ్లలేదు. ఆదివారం పెద్దకర్మ ముగిసిన నేపథ్యంలో సోమవారం పెద్దిరెడ్డి స్వయంగా కెప్టెన్ ఇంటికి వెళ్లి 2 గంటల పాటు సమావేశమయ్యారు. హుజూరాబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పెద్దిరెడ్డి బీజేపీ తరఫున ఈసారి పోటీ చేయాలని భావించారు. ఈటల బీజేపీలో చేరడంతో ఆ అవకాశం కోల్పోయిన ఆయన బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి అంటీ ముంటనట్టుగానే బీజేపీతో ఉన్న పెద్దిరెడ్డి త్వరలోనే టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌తో గతంలో ఉన్న పరిచయాలు, తాజాగా సహచరుడు ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా కారెక్కడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై ‘సాక్షి’ ఆయనను సంప్రదించగా.. ఇప్పటివరకు తనను టీఆర్ఎస్లోకి ఎవరూ ఆహ్వానించలేదని, పిలుపొస్తే ఆలోచిస్తానని అన్నారు. -
అసైన్డ్ భూమిని ఆక్రమించడం తప్పు కాదా..?
హుజూరాబాద్: బాధ్యత గల మంత్రిగా ఉంటూ ఈటల రాజేందర్ 66 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించడం తప్పు కాదా?’ అని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ప్రశ్నించారు. బుధవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. హుజూ రాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను ఈటల ప్రోత్సహించారని ఆరోపించారు. కమలాపూర్ నియోజకవర్గంలో 2001లోనే బలమైన పార్టీగా అవతరించిందని, 2004లో ఈటల టీఆర్ఎస్లోకి వచ్చారన్నారు. ఈటలను సీఎం సొంత తమ్ముడిలా చూసుకున్నారని, పార్టీలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ‘రైతుబంధు’ను కేసీఆర్ ఇక్కడే ప్రారంభించారని.. అయినా పథకాలపై వ్యతిరేక ధోరణితో ఈటల మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’ -
ఓటుకు నోటు కేసులో బాబుకు శిక్ష తప్పదు..
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు, రేవంత్‌రెడ్డికి జైలు శిక్ష తప్పదని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భ్రష్టు పట్టించినట్లు తెలిపారు. మహాకూటమి పేరుతో టీడీపీ కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీతో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి పొత్తును అపవిత్ర కూటమిగా ఆయన అభివర్ణించారు. మహాకూటమి పేరుతో వస్తున్న ఆయా పార్టీలు మరోమారు తెలంగాణను భక్షించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తన సొంత గ్రామానికి తాగు నీరందించలేదన్నారు. ఆయన ఇక నియోజకవర్గానికి ఏం పనిచేస్తాడని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడించి టీఆర్ఎస్కు పట్టం కట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సుధీర్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు వంగ రవి, మాలోతు రాంచందర్ నాయక్, ఎస్డీ షరీఫోద్దిన్, ఏనుగు సత్యవతి, జిల్లెల గాల్‌రెడ్డి, మాడ్గుల అశోక్, బొల్లంపల్లి రమేష్ ఉన్నారు. -
అండకు దండ
2001 నుంచి కేసీఆర్‌తోనే కెప్టెన్ సాబ్ అన్ని సందర్భాల్లోనూ అధినేత వెన్నంటి నిలిచిన నేత సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ ఆవిర్భావం (2001) నుంచి కీలక సందర్భాల్లో పార్టీకి అండగా నిలిచిన మాజీ మంత్రి కెప్టెన్ వడితెల లక్ష్మీకాంతరావు అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ అన్ని సందర్భాల్లో కేసీఆర్‌కు అండగా నిలిచారు. కేసీఆర్ సైతం కెప్టెన్ లక్ష్మీకాంతరావు విషయంలో తన సాన్నిహిత్యాన్ని బహిరంగంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ కెప్టెన్ ఇంటికి వెళ్లి లక్ష్మీకాంతరావు దంపతుల ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీకాంతరావు నివాసం కేంద్రంగా కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీఆర్ఎస్ అధినేతగా ఉద్యమం నడిపిన రోజుల్లోనే కాకుండా... సీఎం పదవి చేపట్టాక కూడా కేసీఆర్ ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు. రాజకీయ నేపథ్యం... వడితెల లక్ష్మీకాంతరావు సొంత ఊరు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపురం. ఆయన 1939 నవంబర్ 17న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాయంలో బీఎస్సీ పూర్తి చేశారు. ఓయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. 1963 నుంచి 1968 వరకు సైనిక శాఖలో సీనియర్ కమిషన్డ్ అధికారి (కెప్టెన్)గా పని చేశారు. 1983 నుంచి 1995 వరకు సింగాపురం సర్పంచ్‌గా పని చేశారు. ఇదే గ్రామానికి ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో 14 నెలలపాటు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో తిరిగి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2009 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్‌గా ఎక్కువ రోజులు పని చేశారు. లక్ష్మీకాంతరావు కుమారుడు వి.సతీశ్ కుమార్ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం సతీశ్ కుమార్‌కు కేసీఆర్ పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఇవ్వగా చట్టపరమైన వివాదం కారణంగా ఈ పదవులు రద్దయ్యాయి. లక్ష్మీకాంతరావు భార్య సరోజినిదేవీ సింగాపురం ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచి హుజూరాబాద్ ఎంపీపీగా పనిచేస్తున్నారు. లక్ష్మీకాంతరావు సోదరుడు వడితెల రాజేశ్వరరావు సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశ్వరరావు హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. లక్ష్మీకాంతరావు కుటుంబానికి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రాంటెక్ (మహారాష్ట్ర) జిల్లాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి.