Carbon fiber
-
ఎహాంగ్ ఎయిర్ ట్యాక్సీ వచ్చేస్తోంది...
చాలాకాలం నుంచి వింటున్న మాటేగానీ.. కొంచెం ముందుకెళ్లాం కాబట్టి ఈ ఎగిరే డ్రోన్ల గురించి మళ్లీ చెప్పుకోవాల్సి వస్తోంది. విషయం ఏమిటంటే.. ఎహాంగ్ అని ఓ కంపెనీ ఉందిలెండి... ఫొటోలో కనిపిస్తున్న డ్రోన్‌ను తయారు చేసింది ఈ కంపెనీనే. ఇప్పటికే దీన్ని చాలాసార్లు ప్రయోగించి చూశారుగానీ.. ఇటీవల కొంతమందిని దీంట్లోకి ఎక్కించి ప్రయోగం చేయడంతో డ్రోన్లు.. ఎయిర్ ట్యాక్సీల విషయం మళ్లీ చర్చకు వచ్చింది. ఎయిర్‌బస్, ఇంటెల్, బోయింగ్, బెల్హెలికాప్టర్స్ వంటి అనేక సంస్థలు తామూ డ్రోన్లతో ట్యాక్సీ సర్వీసులు నడుపుతామని అంటున్న నేపథ్యంలో ఎహాంగ్ ఒక అడుగు మందుకేసి తొలిసారి మనుషులతో ప్రయోగాలు నిర్వహించడం విశేషం. కంపెనీ సిఈవో హుఝీ హూ, చైనా ప్రభుత్వ అధికారులు కొందరు ఎహాంగ్ 184లో ప్రయాణించిన వీడియోను కంపెనీ విడుదల చేసింది. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారైన ఎహాంగ్ – 184 గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారీ స్థాయి తుపాను గాలులను కూడా తట్టుకుని ఇది 25 నిమిషాలపాటు గాల్లో ఎగరగలదు. భూమికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ప్రయాణించే ఎహాంగ్ను మరింత విస్తృత స్థాయిలో పరీక్షించి త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తామని అంటున్నారు కంపెనీ సీఈవో హూ! -
‘సిటీ’ కోసం ఓ కారు
రాబోయే 50 ఏళ్లలో ప్రపంచంలోని మూడొంతుల జనాభా పట్టణాల్లో నివసిస్తుందని అంచనా.. దీనికి తోడు వాహనాలు, కాలుష్యం పెరుగుతుంది. కనీసం పార్కింగ్ స్థలానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి నగరాల పరిస్థితులకు తగ్గట్లు ఉపయోగపడేలా ‘షెల్’ కంపెనీ సరికొత్త కారును డిజైన్ చేసింది. రీసైక్లింగ్ చేసిన కార్బన్ ఫైబర్‌తో చేయడం వల్ల కారు బరువు 550 కిలోలకు తగ్గడమే కాకుండా తక్కువ ధరలోనే లభ్యం కానుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రయ్‌మని దూసుకుపోవచ్చు కూడా. దాదాపు 3.8 లీటర్ల ఇంధనంతో 172 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు కూడా. ఒకటిన్నర మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల పొడవు, 1.3 మీటర్ల వెడల్పు ఉండటం వల్ల పార్కింగ్ చేసుకోవడానికి చాలా తక్కువ స్థలం సరిపోతుందని కారు డిజైనర్ గోర్డాన్ ముర్రే చెప్పాడు. మిగతా కార్ల కన్నా తక్కువ కార్బన్‌డై ఆక్సైడ్‌ను విడుదల చేసి కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నాడు. -
ప్రపంచంలోనే అతిచిన్న ద్రోన్..
రాజమౌళి సినిమాలో ఈగ మాదిరిగా రకరకాల విన్యాసాలు చేసే ఈ ‘రోబో ఈగ’ ప్రపంచంలోనే అతిచిన్న ద్రోన్ . కార్బన్ ఫైబర్‌తో తయారుచేసిన ఈ ద్రోన్ 106 మిల్లీగ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. తలపై పిరమిడ్ ఆకారంలో ఉండే లైట్ సెన్సర్ ఆధారంగా దేహాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎలక్ట్రానిక్ కండరాలతో రెక్కలను ఆడిస్తూ ఇది ముందుకెళుతుంది. తేలికైన, అతిసన్ననైన తీగ సాయంతో విద్యుత్‌ను అందుకుని పనిచేస్తుంది. భవనాలు కూలినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు చిన్న రంధ్రాల్లోంచి సైతం శిథిలాల కిందికి వెళ్లి పరిస్థితిని తెలియజేసేందుకు, పర్యావరణ సంబంధిత పర్యవేక్షణకు, వివిధ పంటల మధ్య పరాగ సంపర్కం జరపడానికీ ఈ రోబో ఈగ ఉపయోగపడుతుందట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమను తాము వేగంగా నియంత్రించుకుంటూ కీటకాలు ఎగరడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న హార్వార్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు.