‘సిటీ’ కోసం ఓ కారు
రాబోయే 50 ఏళ్లలో ప్రపంచంలోని మూడొంతుల జనాభా పట్టణాల్లో నివసిస్తుందని అంచనా.. దీనికి తోడు వాహనాలు, కాలుష్యం పెరుగుతుంది. కనీసం పార్కింగ్ స్థలానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి నగరాల పరిస్థితులకు తగ్గట్లు ఉపయోగపడేలా ‘షెల్’ కంపెనీ సరికొత్త కారును డిజైన్ చేసింది. రీసైక్లింగ్ చేసిన కార్బన్ ఫైబర్‌తో చేయడం వల్ల కారు బరువు 550 కిలోలకు తగ్గడమే కాకుండా తక్కువ ధరలోనే లభ్యం కానుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రయ్‌మని దూసుకుపోవచ్చు కూడా.
దాదాపు 3.8 లీటర్ల ఇంధనంతో 172 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు కూడా. ఒకటిన్నర మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల పొడవు, 1.3 మీటర్ల వెడల్పు ఉండటం వల్ల పార్కింగ్ చేసుకోవడానికి చాలా తక్కువ స్థలం సరిపోతుందని కారు డిజైనర్ గోర్డాన్ ముర్రే చెప్పాడు. మిగతా కార్ల కన్నా తక్కువ కార్బన్‌డై ఆక్సైడ్‌ను విడుదల చేసి కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నాడు.