ఫిల్మ్ నగర్ క్లబ్ పై కేసు నమోదు
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనకు సంబంధించి ఫిల్మ్ నగర్ క్లబ్‌పై కేసు నమోదైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గౌరవ్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ఇంజినీర్ సుధాకర్ రావు, కాంట్రాక్టర్ కొండలరావు, లేబర్ కాంట్రాక్టర్ రవిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఆదివారం ఉదయం కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఇద్దరు మరణించగా, మరో 12 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్లు 10కి పైగా నేలమట్టం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఫిల్మ్ నగర్ క్లబ్ ప్రకటించింది.
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ రోజు సాయంత్రం ప్రమాద స్థలిని పరిశీలించారు. భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతిలేదని, బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.