కోడికి త్రీడీ కాలు
వాషింగ్టన్: పుట్టుకతోనే ఓ కాలు దెబ్బతిన్న కోడిపిల్లకు దాని యజ మానురాలు కొత్తకాలు పెట్టిస్తోంది. అది కూడా అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత సహాయంతో రూపొం దించిన కాలు. ఇందుకోసం ఏకంగా 2500 డాలర్ల(సుమారు రూ.1,60,000)ఖర్చుతో శస్త్రచికిత్స చేయిస్తోంది. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఆండ్రీ మార్టిన్ కోడిపిల్లల పునరావాస కేంద్రాన్ని నడుపుతోంది. అందులో సిసెలీ అనే మూడు నెలల కోడిపిల్ల పుట్టుకతోనే కుడికాలు కోల్పోయింది. దీంతో ఆండ్రీ సిసెలీకి శస్త్రచికిత్స చేయించాలని నిశ్చయించుకుంది. అన్ని కోడిపిల్లల్లాగే సిసెలీ కూడా ఉండాలంటే దానికి త్రీడీ కాలును అమర్చాలని వైద్యులు సూచించారు. ఇందుకు 2500 డాలర్లు ఖర్చవుతుందన్నారు.
ఆండ్రీ మాత్రం ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఆ కోడిపిల్లకు శస్త్రచికిత్స చేయిస్తోంది. బుధవారం టుఫ్స్ యూనివర్సిటీ కమింగ్స్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌లో సిసెలీకి శస్త్రచికిత్స చేసి కొత్త త్రీడీ కాలు అమర్చనున్నారు. ఆండీ.. ఇలా కోడిపిల్లకు శస్త్రచికిత్స చేయించటం కొత్తేం కాదు. గతంలోనూ తన వద్ద ఉన్న ఓ కోడికి 3వేల డాలర్లు ఖర్చుపెట్టి హిస్టరెక్టామీ ఆపరేషన్ చేయించింది.