‘ఫిలిం సిటీ’ సందర్శన లోగుట్టు?
రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్ తనంతట తానే స్వయంగా రామోజీరావును ఎందుకు కలుసుకున్నట్లు? ఉద్యమ నాయకుడు కేసీఆర్ వేరు, సీఎం కేసీఆర్ వేరు అన్న మాట నిర్వివాదాంశం. కానీ ఆయన వెళ్లింది వివాదాస్పద భూముల్లో కట్టిన ఒక ఫిలిం సిటీకి, దాని అధిపతిని కలవడానికి! అంతకు ముందే ఆయన ఆర్కైవ్స్ సహా అన్ని రకాల కొత్త, పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించవలసింది. ఫిలిం సిటీ భూ వివాదాలను అర్థం చేసుకోవాల్సింది. ఆ పని చేయలేదు కాబట్టే కేసీఆర్ హఠాత్ ఫిలిం సిటీ సందర్శన అనేక అనుమానాలను రేకెత్తించింది. ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపింది.
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గత శుక్రవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఐదున్నర గంటలసేపు ఫిలిం సిటీ అధిపతి, పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావుతో సమావేశమయ్యారు. ఆయనతో కలసి భోజనం చేశారు. ఫిలిం సిటీ విశేషాలను ఆసాంతం పరిశీలించారు. రామోజీ రావు నిర్మించనున్న ఆధ్యాత్మిక నగరం ‘ఓం’ విశేషాలను తెలుసుకున్నారు. చివరగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ సారథి అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సఖ్యంగా మెలగాలన్న రామోజీరావు సలహాను స్వీకరించి మరీ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వెంట తాజా మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందిన మాజీ తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నారు. వారిద్దరినీ కాసేపు బయట కూర్చోబెట్టి చంద్రశేఖర్‌రావు, రామోజీరావు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
రాజకీయ మీడియాలో రాజగురువు
అధికారంలో ఉన్న వారిని తన దగ్గరికి రప్పించుకోవడం, రప్పించుకోవాలని ప్రయత్నించడం రామోజీరావుకు కొత్త ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లూ రామోజీ రావును అందరూ రాజ గురువుగా సంబోధించడం తెలిసిందే. మీడియా మొఘుల్‌గా ప్రఖ్యాతి చెందిన రామోజీరావు తనవి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీ యాలని పలుమార్లు స్పష్టంగానే చెప్పారు. అది రాతపూర్వకంగా తన దినపత్రిక ద్వారా కావచ్చు, కోర్టులకు సమర్పించిన అఫిడవిట్లలో కావచ్చు. ఆయన తన కాంగ్రెస్ వ్యతిరేకతను ఎక్కడా దాచుకోలేదు. పత్రికాధిపతికి రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదని ఎవరూ అనరు. ఏదో ఒక రాజకీయం లేకుండా మీడియా స్వతంత్రంగా ఉంది అంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కారు. అందుకు రామోజీరావు నడుపుతున్న మీడియా సంస్థలు అతీతంగా ఏమీ లేవు.
నిజానికి ఎన్టీరామారావు 1982లో రాజకీయాల్లోకి వచ్చాక ఆయనను అధికారంలోకి తేవడానికి మొత్తం ప్రచార బాధ్యతను నెత్తికెత్తుకుని తన దినపత్రికను తెలుగుదేశం కరపత్రికగా మార్చారన్న విమర్శను ఆయన ఆ రోజు ల్లోనే ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 1984లో నాదెండ్ల భాస్కర రావు ప్రభుత్వాన్ని గద్దె దింపడంలోగానీ, మళ్లీ అదే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 1995లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కాపాడటంలోగానీ, ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చెయ్యడంలోగానీ రామోజీరావు నడిపిన రాజకీ యం చరిత్రలో కచ్చితంగా రికార్డ్ అయి తీరుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రామోజీరావును కలుసుకున్నారు కాబట్టి ఈ గతాన్ని గుర్తు చెయ్యాల్సి వచ్చింది.
నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రామోజీరావు నివాసానికి వారానికి ఒకసారో, నెలకొకసారో వెళ్లి సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకుని వచ్చేవారని విన్నాం. అప్పుడప్పు డు కొన్ని పత్రికల్లో చదివాం కూడా. కొన్ని సార్లయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబే చికోటి గార్డెన్స్ ఇంటి బయట వరండాలో రాజ గురువు రాక కోసం కాసేపు వేచి ఉండాల్సి వచ్చేది కూడానట. 1994లో అత్య ద్భుతమయిన ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను గద్దెదించి, అధికారాన్ని చేపట్టడంలో తనకు అండగా ఉన్న పత్రికాధిపతి పట్ల బాబుకు ఆ మాత్రం గౌరవం, కృతజ్ఞతాభావం ఉండటంలో ఆశ్చర్యం లేదు.
వైఖరిలో ‘మార్పు’ రామోజీకే పరిమితమా?
అయితే, రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న చంద్రశేఖర్‌రావు తనంతట తానే స్వయంగా వెళ్లి రామోజీరావును ఎందుకు కలుసుకున్నట్లు అన్న ప్రశ్నే ఇప్పుడు చర్చనీయాంశమై కూర్చున్నది. స్నేహపూర్వకంగా కలుసుకోవ డానికో, సరదాగా మాట్లాడుకోవడానికో ఫిలిం సిటీకి వెళ్లేంత తీరిక తెలంగాణ ముఖ్యమంత్రికి ఉందంటే ఎవ్వరూ నమ్మరు. పోనీ వారిద్దరి మధ్యా స్నేహమే మైనా ఉందా అంటే, అదీ లేదు. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని ఏర్పాటు చేసిన తరువాత కరీంనగర్లో జరిగిన తొలి బహిరంగ సభలో, లక్షలాది మంది సమక్షంలో సభా వేదిక నుండి... ఫిలిం సిటీ పేరిట రామోజీరావు తెలంగాణ ప్రజల భూములను ఆక్రమించుకున్నాడని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక లక్ష నాగళ్లతో ఫిలిం సిటీ దున్నిస్తానని చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆ బహిరంగ సభా ప్రాంగణంలోనే ఆయన ప్రేరణతోనే రామోజీరావు సంపాదకత్వాన నడుస్తున్న దినపత్రిక ప్రతులను కార్యకర్తలు, అభిమానులు తగులబెట్టారు కూడా.
తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా లక్ష నాగళ్లు సిద్ధం చెయ్యలేదేమిటా? అని అంతా ఎదురు చూస్తుండగా, ఆయన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పైగా ఆంధ్ర ప్రాంతీయుల యాజమాన్యంలో పొట్ట కూటి కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న లెక్కలేనంత మంది తెలంగాణ వారి మీద ‘తెలంగాణ ద్రోహులు’ అని ముద్రలు వేయడానికి చంద్రశేఖర్‌రావు కొడుకు, కూతురు, మేనల్లుడు రబ్బర్ స్టాంప్‌లు చేతబట్టి తిరుగుతున్న సమయంలో జరిగిన ఈ కలయిక అందరినీ నివ్వెర పోయేట్టు చేయడంలో తప్పేముంది? 2001లో టీఆర్ఎస్ ఏర్పడిన నాటి నుండి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు తెలంగాణ పది జిల్లాల్లో కొన్ని లక్షల చిన్న పెద్ద ఉద్యమ సభలు జరిగి ఉంటాయి. అందులో కొన్ని వందల సభలలోనయినా ఉద్యమ నేతగా చంద్రశేఖర్‌రావు ఉద్వేగంగా, ఆవేశంగా ప్రసంగించి ఉంటారు. ఆ సభలన్నిట్లో మారుమోగిన తెలంగాణ ధూమ్‌ధామ్ పాటలు ఇంకా అందరికీ గుర్తున్నాయి.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ వేరు, ముఖ్యమంత్రి కేసీఆర్ వేరు అన్న మాట నిర్వివాదాంశం. లక్ష్య సాధన కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా అనేకం మాట్లాడొచ్చు. ఒకసారి లక్ష్యం నెరవేరి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని ముఖ్యమంత్రి అయ్యాక మరింత బాధ్యతగా నడుచుకోవాల్సిందే. కానీ ఆ మార్పు ఒక్క రామోజీరావును కలుసుకోవడంలోనే ఉండాలా? అన్ని విషయాల్లోనూ ఆ మార్పు కనిపించాలా? అన్నదే ప్రశ్న.
మోదీ సలహాను పాటించారా?
ఇంతకూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఫిలిం సిటీకి వెళ్లి ఐదు గంటలపాటు రామోజీరావుతో ఎందుకు భేటీ అయినట్టు? ఫిలిం సిటీని నాగళ్లతో దున్నాలా? సులభంగా పని అయిపోవడానికి ట్రాక్టర్లతో దున్నేయొచ్చా? అని చూడడానికి వెళ్లారా? రామోజీరావు నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం ‘ఓం’ గురించి తెలుసుకోవడానికి వెళ్లారా? అధికారంలోకి వచ్చిన నాటి నుండి బోలెడు సార్లు ఆయన చెప్పినట్టే తెలంగాణ ప్రభుత్వం రాచకొండ గుట్టల్లో నిర్మించబోతున్న మరో ఫిలిం సిటీకి అక్కరకు వస్తుందని రామోజీ ఫిలిం సిటీని పరిశీలించడానికి వెళ్లారా? లేక తాను చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఎవరిని చేర్చుకోవాలో, ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వాలో చర్చించడానికి వెళ్లారా? లేక ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సలహా మేరకు రామోజీరావును కలుసుకున్నారా?
ఇట్లా రకరకాల ప్రశ్నలు తెలంగాణ ప్రజల మెదళ్లలో కదులుతున్నాయి. ఇటువంటి ప్రశ్నలు తలెత్తడానికి కారణాలూ ఉన్నాయి. ఇటీవల రామోజీరావు ఢిల్లీ వెళ్లి నరేంద్రమోదీని కలుసుకుని తన ఆధ్యాత్మిక ప్రాజెక్టు ‘ఓం’ గురించి వివరించిన సందర్భంలోనూ, ప్రధాని నిర్వహించిన ముఖ్యమంత్రుల సమా వేశం కోసం ఆ తరువాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, మోదీని కలుసుకున్న సందర్భం లోనూ రామోజీరావు, చంద్రశేఖర్‌రావులు భేటీ కావాల్సిన అవసరం గురించి ప్రస్తావన వచ్చిందని రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతున్నది. ఆ అవసరం ఏమిటో మోదీ, కేసీఆర్, రామోజీరావులకే తెలియాలి.
అనుమానాలను రేకెత్తిస్తున్న గోప్యత
అన్ని విషయాలూ అందరికీ చెప్పవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి, ప్రభుత్వం భావించవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు తెలియకూడనంత రహస్యం ఏమిటయి ఉండవచ్చు అన్నది ఒక ప్రశ్న. పైగా ఆయన వెళ్లింది ముఖ్యమంత్రిగా, అందునా వివాదాస్పద భూముల్లో కట్టిన ఒక ఫిలిం సిటీలోనే దాని అధిపతిని కలవడానికి. ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో భేటీ కావడాని కంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి... రెవెన్యూ రికార్డులను, కోర్టు ఆఫ్ వార్డ్స్ వివాదాలను, రాష్ట్ర సచివాలయంలోనూ ఆర్కైవ్స్‌లోని భూ సంబంధమైన రికార్డులను పరిశీలించవలసింది. కింగ్ కోఠీలోని పరదా గేటులో నిజాం వారసుల అధీనంలో ఇంకా మిగిలి ఉన్న పాత రికార్డులను తెప్పించి, వాటిని ఉర్దూ నుండి తెలుగులోకి అనువదింపజేసుకుని చదివి ఉండవలసింది. అదే చేసి ఉంటే రామోజీ ఫిలిం సిటీ భూ వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అయ్యేవి. అవేవీ జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హఠాత్ ఫిలిం సిటీ సందర్శన అనేక అనుమానాలను రేకెత్తించింది. ప్రజలకు తప్పుడు సంకేతాలను కూడా పంపింది.
- దేవులపల్లి అమర్
సీనియర్ పాత్రికేయులు
మొబైల్ : 98480 48536 - amardevulapalli@yahoo.com