చిలకపాడులో..డెంగీ టెర్రర్!
► విష జ్వరాలతో 50 మందికి పైగా ఆస్పత్రి పాలు
► నెలరోజుల వ్యవధిలో గ్రామంలో ఐదుగురికి డెంగీ
► పారిశుద్ధ్య లోపమే రోగాలకు కారణమంటున్న స్థానికులు
ప్రాణాంతక డెంగీ జ్వరాలతో చీమకుర్తి మండలంలోని చిలకపాడు ఎస్సీకాలనీ మంచం పట్టింది. 80 కుటుంబాలు ఉన్న ఈ కాలనీలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 60 మంది విష జ్వరాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు డెంగీతో బాధ పడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. నెల రోజుల వ్యవధిలో ఒకే కాలనీకి చెందిన ఐదుగురు డెంగీ బారిన పడటం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
చీమకుర్తి రూరల్ : చీమకుర్తి మండలం చిలకపాడు ఎస్సీకాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడు వంకాయలపాటి ఏసయ్య జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం ఒంగోలులోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి డెంగీ నిర్ధారణ అయినట్లు రిమ్స్ నుంచి వేములపాడు ప్రాథమిక వైద్య కేంద్రానికి మెయిల్ వచ్చిందని ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ పి.హేమలత ధ్రువీకరించారు. ఏసయ్య సోదరుడు మనోహర్ కూడా డెంగీతో బాధపడుతూ రిమ్స్‌లో చికిత్స పొంది రెండు మూడు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు. వీరిద్దరితోపాటు గడిచిన రెండు రోజులుగా ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వంకాయలపాటి మనీషా, పాలపర్తి ప్రశాంత్‌కు డెంగీ నిర్ధారణ అయిందని ఆయా ఆస్పత్రుల వైద్యులు చెప్పారని, ప్రభుత్వ ఆస్పత్రి సూపర్వైజర్ లక్ష్మీనరసింహరావు తెలిపారు. దీంతో ప్రస్తుతం డెంగీ జ్వరంతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న గ్రామస్తుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఫిబ్రవరి 22వ తేదీన చిలకపాడు వడ్డెపాలేనికి చెందిన తన్నీరు వేణుగోపాల్‌కు డెంగీ రావడంతో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. చిలకపాడు ఎస్సీకాలనీలో రెండు రోజుల నుంచి దాదాపు 50 నుంచి 60 మంది వరకు తీవ్రమైన జ్వరాలతో బాధపడుతూ పక్కనే ఉన్న మద్దులూరులోని ఆర్ఎంపీ వద్ద తాత్కాలిక వైద్యం చేయించుకున్నారు. తగ్గకపోవడంతో ఒంగోలులోని రిమ్స్‌తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుంటున్నారు. వారిలో 10 మందికి వైట్ ప్లేట్లెట్స్ పడిపోయినట్లు వైద్య సిబ్బంది చెప్పారని, రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.
కుటుంబ సభ్యులంతా ఆస్పత్రుల్లోనే..: ఒకే కుటుంబానికి చెందిన వంకాయలపాటి ఇస్రాయేల్, భార్య కోటేశ్వరి, కొడుకులు ప్రవీణ్, జాన్, మనోజ్ జ్వరాలతో బాధపడుతూ ఒంగోలులోని ఒకే ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. మరో కుటుంబానికి చెందిన వంకాయలపాటి రాజా, ఆయన భార్య మనీషా, తాళ్లూరి మరియమ్మ, పాలపర్తి ప్రశాంత్, రేపూరి మాధవి, ఇండ్ల సుమతి జ్వరాలతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు వైరల్ ïఫీవర్, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో బాధపడుతున్నారు. గత ఏడాది జూలైలో ఇదే మండలంలోని తక్కెళ్లపాడులో డెంగీ జ్వర లక్షణాలు గుర్తించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. చిలకపాడు, దాని సమీప గ్రామాలలో జ్వరాల విజృంభణ కారణంగా రోగులతో పాటు వారి బంధువలంతా రెండు మూడు రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
హుటాహుటిన వైద్య శిబిరం...: చిలకపాడు గ్రామంలో డెంగీ, ఇతర జ్వరాలు వ్యాపించిన సంగతి తెలుసుకుని వేములపాడులోని ప్రాథమిక వైద్యకేంద్రం డాక్టర్ పి.హేమల త ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరం ఏ ర్పాటు చేశారు. 27 మందికి వైద్యపరీక్షలు చే సి మందులు అందజేశారు. ఒంగోలు మలేరి యా డిపార్టుమెంట్ సబ్యూనిట్ ఆఫీసర్ మజీద్, సూపర్వైజర్ లక్ష్మీనరసింహారావు, హెల్త్ అ సిస్టెంట్ల సాయంతో కాలువ ఎబేట్ పిచికారీ చే యించారు. ఎం.ఎల్.ఆయిల్‌ను కాలువలలో పో యించారు. కాలువల్లో మురుగు పారుదల లేకపోవడం, దోమలు స్వైర విహారం చేయడమే రోగాలకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.
డెంగీతో బాలిక మృతి
దొనకొండ : డెంగీతో బాధపడుతున్న బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఇండ్లచెరువులో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన కుర్రా గంగారావు కుమార్తె రూప(8) వారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా వైద్యం చేయించినా జ్వరం అదుపులోకి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వినుకొండలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు రూప డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది.