CISCE
-
హైబ్రీడ్ మోడ్ కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో హైబ్రీడ్ విధానం(ఆన్లైన్, ఆఫ్‌లైన్) కుదరని, విద్యార్థులు ప్రత్యక్షంగా పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. విద్యా వ్యవస్థను గందరగోళానికి గురి చేయవద్దని పేర్కొంది. సీబీఎస్ఈ టర్న్–1 బోర్డు పరీక్షలు నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యాయని, సీఐఎస్సీఈ సెమిస్టర్–1 పరీక్షలు 22 నుంచి ప్రారంభం కాబోతున్నాయని గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం పరీక్షల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను కేవలం ఆఫ్‌లైన్‌లో కాకుండా హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేలా సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈకి ఆదేశాలివ్వాలని కోరుతూ ఆరుగురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సీబీఎస్ఈ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్–19 నియంత్రణ నిబంధనలను పాటిస్తూ బోర్డు పరీక్షలను ప్రత్యక్ష విధానంలో(ఆఫ్‌లైన్ మోడ్) నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలను 6,500 నుంచి 15,000కు పెంచామని తెలిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే హాజరయ్యారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఈ దశలో పరీక్షలను రీషెడ్యూల్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు తెలియజేసింది. విద్యా వ్యవస్థతో ఆటలు వద్దని, అధికారులను వారి పని వారిని చేసుకోనివ్వాలని హితవు పలికింది. -
CBSE: మూడేళ్ల ప్రతిభ ఆధారంగా మూల్యాంకనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020–21 విద్యా సంవత్సరంలో 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దు నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ)లు ప్రతిపాదించిన అసెస్మెంట్ స్కీమ్‌కు సుప్రీంకోర్టు గురువారం ఆమోదముద్ర వేసింది. దేశంలో 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దు నిర్ణయంపై ఇక పునరాలోచన లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. 10, 11, 12వ తరగతుల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు తుది మార్కులు కేటాయించేందుకు 30:30:40 ఫార్ములాను సీబీఎస్ఈ తెరపైకి తీసుకొచ్చింది. తుది ఫలితాలను ప్రకటించే విషయంలో గత ఆరేళ్లలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటామని సీఐఎస్సీఈ వెల్లడించింది. జూలై 31వ తేదీలోగా ఫలితాలను ప్రకటిస్తామని రెండు బోర్డులు తెలియజేశాయి. అసెస్మెంట్ స్కీమ్ పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించే పరీక్షలకు హాజరు కావొచ్చని సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ సూచించాయి. విద్యార్థులు 10, 11, 12వ తరగతుల్లో సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి, 30:30:40 ఫార్ములా ప్రకారం తుది ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది. 10వ తరగతి మార్కులకు 30 శాతం, 11వ తరగతి మార్కులకు 30 శాతం, 12వ తరగతిలో యూనిట్ టెస్టు, మిడ్–టర్మ్, ప్రి–బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుందని తెలిపింది. 12వ తరగతిలో ప్రాక్టికల్, ఇంటర్నల్ అసెస్మెంట్లో విద్యార్థులు సాధించిన మార్కులను సంబంధిత పాఠశాలలు సీబీఎస్ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, తుది ఫలితాలను ప్రకటించే విషయంలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. పదో తరగతిలో ప్రధాన ఐదు సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్టులను మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులపై వివక్ష చూపే ప్రశ్నే లేదు 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దును సవాలు చేస్తూ సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. పిటిషన్‌ను తిరస్కరించింది. పరీక్షల రద్దు నిర్ణయంపై పునరాలోచన ప్రసక్తే లేదని ఉద్ఘాటించింది. ‘‘పరీక్షల విషయంలో సీఐఎస్సీఈ, సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఆమోదించాం. పరీక్షలు రాయాలని, మార్కులు మెరుగుపర్చుకోవాలని కోరుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు పరీక్షలు రాసుకోవచ్చు. పరీక్షలకు హాజరు కావాలని ఆశించే వారిపై వివక్ష చూపే ప్రశ్నే లేదు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఎస్ఈ ప్రతిపాదించిన అసెస్మెంట్ స్కీమ్‌ను స్వీకరించేందుకు తమకు అభ్యంతరాలు లేవని వెల్లడించింది. దీనిపై బోర్డు ముందుకెళ్లవచ్చని సూచించింది. అసెస్మెంట్ స్కీమ్‌ను ఖరారు చేసి, నోటిఫై చేసుకోవడానికి సీఐఎస్సీఈ, సీబీఎస్ఈకి స్వేచ్ఛ ఉందని వివరించింది. ఇంకా ఏవైనా ప్రతిపాదనలు చేస్తే పరిశీలిస్తామని తెలియజేసింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. సీబీఎస్ఈ తరపున అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ వాదనలు వినిపించారు. వివాదాల పరిష్కారానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి అసెస్మెంట్ స్కీమ్‌పై ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఐఎస్సీఈ, సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. వివాదాల పరిష్కారంపై ప్రొవిజన్స్‌ను ఈ స్కీమ్‌లో చేర్చాలని స్పష్టం చేసింది. తుది మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు కోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందని గుర్తుచేసింది. సీబీఎస్ఈ చరిత్రలో ఇదే తొలిసారి ‘‘సీబీఎస్ఈ 1929 నుంచి మనుగడలో ఉంది. పరీక్షలను వాయిదా వేసే పరిస్థితి సీబీఎస్ఈ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. ఈసారి మాత్రం తప్పడం లేదు. అసెస్మెంట్ స్కీమ్‌ను నిపుణుల కమిటీ రూపొందించింది. తుది ఫలితాల విషయంలో 10, 11, 12వ తరగతుల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. 10వ తరగతిలో ప్రధానమైన ఐదు సబ్జెక్టులు ఉండగా, విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించిన మూడు సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకుంటాం. ఈ మూడు సబ్జెక్టుల్లో పొందిన మార్కులకు 30% వెయిటేజీ లభిస్తుంది. 11వ తరగతిలో థియరీ పేపర్లో సాధించిన మార్కులకు 30% వెయిటేజీ ఉంటుంది. ఇక 12వ తరగతిలో యూనిట్ టెస్టు, మిడ్–టర్మ్, ప్రి–బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు మరో 40% వెయిటేజీ ఉంటుంది. ఈ మూడు రకాల వెయిటేజీల ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తాం’’అని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు. -
50శాతం తగ్గనున్న సీబీఎస్ఈ, సీఐఎస్సీ సిలబస్?
న్యూఢిల్లీ : విద్యా ప్రమాణాలు అధికంగా ఉండే సీఐసీసీఈ జూన్‌లో 2020-21 ఏడాదికి సిలబస్ తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అసాధారణ (కరోనా) పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్ సిలబస్‌తో విద్యార్థులకు బోధించలేమని భావించి 9 నుంచి 12వ తరగతులకు సిలబస్ 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సీఐసీసీఈ తర్వాత సీబీఎస్ఈ కూడా అదే బాటలో 30 శాతం సిలబస్ తగ్గించింది. తొలగించిన సిలబస్ నుంచి పరీక్షలో ప్రశ్నలు ఏవీ రావని స్పష్టం చేసింది. సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈని అనుసరించి అనేక రాష్ట్ర బోర్డులు కూడా వారి సిలబస్‌లో 25శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించాయి. చదవండి: 30% తగ్గనున్న సీబీఎస్ఈ సిలబస్ కాగా తాజాగా ఈ ఏడాది బోర్డు పరీక్షలను సులభతరం చేసేందుకు సిలబస్‌ను మరింత తగ్గించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ఆలోచనలు చేస్తున్నాయి. ఇంతకు ముందు నిర్ణయించినట్లు 30 శాతానికి బదులు 50 శాతం సిలబస్ తగ్గించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయంపై సీబీఎస్‌ఈఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ..పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రానందున ఈ ఏడాది బోర్డు పరీక్షలు 70శాతం లేదా 50 శాతం సిలబస్‌తో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు , దీనిపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చదవండి: రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య.. ఇప్పటికీ పాఠశాలలు తెరుచుకోకపోవడం, ఆన్లైన్ తరగతులు కొనసాగుతుండటం వల్ల జాతీయ విద్యా బోర్డులు కూడా పరీక్షలను 45 నుంచి 60 రోజులు ఆలస్యం చేయాలని ఆలోచిస్తున్నాయి. బోర్డు పరీక్షలను ఏప్రిల్‌కు మార్చే అవకాశం ఉంది. అయితే వీటిపై ఇంకా విధానాన్ని ఖరారు చేయలేదు. కాగా పాఠశాలలు, కళాశాలలను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. నాన్-కంటైనర్ జోన్లలో అక్టోబర్ 15 నుంచి దశలవారీగా పాఠశాలలను తిరిగి తెరవవచ్చని పేర్కొంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. కానీ ఇప్పటికీ భారత్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతున్నందున చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపంచేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఇప్పట్లో స్కూళ్లకు పూర్తి స్థాయి హాజరు ఉండకపోవచ్చు. -
ఐసీఎస్ఈ, ఐఎస్ఈ పరీక్ష ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ) 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను ఐసీఎస్ఈ విడుదల చేసింది. పదో తరగతిలో 99.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఐసీఎస్ఈ వెల్లడించింది. ఫలితాలను ఐసీఎస్ఈ వెబ్సైట్ https://www.cisce.orgని ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. కాగా.. ఈ సంవత్సరం 85,611 మంది విద్యార్థులు ఐఎస్సీ పరీక్షలకు హాజరవ్వగా 2,798 విద్యార్థులు ఫెయిలయ్యారు. ఐసీఎస్ఈ పరీక్షలకు 2,07,902 మంది హాజరవ్వగా 99.34 శాతంతో రికార్డు స్థాయిలో 2,06,525 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. -
జూలై 1 నుంచి ఐసీఎస్ఈ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ ( సీఐఎస్సీఈ) సిద్దమైంది. కొన్ని సబెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించిన తరువాత కరోనా కారణంగా ఐసీఎస్సీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 10వ తరగతి, 12 వ తరగతి పెండింగ్ పరీక్షల షెడ్యూల్‌ను సీఐఎస్సీఈ శుక్రవారం విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలను జూన్ 2 నుంచి జూలై 12 వరకు నిర్వహించన్నారు. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను జూలై 1 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు సీఐఎస్సీఈ ప్రకటించింది. ఈ పరీక్షలు రోజు మార్చి రోజు జరగనున్నాయి.ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 11గంటలకు ప్రారంభం అవుతాయి (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల) -
ఐసీఎస్ఈలో బాలికలే టాప్
న్యూఢిల్లీ: కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ) పన్నెండు, పదో తరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలు దుమ్మురేపారు. రెండు తరగతుల్లో టాప ర్యాంకులు దక్కించుకున్నారు. పన్నెండు, పదో తరగతి ఫలితాలను ఐసీఎస్ఈ సోమవారం విడుదల చేసింది. మొత్తంగా ట్వల్త్‌లో 96.47 శాతం, టెన్త్‌లో 98.53 శాతం ఉత్తీర్ణులయ్యారు. పన్నెండో తరగతిలో 97.73 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా, బాలుర శాతం 95.39. మొత్తం 50 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్షలో 16 భారతీయ భాషలు, 5 విదేశీ భాషలు, ఒక లలితకళలకు సంబంధించిన పేపర్లు ఉంటాయి. పన్నెండు, పదో తరగతి ఫలితాల్లో దక్షిణాది విద్యార్థుల ఆధిక్యం స్పష్టంగా కనబడింది. 10వ తరగతిలో ముస్కాన్ అబ్దుల్లా(పుణే), అశ్విన్‌రావు(బెంగళూరు) 99.4 శాతం ఉత్తీర్ణతతో సంయుక్తంగా టాపర్స్‌గా నిలిచారు. 12వ తరగతిలో కోల్‌కతా విద్యార్థిని అనన్య మైటీ(99.50) టాపర్‌గా నిలిచింది. -
‘టెన్’షన్
27 నుంచి పదో తరగతి పరీక్షలు కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఏడాది కష్టానికి ‘పరీక్ష’. భానుడు ఉగ్రరూపం దాల్చగా.. ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థి దశలో అత్యంత కీలకమైన పదో తరగతి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్కుల గోల నుంచి ఉపశమనం లభించినా.. గ్రేడింగ్‌లో ముందుండాలనే తపన ప్రతి విద్యార్థిలో కనిపిస్తోంది. ఈనెల 27 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెగ్యులర్‌గా 47,057.. ప్రైవేట్‌గా 6,293 మంది కలిపి 53,350 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు 199, ప్రైవేట్ విద్యార్థులకు 28 మంది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సమస్యాత్మకమైనవిగా 19 కేంద్రాలను గుర్తించారు. ప్రశ్నపత్రాలను 75 పాయింట్లలో సోరేజ్ చేయగా.. 227 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. మరో 20 శాతం మందిని రిజర్వులో ఉచారు. వీరితో పాటు 2,667 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. 11 మంది విద్యాధికారులు, 11 మంది ఎమ్మార్వోలు, 11 మంది ఎస్ఐలతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటైంది. ఏప్రిల్ 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులకు విధుల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎంచే అత్యవసర మందులను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేశారు. అయితే అధిక శాతం పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ సమస్య వేధిస్తోంది. పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించరాదని.. ప్రతిరోజూ ఉదయం 8.45 గంటల్లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు హెల్ప్‌లైన్ నెంబర్ 98499 32289, 08518-277064 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.