వలసలతో నెలకో లండన్‌ను నిర్మించొచ్చు
సిస్కో గ్లోబలైజేషన్ సంస్థ అధిపతి అనిల్ మీనన్
హైదరాబాద్: శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి గంటకు 1,000 మంది పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారని, ఈ జనాభాను ఒకదగ్గరికి చేర్చితే నెలరోజులకో లండన్ స్థాయి నగరాన్ని నిర్మించవచ్చని సిస్కో గ్లోబలైజేషన్ సంస్థ అధిపతి డాక్టర్ అనిల్ మీనన్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల నగరాల్లో జననాల రేటు తక్కువగా, ఉన్నత జీవన ప్రమాణాల ఆశలు అధికం గా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువ జనాభావృద్ధి రేటు ఎక్కువ ఉందని అన్నారు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అతి పెద్ద సవాలుగా మారనుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి హెచ్ఐసీసీలో జరుగుతున్న మెట్రో పొలిస్ సదస్సులో ‘‘భారత దేశం-100 స్మార్టు నగరాలు’’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన చర్చాగోష్టిలో అనిల్ మీనన్ మాట్లాడుతూ.. పౌరుల ప్రేరణ శక్తి, బలమైన రాజకీయ సంకల్పమే స్మార్టు నగరాల విజయానికి కీలకమని అన్నారు.
నగర ప్రాంతాల్లో సుందర ఉద్యాన వనాలు, ఖాళీ స్థలాలకు ఏ లోటు ఉండకూడదని స్పెయిన్‌లోని బార్సిలోనా నగర ఉప మేయర్ ఆంటోని వైవ్స్ పేర్కొన్నారు. బార్సిలోనాలో ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల ఆకృతి మార్చి భారీ పరిమాణం గల ఉద్యానవనాలుగా తీర్చిదిద్దామని ఆయన వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో అనుసంధానమై ఇరుగుపొరుగువారు పరస్పర సహాయ సహకారాలను అందించుకునే విధంగా బార్సిలోనాలో ఓ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి టోనీ న్యూవ్లింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు.