ఖమ్మం నుంచి కాలిఫోర్నియాకు..
ఐఐటీల్లో చేరితే కార్పొరేట్ కొలువు ఖాయం. కళ్లు చెదిరే మొత్తాల్లో జీతాలు సొంతం. అనేది నిస్సందేహం. మరోసారి ఇదే నిరూపితమవుతోంది. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో విద్యార్థులకు కంపెనీలు ఆఫర్ చేస్తున్న పే ప్యాకేజీలే ఇందుకు నిదర్శనం. ఇదే క్రమంలో ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో బీటెక్ సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న ఖమ్మంకు చెందిన ఊట్ల హరీశ్ చంద్ర కూడా 56 లక్షల వార్షిక ప్యాకేజ్‌తో సిస్కో సిస్టమ్స్ - కాలిఫోర్నియాలో కొలువు సొంతం చేసుకున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ సమయంలో ఐఐటీ క్యాంపస్‌లలో సందడి గురించి వివరాలు ఆయన మాటల్లోనే...
లక్ష్యం నెరవేరింది
సిస్కో సిస్టమ్స్‌లో కొలువు ఖాయం కావడం.. అందులోనూ అంతర్జాతీయ ఆఫర్‌తో కాలిఫోర్నియాలోని సంస్థ హెడ్ ఆఫీస్‌లో పనిచేసే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది. నాలుగేళ్ల క్రితం ఐఐటీ-జేఈఈలో 487వ ర్యాంకుతో ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో బీటెక్ సీఎస్ఈలో చేరాను. ఆ లక్ష్యం నెరవేరినట్లు, మూడున్నరేళ్లపాటు పడిన శ్రమకు గుర్తింపుగా భావిస్తున్నాను.
డే-1 ఈవెనింగ్.. హ్యాపీ హ్యాపెనింగ్
ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో రిక్రూట్మెంట్ డ్రైవ్ మొదలైన తొలిరోజు 27 కంపెనీలు వచ్చాయి. వాటి గురించి సమాచారం, జాబ్ పోర్ట్‌ఫోలియో, అర్హతల వివరాలపై క్యాంపస్ వర్గాలు ముందుగానే తెలియజేస్తాయి. విద్యార్థులు తమకు అర్హతలు, ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేసుకుంటారు. నేను కూడా సిస్కో సిస్టమ్స్ సహా మరో నాలుగు కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాను. కానీ మిగతా మూడింటిలో అవకాశం కొద్దిలో చేజారింది.
ఇక.. టెన్షన్ మొదలైంది. అయితే డే-1 ఈవెనింగ్ సెషన్లో సిస్కో సిస్టమ్స్ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నేనిచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందిన ప్రతినిధులు పే ప్యాకేజ్‌తో సహా అపాయింట్మెంట్ ఆఫర్ ఖాయం చేశారు. దీంతో అంతకుముందు నాలుగైదు రోజులుగా పడిన టెన్షన్ నుంచి బయటపడ్డాను.
మూడు రౌండ్లలో ఇంటర్వ్యూ
సిస్కో సిస్టమ్స్ ఇంటర్వ్యూ మూడు రౌండ్లలో జరిగింది. తొలి రెండు రౌండ్లు టెక్నికల్. వీటిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి, కోర్ బ్రాంచ్‌లో లేటెస్ట్ డెవలప్మెంట్స్, నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్ వివరాలపై ప్రశ్నించారు. చివరిదైన హెచ్.ఆర్.రౌండ్లో వ్యక్తిగత వివరాలు, లక్ష్యాలు, తమ సంస్థలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు అడిగారు. వీటికి కూడా సంతృప్తికరంగా సమాధానం ఇవ్వడంతో కొలువు ఖాయం చేశారు. 56 లక్షల ప్యాకేజ్ అని చెప్పారు. మిగతా ఇన్సెంటివ్స్ గురించి ఇంకా తెలియలేదు. ఇవి కూడా కలిపితే ఈ మొత్తం పెరగొచ్చు.
జాబ్ రోల్ చెప్పలేదు
ఇంటర్వ్యూ సమయంలోనే ఏ విభాగంలో పని చేయాలని ఉంది? అని అడిగితే అప్లికేషన్ డెవలప్మెంట్ అని చెప్పాను. ఇంకా జాబ్ రోల్‌పై స్పష్టత ఇవ్వలేదు. ఎలాంటి విభాగంలో పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.
ఇంకా చదవాలనుంది
బీటెక్ చివరి సంవత్సరంలోనే కొలువు ఖాయమైనప్పటికీ.. ఉన్నత చదువులు చదవాలనుంది. వాస్తవానికి క్యాంపస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులను ఎంపిక చేసిన కొన్ని కంపెనీలు ఆ వెసులుబాటు కల్పిస్తాయి. సంస్థలో కొద్దిరోజులు పని అనుభవం గడించాక స్టడీ వెకేషన్‌కు అనుమతినిస్తాయి. సిస్కోలో ఆ అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలి. వచ్చే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి సంస్థలో చేరాల్సి ఉంటుంది. ఈ లోపే దీనిపై స్పష్టత పొందుతాను. ఉద్యోగంలో చేరాల్సి వచ్చినా.. ఉన్నత విద్య లక్ష్యాన్ని మాత్రం వదలను. బీటెక్‌తోనే అకడమిక్స్‌కు ఫుల్స్టాప్ పెట్టడం మంచిది కాదు కూడా! ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్వంటి లక్ష్యాలు ప్రస్తుతానికైతే లేవు.
ఐఐటీ క్యాంపస్ డ్రైవ్స్.. ఇలా
ఐఐటీ క్యాంపస్‌లలో రిక్రూట్మెంట్ డ్రైవ్స్ సందడి జూలై నుంచే మొదలవుతుంది. ఈ డ్రైవ్స్‌లో పాల్గొనే సంస్థలు అప్పటి నుంచే తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు కూడా ఎలాంటి కంపెనీలకు సిద్ధమవ్వాలనే విషయంలోనూ స్పష్టత లభిస్తుంది. ఇక రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ప్రారంభం కావడానికి వారం పది రోజుల ముందు నుంచి క్యాంపస్‌లలో నెలకొనే సందడి ఎంతో.
క్యాంటీన్స్, క్యాంపస్ కారిడార్స్, లంచ్ రూమ్స్.. ఎక్కడ చూసినా వచ్చే కంపెనీల గురించిన ముచ్చట్లే. గతంలో ఆ కంపెనీలు డ్రైవ్స్ నిర్వహించిన తీరుతెన్నులు తెలుసుకునేందుకు, సీనియర్లు, ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్స్‌ను వాకబు చేయడం వంటివి సాధారణం. అసలు ప్రక్రియ మొదలైనప్పుడైతే విద్యార్థుల్లో ఎంతో టెన్షన్ కనిపిస్తుంది.
ఒకవైపు ఇంటర్వ్యూలలో విజయం సాధించిన విద్యార్థులను చూస్తూ.. మరోవైపు తమకెలాంటి ఫలితాలు ఎదురవుతాయో అనే ఆందోళనతో ఉంటారు. సీఎస్ఈ, సాఫ్ట్వేర్ సంబంధిత బ్రాంచ్‌ల విద్యార్థులు ఫర్వాలేదు కానీ మిగతా బ్రాంచ్‌ల విద్యార్థుల్లో ఈ ఆందోళన మరింత ఎక్కువే. కారణం ఆయా బ్రాంచ్‌లకు సంబంధించిన కంపెనీలు సంఖ్య తక్కువగా ఉండటం. వచ్చిన కంపెనీలు తొలి రెండు, మూడు రోజుల్లోనే తగినవారిని ఎంపిక చేసుకోవడం.
డ్రెస్ కోడ్ కంపల్సరీ
క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొనే విద్యార్థులకు డ్రెస్‌కోడ్ తప్పనిసరి. బ్లేజర్స్, నెక్-టై, ఫార్మల్ షూస్ ధరించడం తప్పనిసరి. ఈ విషయంలోనూ ముందు నుంచే సిద్ధం కావాలి. లేదంటే ఒక్కసారి అలాంటి డ్రెస్‌లో ఇమడలేక నెర్వస్‌గా ఫీలవుతారు. ఇది ఇంటర్వ్యూలో ప్రతికూల ప్రభావం చూపుతుంది.
స్టార్టప్స్ ఆఫర్స్‌ను అంగీకరించడానికి కారణం
ఇప్పుడు చాలామంది ఐఐటీయన్స్ స్టార్టప్ ఆఫర్స్‌ను అంగీకరిస్తున్నారు. పే ప్యాకేజ్‌ల పరంగానూ రాజీ పడి స్టార్టప్స్వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా పెట్టిన కంపెనీల్లో చేరితే పనితీరు ఆధారంగా తొందరగా ఉన్నత స్థానాలకు చేరుకుంటామనే ఆలోచనే ఇందుకు కారణం.
కొలువులు ఖాయమే.. కానీ
ఐఐటీల్లో చేరితే కార్పొరేట్ కొలువు ఖాయం అనేది నిస్సందేహం. కానీ.. ఆ కొలువులు, పే ప్యాకేజ్‌లు ఉన్నతంగా ఉండాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే పరిష్కారం. బ్రాండ్-ఐఐటీ పేరుతోనే కళకళలాడే కొలువులు సొంతమవుతాయనుకోవడం పొరపాటు. ఐఐటీ స్థాయి ఇన్స్టిట్యూట్ అయినా.. సాధారణ ఇన్స్టిట్యూట్ అయినా వచ్చిన కంపెనీల్లో ఉన్నత స్థానం పొందాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో సంపూర్ణ అవగాహన సొంతం చేసుకోవాలి.
ప్రొఫెసర్లు, మెంటార్ల గెడైన్స్ కొంత మేరే ఉంటుంది. వారు.. నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉన్న అవకాశాలు, మార్గాల గురించి చెబుతారు. వాటిని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. ఐఐటీల్లో సీటు లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తించాలి. ఐఐటీలో సీటు సొంతమయ్యే ర్యాంకు సాధించడం కంటే.. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి అనుసరించే తీరే భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ సస్టెయినబిలిటీకి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలి.