cloud technology
-
నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీపికబురు
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టెక్ నిరుద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు క్లౌడ్‌లోకి మారేందుకు సిద్ద పడుతున్న ఈ సమయంలో దానికి సంబంధించిన సేవలను వేగంగా అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్(ఏడబ్ల్యూఎస్ బీయూ)ను బుధవారం (నవంబర్ 3)న ప్రారంభించింది. ఈ ప్రత్యేక వ్యాపార యూనిట్ కోసం ఏడబ్ల్యుఎస్ ఇంజనీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్‌లు సహకరిస్తాయని ఒక ప్రకటన తెలిపింది. "ప్రస్తుతం ఏడబ్ల్యుఎస్ టెక్నాలజీ కోసం దాదాపు 10వేల మంది సిబ్బందికి హెచ్‌సీఎల్ శిక్షణ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 20,000 మందికి పైగా నిపుణులకు పెంచాలని యోచిస్తున్నట్లు" సంస్థ తెలిపింది. కొత్త వ్యాపార యూనిట్ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్లను ఆధునికీకరించడానికి, క్లౌడ్ టెక్నాలజీ ప్రాజెక్టులను దక్కించుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి నిపుణులు అవసరం అని సంస్థ తెలిపింది. హెచ్‌సీఎల్ అనేది ఎడబ్ల్యుఎస్ ప్రీమియర్ కన్సల్టింగ్ పార్టనర్. ఇది మౌలిక సదుపాయాల కల్పన, అప్లికేషన్లు & డేటాను ఆధునీకరించడంలో, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడం కోసం తీసుకొచ్చినట్లు పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & హెడ్(ఎకోసిస్టమ్స్) కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. "కంపెనీ #HCLCloudSmart వ్యూహంలో ఏడబ్ల్యూఎస్ బీయూ ఒక ముఖ్యమైన భాగం. వినియోగదారులకు పోటీదారుల కంటే ముందుగా బలమైన క్లౌడ్ వ్యవస్థల నిర్మాణం, సేవలు అందించడంలో ఇది సహాయపడుతుంది" అని అన్నారు. (చదవండి: ప్రతి నెల రూ.1500 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!) -
క్లౌడ్ నిపుణుల అడ్డా భారత్
న్యూఢిల్లీ: క్లౌడ్ నిపుణుల విషయంలో ప్రపంచంలో రెండవ కేంద్రంగా భారత్‌కు అవకాశం ఉందని నాస్కామ్ వెల్లడించింది. ప్రభుత్వ, విద్య, నైపుణ్య కేంద్రాలు, సాంకేతిక సంస్థల సహకారంతో ఇది సాధ్యపడుతుందని తెలిపింది. డ్రౌప్ సహకారంతో నాస్కామ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. మూడవ స్థానంలో ఉన్న భారత్‌లో 2021 మార్చి నాటికి 6,08,000 మంది క్లౌడ్ నిపుణులు ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 15 లక్షలకు చేరుకుంటుంది. ఆ సమయానికి డిమాండ్ 20 లక్షలుగా ఉంటుంది. పెద్ద ఎత్తున నైపుణ్య కార్యక్రమాలు చేపడితే నిపుణుల సంఖ్య నాలుగేళ్లలో 18 లక్షలకు పెరుగుతుంది. 26 శాతం వార్షిక వృద్ధితో క్లౌడ్ మార్కెట్ 2022 నాటికి రూ.41,510 కోట్లను తాకుతుంది’ అని నాస్కామ్ తెలిపింది. నివేదిక రూపకల్పనలో టీసీఎస్, యాక్సెంచర్ సహకారం అందించాయి. క్లౌడ్ సేవలకు డిమాండ్: డిజిటలీకరణ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. మౌలిక వసతులు, అనుకూలత, తక్కువ ఖర్చుల కారణంగా క్లౌడ్ వైపు చిన్న కంపెనీలు సైతం మొగ్గు చూపుతున్నాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ మరో కారణం’ అని నాస్కామ్ వివరించింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ పేరుతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహకారంతో నాస్కామ్ ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, క్లౌడ్ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తోంది. క్లౌడ్ రంగంలో 2020లో 3,80,000 ఉద్యోగాల కోసం డిమాండ్ ఏర్పడింది. 2019తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. క్లౌడ్ నైపుణ్యాల డిమాండ్ ప్రస్తుత సరఫరాను మించిపోయింది. నైపుణ్యతపై దృష్టి పెట్టాలి అని నాస్కామ్ తెలిపింది. -
ఐటీ చరిత్రలో సంచలన కలయిక
ముంబై: ఐటీ చరిత్రలో సంచలన కలయికకు దిగ్గజ కంపెనీలు వేదికయ్యాయి. తొలిసారిగా ఐటీ కంపెనీలు టీసీఎస్, ఐబీఎం కలిసి పనిచేయనున్నాయి. తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు అత్యాధునిక టెక్నాలజీని అందించేందుకు ఐబీఎమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. అత్యుత్తమ సాంకేతికతతో ఐబీఎమ్ క్లౌడ్ యూనిట్‌ను టీసీఎస్ ప్రారంభించనుంది. ఇందులో రెండు కంపెనీలు(టీసీఎస్, ఐబీఎమ్)లకు చెందిన అత్యుత్త సాంకేతిక నిపుణులు సేవలందిస్తారు. అయితే డేటా ఎస్టేట్ , వివిధ రకాల అప్లికేషన్స్ తదితర అంశాలను బదిలీ చేయనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఇరు కంపెనీలు వృద్ధి చెందేందుకు మెరుగైన అంశాలు బదిలీ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇదివరకు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా భవిష్యత్తులో డిజిటల్ రంగం సృష్టించబోయే నూతన అప్లికేషన్స్ ఆధునీకరణ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర అంశాలలో ముందుంటామని టీసీఎస్ ఉన్నతాధికారి వెంకట్రామన్ తెలిపారు. వెంకట్రామన్ స్పందస్తూ.. భవిష్యత్తులో క్లయింట్లు, వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు టీసీఎస్, ఐబీఎం ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా క్లౌడ్ టెక్నాలజీ బదిలీ వల్ల క్లయింట్లకు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవకాశముంటుందని ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బోబ్ లార్డ్ పేర్కొన్నారు. టీసీఎస్, ఐబీఎమ్ ఒప్పందంతో ఐటీ వేగంగా వృద్ధి చెందుతుందని లార్డ్ అభిప్రాయపడ్డారు. క్లయింట్లకు, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు టీసీఎస్, ఐబీఎమ్ కలయిక ఉపయోగపడుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: నిరుద్యోగుల కోసం టీసీఎస్ శిక్షణ) -
రిజిస్ట్రేషన్ నుంచి నిర్వహణ దాకా..!
అపార్ట్మెంట్ సంఘాలకు వరం అప్నా కాంప్లెక్స్ ♦ 8,000 అపార్ట్మెంట్లలో.. 1.8 లక్షల ఫ్లాట్లకు సేవలు ♦ సంఘం ఏర్పాటు, మెయింటెనెన్స్, నెలవారీ చెల్లింపులు వంటివెన్నో.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెల తిరిగేసరికి బిల్లుల చెల్లింపు... విద్యుత్, డ్రైనేజీ వంటి సమస్యలు... ఇవన్నీ సొంతింటి యజమానులకే కష్టంగా ఉంటాయి. మరి వెయ్యికిపైగా ఫ్లాట్లుండే గేటెడ్ కమ్యూనిటీ పరిస్థితేంటి!? సంఘం సభ్యులందరినీ సమన్వయం చేసి ఇవన్నీ చేయటమంటే మాటలా!? అయితే వీటన్నిటికీ టెక్నాలజీతో సమాధానం చెబుతోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అప్నాకాంప్లెక్స్. నివాసితుల సంఘానికి వరంలాంటి అప్నాకాంప్లెక్స్ గురించి... సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజ్ శేఖర్ కొమ్ము ఏమంటారంటే... బెంగళూరులోని విప్రోలో 13 ఏళ్ల పాటు పనిచేసి ఇక్కడే 2010లో ఓ ఫ్లాట్ కొన్నాను. 250 ఫ్లాట్లుండే ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌కు ఫౌండర్ ప్రెసిడెంట్‌ని నేనే. విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ, పార్కు వంటి వసతుల నిర్వహణ సమస్యగా ఉండేది. నెలవారీ చెల్లింపులకు ప్రతి ఫ్లాట్‌కూ వెళ్లాల్సి వచ్చేది. ఓవైపు ఆఫీసు పనులతో బిజీ. మరో వైపు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బాధ్యతలు. ఒక దశలో అసలెందుకు ఫ్లాట్ కొన్నానా... అనిపించింది. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది... 250 ఫ్లాట్లున్న మా అపార్ట్మెంట్ నిర్వహణే ఇంత సమస్యగా మారితే.. వేల సంఖ్యలో ఉండే గేటెడ్ కమ్యూనిటీల పరిస్థితేంటా అని!! అపార్ట్మెంట్ నిర్వహణ కూడా టెక్నాలజీతో పనిచేసే సెల్ఫ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఉంటే బాగుంటుందనిపించింది. అంతే...! ఉద్యోగానికి స్వస్తి చెప్పి విప్రోలో సహోద్యోగి అయిన గోకుల్ సింగ్‌తో కలిసి రూ.5 లక్షల పెట్టుబడితో 2010 ఆగస్టులో అప్నాకాంప్లెక్స్.కామ్‌ను ప్రారంభించాం. మేం ప్రధానంగా ఐదు రకాల సేవలందిస్తాం అకౌంటింగ్ ఫ్లాట్‌ఫాం: నివాసితుల సంఘానికి ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఇస్తాం. దీన్లో సంఘం సభ్యుల సమాచారం, సంఘం బ్యాంకు ఖాతా వివరాలు, ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం, గృహ యజమానులు, వారి ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు ఉంటాయి. నెలవారీ చెల్లింపుల గడువు రాగానే క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రతి ఫ్లాట్‌వాసులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో సమాచారం అందుతుంది. వెంటనే వారు గృహ యజమానులు సంఘం పోర్టల్‌లోకి లాగిన్ అయి సంఘం బ్యాంక్ ఖాతాలో జమ చేయొచ్చు. హెల్ప్ డెస్క్: గేటెడ్ కమ్యూనిటీలో విద్యుత్, మంచీరు, డ్రైనేజీ, లిఫ్టుల నిర్వహణకు సంఘం తరపున ప్రత్యేకంగా ఉద్యోగులుంటారు. ఫ్లాట్‌వాసులకు వీటిల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా అప్నాకాంప్లెక్స్ వెంటనే సంబంధిత ఉద్యోగులకు నేరుగా సమాచారాన్నిస్తుంది. సంఘానికి కంప్లయింట్ చేయడం, వారు స్పందించడం వంటివేవీ అక్కర్లేదు. కమ్యూనికేషన్ కొలాబిరేషన్: ప్రతి సంఘం ఎంఓఏ (సంఘం పేరు, చిరునామా, కార్యవర్గ సభ్యుల పూర్తి వివరాలుంటాయిందులో), సంఘం నిబంధనలు (బైలాస్), నెలవారీ సమావేశాలు, కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, అపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చిన వారి వివరాలతో పాటుగా సంఘం ఖాతాలోని సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు వంటి సమస్త సమాచారం ఎప్పటికప్పుడు సంఘం వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. ఫ్లాట్వాసులందరికీ ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో వెళుతుంది కూడా. గేట్ కీపర్: అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం వద్ద ఉండే సెక్యూరిటీ గార్డ్ దగ్గర ట్యాబ్లెట్ పీసీ ఉంటుంది. దీన్లో అపార్ట్మెంట్ వాసుల వివరాలుంటాయి. ఎవరైనా ఫ్లాట్వాసులను కలిసేందుకు వచ్చినప్పుడు వారి వివరాలను, ఫొటోలను సంబంధిత ఫ్లాట్ వాసులకు చేరవేస్తుంది. వారు సరే అంటే వచ్చినవారిని లోనికి రానిస్తారు. ఇది ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది. కలెక్షన్ గేట్‌వే: నెలవారీ చెల్లింపుల కోసం వెబ్‌పోర్టల్‌లోకి లాగిన్ అయి చెల్లించటం ఇష్టంలేని వారికోసం ప్రత్యేకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. ఎలాంటి కమీషన్ లేకుండా నేరుగా ఫ్లాట్‌వాసుల బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నెలవారీ చెల్లింపులు సంఘం ఖాతాలో జమ అవుతాయి. ఇందుకోసం యస్ బ్యాంక్, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఫ్లాట్‌కు నెలకు రూ.19 చార్జీ మా సేవలకు నెలకు ప్రతి ఫ్లాట్‌కు రూ.19 చెల్లిస్తే చాలు. దేశంలో 80కి పైగా నగరాల్లో 8,000 అపార్ట్మెంట్లలో దాదాపు 1.8 లక్షల ఫ్లాట్లకు సేవలందిస్తున్నాం. అప్నా మొత్తం వ్యాపారంలో బెంగళూరు వాటా 28%, హైదరాబాద్ 25, ఢిల్లీ 22గా ఉంది. అపర్ణా, రాంకీ, లోధా, సైబర్‌సిటీ, పుర్వాంకరా, శోభా, మంత్రి, ఒబేరాయ్, గోద్రెజ్ వంటి వందకు పైగా స్థిరాస్తి కంపెనీలు మా కస్టమర్లు. 8-10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ.. ఇప్పటివరకు సంస్థలో వ్యక్తిగత పెట్టుబడులే ఉన్నాయి. తొలిసారిగా 8-10 మిలియన్ డాలర్ల సమీకరణపై దృష్టిపెట్టాం. వెంచర్ క్యాప్టలిస్ట్ (వీసీ)లతో చర్చలు జరుపుతున్నాం. మూడేళ్లలో అప్నాకాంప్లెక్స్ కోటి ఫ్లాట్లకు సేవలందించటం, రూ.100 కోట్ల టర్నోవర్ సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నాం. -
క్లౌడ్, మొబైల్స్... నాణేనికి చెరోవైపు
న్యూయార్క్: మొబైల్, క్లౌడ్ టెక్నాలజీ అనేవి నాణేనికి రెండు పార్శ్వాల్లాంటివని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తద్వారా కంపెనీ భవిష్యత్తులో దేనిపై అత్యధికంగా దృష్టిసారించనుందనే సంకేతాలిచ్చారు. భారత్‌కు చెందిన సత్య... మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చేసిన బహిరంగ ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘క్లౌడ్, మొబైల్ అనేవి రెండూ విభిన్నమైనవని నేను భావించడం లేదు. ఒకే నాణేనికి ఇవి రెండు పార్శ్వాలు. మనం ఎక్కడున్నా సమాచారాన్ని(డేటా) తగినట్లుగా వాడుకోవడానికి క్లౌడ్ ఆవిర్భవించింది. క్లౌడ్ సదుపాయం లేని మొబైల్స్ కచ్చితంగా ఆనాసక్తికరంగానే ఉంటాయి. మొబైల్స్‌లో క్లౌడ్ లేకపోవడం అంటే కొంత పరిమితి కిందకు వస్తుంది. అదే మొబల్స్ లేకుండా క్లౌడ్ అనేది సామర్థ్యాన్ని వినియోగించుకోకపోవడం కిందే లెక్క. అందుకే ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందనేది నా అభిప్రాయం’ అని సత్య వ్యాఖ్యానించారు. ఒకచోట నిక్షిప్తంచేసిన సర్వర్లలోని ఫొటోలు, ఇతరత్రా డేటాను మనం ఎక్కడున్నాసరే మొబైల్స్, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను ఉపయోగించుకొని వాడుకునేలా(యాక్సెస్) వీలుకల్పించేదే క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీ. ప్రతి డివైజ్‌లో కూడా అత్యుత్తమ క్లౌడ్ కనెక్టివిటీని అందించడంపై మేం పూర్తిగా దృష్టికేంద్రీకరించామని కూడా నాదెళ్ల పేర్కొన్నారు. మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ ఇలా డివైజ్‌లు ఏవైనా సరే అవలీలగా కనెక్ట్ అయ్యేందుకు, సమాచారాన్ని పంచుకునేందుకు క్లౌడ్ దోహదం చేస్తుందని హైదరాబాదీ సత్య నాదెళ్ల వివరించారు. కౌడ్ ద్వారా ఈ డివైజ్‌లన్నీ జీవితంలో భాగమవుతున్నాయని, ప్రజలను అనుసంధానం చేస్తోందన్నారు. ట్యాబ్లెట్లు మరింత ఉపయోగకర, శక్తిమంతమైన డివైజ్‌లుగా మారేందుకు కూడా క్లౌడే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. యాపిల్ ట్యాబ్లెట్లకు ఆఫీస్ సూట్... యాపిల్ ఐప్యాడ్ ట్యాబ్లెట్ పీసీల కోసం రూపొందించిన ఆఫీస్ సూట్‌ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఆఫీస్ 375 సాఫ్ట్వేర్ సబ్స్క్రయిబర్లు తమ యాపిల్ ఐప్యాడ్లలో కూడా ఇకపై వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్‌లను వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మొబైల్ యాప్స్‌పై మైక్రోసాఫ్ట్ మరింత దృష్టిసారిస్తోందనడానికి ఇదే నిదర్శనం. యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఆఫీస్ యాప్స్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా, సీఈఓగా సత్య నాదెళ్ల ప్రవేశపెట్టిన తొలి ప్రధాన ప్రొడక్ట్‌గా ఇది నిలిచింది. అదేవిధంగా ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం ఉచిత ఆఫీస్ మొబైల్‌ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.