రిజిస్ట్రేషన్ నుంచి నిర్వహణ దాకా..! | From the management to the registration ..! | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ నుంచి నిర్వహణ దాకా..!

Published Sat, Oct 17 2015 4:50 PM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

రిజిస్ట్రేషన్ నుంచి నిర్వహణ దాకా..! - Sakshi

రిజిస్ట్రేషన్ నుంచి నిర్వహణ దాకా..!

అపార్ట్‌మెంట్ సంఘాలకు వరం అప్నా కాంప్లెక్స్


♦ 8,000 అపార్ట్‌మెంట్లలో.. 1.8 లక్షల ఫ్లాట్లకు సేవలు
♦ సంఘం ఏర్పాటు, మెయింటెనెన్స్, నెలవారీ చెల్లింపులు వంటివెన్నో..
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెల తిరిగేసరికి బిల్లుల చెల్లింపు... విద్యుత్, డ్రైనేజీ వంటి సమస్యలు... ఇవన్నీ సొంతింటి  యజమానులకే కష్టంగా ఉంటాయి. మరి వెయ్యికిపైగా ఫ్లాట్లుండే గేటెడ్ కమ్యూనిటీ పరిస్థితేంటి!? సంఘం సభ్యులందరినీ సమన్వయం చేసి ఇవన్నీ చేయటమంటే మాటలా!? అయితే వీటన్నిటికీ టెక్నాలజీతో సమాధానం చెబుతోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అప్నాకాంప్లెక్స్. నివాసితుల సంఘానికి వరంలాంటి అప్నాకాంప్లెక్స్ గురించి... సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజ్ శేఖర్ కొమ్ము ఏమంటారంటే...

 బెంగళూరులోని విప్రోలో 13 ఏళ్ల పాటు పనిచేసి ఇక్కడే 2010లో ఓ ఫ్లాట్ కొన్నాను. 250 ఫ్లాట్లుండే ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు ఫౌండర్ ప్రెసిడెంట్‌ని నేనే. విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ, పార్కు వంటి వసతుల నిర్వహణ సమస్యగా ఉండేది. నెలవారీ చెల్లింపులకు ప్రతి ఫ్లాట్‌కూ వెళ్లాల్సి వచ్చేది. ఓవైపు ఆఫీసు పనులతో బిజీ. మరో వైపు అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ బాధ్యతలు. ఒక దశలో అసలెందుకు ఫ్లాట్ కొన్నానా... అనిపించింది. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది... 250 ఫ్లాట్లున్న మా అపార్ట్‌మెంట్ నిర్వహణే ఇంత సమస్యగా మారితే.. వేల సంఖ్యలో ఉండే గేటెడ్ కమ్యూనిటీల పరిస్థితేంటా అని!! అపార్ట్‌మెంట్ నిర్వహణ కూడా టెక్నాలజీతో పనిచేసే సెల్ఫ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఉంటే బాగుంటుందనిపించింది. అంతే...! ఉద్యోగానికి స్వస్తి చెప్పి విప్రోలో సహోద్యోగి అయిన గోకుల్ సింగ్‌తో కలిసి రూ.5 లక్షల పెట్టుబడితో 2010 ఆగస్టులో అప్నాకాంప్లెక్స్.కామ్‌ను ప్రారంభించాం.

 మేం ప్రధానంగా ఐదు రకాల సేవలందిస్తాం
 అకౌంటింగ్ ఫ్లాట్‌ఫాం: నివాసితుల సంఘానికి ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఇస్తాం. దీన్లో సంఘం సభ్యుల సమాచారం, సంఘం బ్యాంకు ఖాతా వివరాలు, ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం, గృహ యజమానులు, వారి ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు ఉంటాయి. నెలవారీ చెల్లింపుల గడువు రాగానే క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రతి ఫ్లాట్‌వాసులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో సమాచారం అందుతుంది. వెంటనే వారు గృహ యజమానులు సంఘం పోర్టల్‌లోకి లాగిన్ అయి సంఘం బ్యాంక్ ఖాతాలో జమ చేయొచ్చు.

 హెల్ప్ డెస్క్: గేటెడ్ కమ్యూనిటీలో విద్యుత్, మంచీరు, డ్రైనేజీ, లిఫ్టుల నిర్వహణకు సంఘం తరపున ప్రత్యేకంగా ఉద్యోగులుంటారు. ఫ్లాట్‌వాసులకు వీటిల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా అప్నాకాంప్లెక్స్ వెంటనే సంబంధిత ఉద్యోగులకు నేరుగా సమాచారాన్నిస్తుంది. సంఘానికి కంప్లయింట్ చేయడం, వారు స్పందించడం వంటివేవీ అక్కర్లేదు.

 కమ్యూనికేషన్ కొలాబిరేషన్: ప్రతి సంఘం ఎంఓఏ (సంఘం పేరు, చిరునామా, కార్యవర్గ సభ్యుల పూర్తి వివరాలుంటాయిందులో), సంఘం నిబంధనలు (బైలాస్), నెలవారీ సమావేశాలు, కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, అపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా వచ్చిన వారి వివరాలతో పాటుగా సంఘం ఖాతాలోని సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు వంటి సమస్త సమాచారం ఎప్పటికప్పుడు సంఘం వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవుతుంది. ఫ్లాట్‌వాసులందరికీ ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో వెళుతుంది కూడా.

 గేట్ కీపర్: అపార్ట్‌మెంట్ ప్రధాన ద్వారం వద్ద ఉండే సెక్యూరిటీ గార్డ్ దగ్గర ట్యాబ్లెట్ పీసీ ఉంటుంది. దీన్లో అపార్ట్‌మెంట్ వాసుల వివరాలుంటాయి. ఎవరైనా ఫ్లాట్‌వాసులను కలిసేందుకు వచ్చినప్పుడు వారి వివరాలను, ఫొటోలను సంబంధిత ఫ్లాట్ వాసులకు చేరవేస్తుంది. వారు సరే అంటే వచ్చినవారిని లోనికి రానిస్తారు. ఇది ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది.

 కలెక్షన్ గేట్‌వే: నెలవారీ చెల్లింపుల కోసం వెబ్‌పోర్టల్‌లోకి లాగిన్ అయి చెల్లించటం ఇష్టంలేని వారికోసం ప్రత్యేకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. ఎలాంటి కమీషన్ లేకుండా నేరుగా ఫ్లాట్‌వాసుల బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నెలవారీ చెల్లింపులు సంఘం ఖాతాలో జమ అవుతాయి. ఇందుకోసం యస్ బ్యాంక్, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాం.

 ఫ్లాట్‌కు నెలకు రూ.19 చార్జీ
 మా సేవలకు నెలకు ప్రతి ఫ్లాట్‌కు రూ.19 చెల్లిస్తే చాలు. దేశంలో 80కి పైగా నగరాల్లో 8,000 అపార్ట్‌మెంట్లలో దాదాపు 1.8 లక్షల ఫ్లాట్లకు సేవలందిస్తున్నాం. అప్నా మొత్తం వ్యాపారంలో బెంగళూరు వాటా 28%, హైదరాబాద్ 25, ఢిల్లీ 22గా ఉంది. అపర్ణా, రాంకీ, లోధా, సైబర్‌సిటీ, పుర్వాంకరా, శోభా, మంత్రి, ఒబేరాయ్, గోద్రెజ్ వంటి వందకు పైగా స్థిరాస్తి కంపెనీలు మా కస్టమర్లు.
 
 8-10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ..
 ఇప్పటివరకు సంస్థలో వ్యక్తిగత పెట్టుబడులే ఉన్నాయి. తొలిసారిగా 8-10 మిలియన్ డాలర్ల సమీకరణపై దృష్టిపెట్టాం. వెంచర్ క్యాప్టలిస్ట్ (వీసీ)లతో చర్చలు జరుపుతున్నాం. మూడేళ్లలో అప్నాకాంప్లెక్స్ కోటి ఫ్లాట్లకు సేవలందించటం, రూ.100 కోట్ల టర్నోవర్ సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement