క్లౌడ్, మొబైల్స్... నాణేనికి చెరోవైపు
న్యూయార్క్: మొబైల్, క్లౌడ్ టెక్నాలజీ అనేవి నాణేనికి రెండు పార్శ్వాల్లాంటివని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తద్వారా కంపెనీ భవిష్యత్తులో దేనిపై అత్యధికంగా దృష్టిసారించనుందనే సంకేతాలిచ్చారు. భారత్‌కు చెందిన సత్య... మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చేసిన బహిరంగ ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘క్లౌడ్, మొబైల్ అనేవి రెండూ విభిన్నమైనవని నేను భావించడం లేదు. ఒకే నాణేనికి ఇవి రెండు పార్శ్వాలు.
మనం ఎక్కడున్నా సమాచారాన్ని(డేటా) తగినట్లుగా వాడుకోవడానికి క్లౌడ్ ఆవిర్భవించింది. క్లౌడ్ సదుపాయం లేని మొబైల్స్ కచ్చితంగా ఆనాసక్తికరంగానే ఉంటాయి. మొబైల్స్‌లో క్లౌడ్ లేకపోవడం అంటే కొంత పరిమితి కిందకు వస్తుంది. అదే మొబల్స్ లేకుండా క్లౌడ్ అనేది సామర్థ్యాన్ని వినియోగించుకోకపోవడం కిందే లెక్క. అందుకే ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందనేది నా అభిప్రాయం’ అని సత్య వ్యాఖ్యానించారు.
ఒకచోట నిక్షిప్తంచేసిన సర్వర్లలోని ఫొటోలు, ఇతరత్రా డేటాను మనం ఎక్కడున్నాసరే మొబైల్స్, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను ఉపయోగించుకొని వాడుకునేలా(యాక్సెస్) వీలుకల్పించేదే క్లౌడ్ నెట్‌వర్క్ టెక్నాలజీ. ప్రతి డివైజ్‌లో కూడా అత్యుత్తమ క్లౌడ్ కనెక్టివిటీని అందించడంపై మేం పూర్తిగా దృష్టికేంద్రీకరించామని కూడా నాదెళ్ల పేర్కొన్నారు. మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ ఇలా డివైజ్‌లు ఏవైనా సరే అవలీలగా కనెక్ట్ అయ్యేందుకు, సమాచారాన్ని పంచుకునేందుకు క్లౌడ్ దోహదం చేస్తుందని హైదరాబాదీ సత్య నాదెళ్ల వివరించారు. కౌడ్ ద్వారా ఈ డివైజ్‌లన్నీ జీవితంలో భాగమవుతున్నాయని, ప్రజలను అనుసంధానం చేస్తోందన్నారు. ట్యాబ్లెట్లు మరింత ఉపయోగకర, శక్తిమంతమైన డివైజ్‌లుగా మారేందుకు కూడా క్లౌడే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
యాపిల్ ట్యాబ్లెట్లకు ఆఫీస్ సూట్...
యాపిల్ ఐప్యాడ్ ట్యాబ్లెట్ పీసీల కోసం రూపొందించిన ఆఫీస్ సూట్‌ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఆఫీస్ 375 సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రయిబర్లు తమ యాపిల్ ఐప్యాడ్‌లలో కూడా ఇకపై వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్‌లను వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మొబైల్ యాప్స్‌పై మైక్రోసాఫ్ట్ మరింత దృష్టిసారిస్తోందనడానికి ఇదే నిదర్శనం. యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఆఫీస్ యాప్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా, సీఈఓగా సత్య నాదెళ్ల ప్రవేశపెట్టిన తొలి ప్రధాన ప్రొడక్ట్‌గా ఇది నిలిచింది. అదేవిధంగా ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఉచిత ఆఫీస్ మొబైల్‌ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.