
మానవతను పెంపొందించే పరిజ్ఞానం అవసరం
మానవతను పెంపొందించే గౌరవప్రదమైన పరిజ్ఞానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
శాన్‌ఫ్రాన్సిస్కో: మానవతను పెంపొందించే గౌరవప్రదమైన పరిజ్ఞానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ యాన్యువల్ బిల్డ్ 2016 కాన్ఫరెన్స్ బుధవారం ఇక్కడ జరిగింది. ఇందులో వేలాదిమంది డెవలపర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో కంప్యూటర్లు మనిషి భాషలను నేర్వగలవని, మనుషులతో మాట్లాడగలవని అన్నారు.
అయితే మనిషికి వ్యతిరేకంగా నిలిచే కంప్యూటర్లను కాకుండా మనిషితో పనిచేసే కంప్యూటర్లను తయారుచేయాలని అన్నారు. మనిషి సామర్థ్యాలను, అనుభవాన్ని మరింత పెంపొందించే పరిజ్ఞానాన్ని రూపొందించాలన్నారు. డెవలపర్లంతా తమ మేధస్సును ఉపయోగించి అప్లికేషన్లు రూపొందించాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఇది సమాజ పురోగమనానికి తోడ్పడుతుందన్నారు.