రౌడీ మామూళ్లు
- సీఎం సభ పేరుతో దోపిడీ
- ఒక్కో రేషన్ డీలర్ నుంచి రూ.1500 వసూలు
- లబోదిబోమంటున్న బాధితులు
శింగనమల : అధికారపార్టీ నేతలు ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. దోచుకునేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చే సేకుంటున్న తమ్ముళ్లు..సొంత పార్టీ నేతలను కూడా వదలడం లేదు. తాజాగా శింగనమల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను కూడా పచ్చపార్టీ నేతలు క్యాష్ చేసుకున్నారు. సీఎం సభ నిర్వహణ ఖర్చు పేరుతో నియోజకవర్గంలోని చౌక డిపోల డీలర్లతో ఒక్కొక్కరితో రూ. 1,500 మేర వసూలు చేశారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా 258 చౌకధాన్యపు దుకాణాల నుంచి రూ.3.80 లక్షలు దండుకున్నారు. ఈ డబ్బు వసూళ్లకు అధికారులనే వాడుకోవడం గమనార్హం.
భోజనం పేరుతో మింగేశారు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడికి వచ్చే వారికి భోజనానికి అయ్యే ఖర్చును తెలుగు తమ్ముళ్లు ఆయా రెవెన్యూ అధికారులపై వేసేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు ఆ బాధ్యతను నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న డీలర్లకు అంటగట్టారు. ఇందులో భాగంగానే వసూళ్లకు తెరలేపారు. శింగనమలలో 45, బుక్కరాయసముద్రంలో 50, గార్లదిన్నెలో 40, నార్పలలో 52, పుట్లూరులో 37, యల్లనూరులో 34 డిపోలున్నాయి. సీఎం సభ కోసం ప్రతి ఒక్క డీలర్ కచ్చితంగా రూ.1,500 ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే శింగనమల మండలంలో 45 డిపో డీలర్ల నుంచి డబ్బును ముక్కుపిండి వసూలు చేశారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
లబోదిబోమంటున్న డీలర్లు
ఈ నెలలోనే తూనికలు కొలతల శాఖ అధికారులు వచ్చి తూకాలకు చెందిన కాటాలకు రూ.900 వరకు వసూలు చేశారనీ, తాజాగాS సీఎం సభ ఖర్చు పేరుతో రూ.1,500 వసూళ్లు చేస్తున్నారని డీలర్లంతా వాపోతున్నారు. టీడీపీకి చెందిన కొందరు డీలర్లు కూడా రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్టజెబుతూనే ఉన్నామనీ... కొత్త సీఎం సభ పేరుతో దోచేయడమేంటని మండిపడుతున్నారు. వీళ్ల దందాతో చస్తున్నామనీ.. దీనికన్నా డీలర్షిప్ వదులుకోవడమే మేలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వసూళ్ల పర్వంపై తహశీల్దార్ల వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఏ అధికారీ అందుబాటులోకి రాలేదు.