దద్దరిల్లిన కలెక్టరేట్
వైఎస్ఆర్ సీపీ ధర్నాతో గురువారం కలెక్టరేట్ దద్దరిల్లింది. రైతులు, పార్టీ నేతలు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులతో ఆ పరిసరాలు నిండిపోయాయి. నేతల ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన లభించింది. జై..జగన్ నినాదాలు మిన్నంటాయి. చంద్రబాబు పేరు ఎత్తగానే రైతులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.
- వైఎస్ఆర్ సీపీ ధర్నాకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం
- నేతల ప్రసంగాలకు అపూర్వ స్పందన
- జై జగన్ నినాదాలతో మార్మోగిన కలెక్టరేట్ ప్రాంగణం
- బాబు పేరు ఎత్తగానే అసహనం వ్యక్తం చేసిన అన్నదాతలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు ఏడాది పాలన, మోసాలను ఎండగడుతూ ఆ పార్టీనేతలు గురువారం చేపట్టిన చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధర్నానుద్దేశించి నేతలు చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నిరసన కార్యక్రమం జరిగిన తీరును ఇంటెలిజెన్స్ వర్గాలు ఆసక్తిగా ఆరా తీశాయి. సభ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆధ్వర్యంలో సాగింది. అందరి నేతలను సమన్వయం చేసుకుంటూ సభను చక్కగా నడిపారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగం సభికుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.
ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఈలలు, కేకలు వేస్తూ తమ మద్దతు తెలిపారు. ఆయన చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తనదైన శైలిలో భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపింది. బాబు మోసాలను తనదైన శైలిలో ఎండగట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన ప్రసంగం సభికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. బాబుపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల మన్ననలను పొందారు. ఈయన ప్రసంగం ధర్నాకు వచ్చిన ప్రజల్లో కొత్త ఊపునిచ్చింది. మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి బాబు పాలనలో రైతుల పరిస్థితి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పూసగుచ్చినట్లు వివరించారు.
పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి టీడీపీలో అబద్ధాలు ఎలా చెప్పాలో తర్ఫీదు ఇస్తారని, గతంలో తాను ఆ పార్టీలో ఉన్నందున అనుభవపూర్వంకగా చెబుతున్నప్పుడు ‘అవును... అవును’ అంటూ ప్రజలు తమ మద్దతును తెలిపారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ చంద్రన్న ఏడాది పాలనలో ప్రజలు ఏవిధంగా నష్టపోయారో కూలంకషంగా వివరించారు. మైనారిటీ అధ్యక్షుడు ఖాద్రీ చేసిన ప్రసంగం సైతం ముస్లిం సోదరులను ఆకట్టుకుంది.
సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తలు ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తమదైన శైలిలో స్థానిక అంశాలపై ప్రసంగాలు చేసి ఆకట్టుకున్నారు. సభ ఉదయం10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటవరకు సాగింది. అయినా కూర్చున్నవారు కూర్చున్నట్లే కదలకుండా ఆసక్తిగా నేతల ప్రసంగాలను విన్నారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. కలెక్టరేట్ పరిసరాల్లో సభ జరిగిన తీరును చూసి ఉద్యోగులు, సామాన్య ప్రజలు సైతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చర్చించుకోవడం కన్పించింది.