ఇక పకడ్బందీగా పీడీఎస్
హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసే సరుకుల దుర్వినియోగానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో అడ్డుకట్టపడుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఆయన పౌర సరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఇందులో ఏర్పాటు చేసిన 210 అంగుళాల వెడల్పు, 72 అంగుళాల ఎత్తు ఉన్న భారీ వీడియో వాల్‌ను ఆయన ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వీడియో వాల్ అని తెలిపారు. ఈ కేంద్రంలో ఉండే అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం వాహనాల కదలికలను గోదాముల నుంచి ప్రారంభమై రేషన్ దుకాణాలకు చేరేదాకా పరిశీలించే వీలుంటుంది.
భవిష్యత్తులో ఇలాంటి వీడియో విధానాన్ని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టరేట్లలో అందుబాటులోకి తేనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రేషన్ సరుకులను సరఫరా చేసే వాహనాల్లో జీపీఎస్ సిస్టంను, గోదాముల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ చేసే 1383 వాహనాలను, 46 కిరోసిన్ ట్యాంకర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రేషన్‌కార్డు దారులకు సరుకులు సక్రమంగా అందేలా చర్యలను తీసుకుంటామన్నారు. త్వరలోనే మొత్తం 17,500 స్వైపింగ్ మెషిన్లను పౌరసరఫరాల దుకాణాల్లో అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. శాఖ పనితీరును మెరుగు పర్చటం, దళారుల జోక్యం నివారించటానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు చీఫ్ సెక్రటరీ ఎస్.పి.సింగ్ తెలిపారు.