దేవదాయశాఖలో రచ్చకెక్కిన విభేదాలు
Conflicts In AP Endowment Department Officials మహారాణిపేట (విశాఖ దక్షిణ): దేవదాయశాఖలో ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఒక అధికారి మీద మరో అధికారిణి ఇసుక పోయడం సంచలనం కలిగించింది. విశాఖపట్నంలోని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఇ.పుష్పవర్ధన్ గురువారం కార్యాలయంలో విధుల్లో ఉండగా సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుక పోశారు. దేవదాయశాఖ హుండీల ఆదాయం లె క్కింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెం డ్ చేయడంతోపాటు భూముల స్వాధీనం విషయంలో వీరిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పై ఘటన చోటుచేసుకుంది.
ఈ విషయమై దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు డీసీ పుష్పవర్ధన్ చెప్పా రు. ఏసీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు. డీసీ తనను మానసికంగా వేధించారని, ఒక స్త్రీగా తాను ఇంతకుమించి ఏమీ చేయలేనని ఏసీ శాంతి విలపిస్తూ మీడియాకు తెలిపారు.పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించి, వాటి ఆధారంగా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇదీ నేపథ్యం..
జూన్ 23న దేవదాయశాఖ ఉప కమిషనర్‌గా పుష్పవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. సింహాచలం భూముల జాబితా నుంచి కొన్ని భూములు మినహాయించిన ఘటన, మాన్సాస్ భూములపై విచారణ సంఘంలో ఆయన్ని కూడా ప్రభుత్వం నియమించింది. హుండీల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని జూలై 19న జ్ఞానాపురం శ్రీఎర్నిమాంబ దేవాలయం ఈవో, అనకాపల్లి ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరాజును ఆయన సస్పెండ్ చేసి 34 చార్జ్‌లు నమోదు చేశారు. అనంతరం జూలై 28న విశాఖ అర్బన్ ఇన్స్పెక్టర్, పలు ఆలయాల ఈవో మంగి పూడి శ్రీధర్‌ను ఏసీ కె.శాంతి సస్పెండ్ చేసి 31 చార్జ్‌లు నమోదు చేశారు. డీసీ చర్యకు ప్రతిచర్యగానే ఏసీ వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాదం నెలకొంది.