మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడిన విద్యార్థి
బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడిన ఓ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన కనకపుడి జీవన్‌కుమార్ తాజాగా ఇంటర్ బైపీసీ పరీక్షలు రాస్తున్నాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగ ళవారం ఆయన ఫిజిక్స్ పరీక్ష రాస్తూ కాపీ కొడు తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తించింది.
మాల్ ప్రాక్టీస్ కింద డీబార్ చేయడంతో జీవన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల కాళ్లపై పడి వేడుకున్నా పట్టించు కోలేదని మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా స్నేహితుడికి సమాచారం ఇచ్చి ఇంట్లో ఉరి పెట్టుకున్నాడు. వెంటనే స్నేహితుడు వెళ్లి ఇరుగుపొరుగు వారి సహాయంతో జీవన్‌ను రక్షించి 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించాడు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కరోనాతో చదువులు సక్రమంగా జరగలేదని, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల కాళ్లపై పడి జీవన్ వేడుకున్నా కరుణించలేదని, తమ కుమారుడు చనిపోతే అధికారులే బాధ్యత వహిం చాలని ఆయన తల్లిదండ్రులు కనకపుడి సుందర మ్మ, పుల్లయ్య కన్నీరుమున్నీరుగా రోదించారు.