కౌంటింగ్ కేంద్రాల్లో అగచాట్లు
చాగల్లు/కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ విధులకు హాజరైన సిబ్బందికి అగచాట్లు తప్పలేదు. అభ్యర్థులు, ఏజెంట్లు సైతం అవస్థలు పడ్డారు. కౌంటింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలోని 9 మండలాల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తణుకులోని ఆకుల శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లిన అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు పడరానిపాట్లు పడ్డారు. కౌంటింగ్ కేంద్రం ప్రాంగణంలోకి వాటర్ బాటిల్స్‌ను కూడా అనుమంతించలేదు.
కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయకపోవడంతో మంచినీళ్ల కోసం కటకటలాడారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మంచినీళ్ల కోసం అక్కడి వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యూరు. పరిసర మండలాల నుంచి ఉదయం 6గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి రావడంతో సిబ్బందితోపాటు ఏజెంట్లు, అభ్యర్థులు ముందురోజే తణుకు చేరుకుని లాడ్జిలు, హోటళ్లలో బసచేశారు.
ఆహారం కౌంటింగ్ సిబ్బందికి సకాలంలో అందకపోవడంతో ఇబ్బందు లు పడ్డారు. దీంతో పలుచోట్ల మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సుమారు గంటకు పైగా కౌంటింగ్ నిలిచిపోయింది. రాత్రి 8గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కౌంటింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్ సౌకర్యం ఉన్నా సకాలంలో స్టార్ట్ చేయకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.