అపశ్రుతి
సాక్షి,సిటీబ్యూరో/గోల్కొండ: నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల పథకం(ఎస్సార్డీపీ)లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. షేక్‌పేట ఓయూ కాలనీ వద్ద జరుగుతున్న పనుల్లో క్రేన్‌తో గర్డర్లను పైకి ఎత్తుతుండగా రోడ్డు కుంగిపోయి భారీ క్రేన్ తిరగబడింది. ఈ ఘటనలో క్రేన్ ఆపరేటర్, పంజాబ్‌కుచెందిన గురుప్రీత్ సింగ్(45) క్యాబిన్ నుంచి దూకేయగా.. క్రేన్ కౌంటర్ వెయిట్లు అతడిమీదపడి అక్కడికక్కడే మృతిచెందాడు.మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 800 టన్నుల సామర్థ్యం గల భారీక్రేన్ బోల్తాపడటంతో ఆ ప్రాంతంలోట్రాఫిక్ నిలిచిపోయింది.
గర్డర్ అమర్చుతుండగా ప్రమాదం
పనుల్లో భాగంగా రెండు స్పాన్లపై (పిల్లర్ల మధ్య ఖాళీ స్థలంలో) (పిల్లర్ నెంబర్ 24–25 మధ్య) గర్డర్‌ను ఏర్పాటు చేస్తుండగా క్రేన్ వెనక్కు జరిగింది. కిందనున్న బీటీరోడ్డు కుంగడంతో క్రేన్ ఇనుప బెల్టు భూమిలో కూరుకుపోయి అదుపుతప్పింది. పనిప్రదేశంలో ఉన్న ఇంజినీర్లు, కార్మికుల అరుపులతో ఆపరేటర్ భయంతో కిందకు దూకేయగా క్రేన్‌కు చెందిన కౌంటర్ వెయిట్లు మీద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు కుంగిపోవడం వల్లే క్రేన్ దిగబడిందని చెబుతుండగా, అక్కడున్న డ్రైనేజీ పైప్‌లైన్ మ్యాన్‌హోల్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ఓ అధికారి చెబుతున్నారు. పడిపోయిన క్రేన్‌ను సాయంత్రానికి సరిచేశారు. ఈ ప్రమాదంపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తూ.. ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ(పీఎంసీ) ఫ్లై ఓవర్ల పనులు పర్యవేక్షిస్తోదన్నారు. కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసు జారీ చేసి వివరణ అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని చీఫ్ ఇంజినీర్ శ్రీధర్తెలిపారు.
రూ.335 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణం
సెవెన్ టూంబ్స్(షేక్‌పేట) ఫిల్మ్‌నగర్ రోడ్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ల మీదుగా ఆరు లేన్లుగా నిర్మిస్తున్న 2.8 కి.మీ ఈ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.335 కోట్లు. దీనికోసం మొత్తం 73 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా 40కి పైగా పిల్లర్లకు పునాదుల పనులు పూర్తయ్యాయి. 38 పిల్లర్లు పూర్తయ్యాయి. 2035 నాటికి ఈ మార్గాల్లో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని సిగ్నల్స్ రహితంగా ప్రయాణం కొనసాగించేందుకు ఈ వంతెన నిర్మిస్తున్నారు. క్రేన్ ప్రమాదం నేపథ్యంలో ఈ ఫ్లై ఓవర్‌కు సంబంధించిన కొన్ని పిల్లర్లను తిరిగి నిర్మించాల్సి వస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని పిల్లర్, పియర్ క్యాప్ పటిష్టతలను పరీక్షించాలని, తర్వాత అక్కడ గర్డర్లు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ ఐఐటీ నిపుణులతో ఈ పరీక్షలు నిర్వహించే యోచన ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మిగతా స్పాన్ల వద్ద మాత్రం పనులు కొనసాగుతాయన్నారు.
మృతుడి కుటుంబానికి రూ.13 లక్షల పరిహారం
క్రేన్ ప్రమాదంలో మరణించిన క్రేన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ కుటుంబానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ రూ.13 లక్షల పరిహారం ప్రకటించారు. నగరంలో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన నిర్మాణాల సందర్భంగా కార్మికుల భద్రతకు పెద్దపీట వేశామని, అయినప్పటికీ దురదృష్టకర సంఘటనలో ఒకరు మరణించడం విచారకరమన్నారు. మృతుడి కుటుంబానికి రూ.6 లక్షల బీమా, కాంట్రాక్టర్ ద్వారా రూ.5 లక్షలతో పాటు మేయర్ నిధుల నుంచి మరో రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన దానకిశోర్
ప్రమాదం జరిగి ప్రాంతాన్ని మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ శ్రీధర్‌తో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ ప్రాజెక్ట్ పనుల్లో మొట్టమొదటి సారిగా ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని కమిషనర్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఎస్సార్డీపీ పనులతో పాటు అన్ని ఇంజినీరింగ్ పనుల్లో కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.