crops destroyed
-
లబోదిబోమంటున్న అన్నదాతలు
-
అమ్మో అమెరికా దోమ
అమలాపురం: ఖండాంతరాలు దాటి కడియపు లంకకు చేరుకున్న శత్రువు పచ్చని గోదారి జిల్లాలను పీల్చి పిప్పి చేస్తోంది. ఎటు చూసినా పచ్చని పైర్లు, పండ్ల తోటలు, నర్సరీలతో అలరారే ఉభయగోదావరి జిల్లాలు ఈ శత్రువు ధాటికి విలవిల్లాడుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి తమిళనాడులోని పొల్లాచ్చి.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు.. తరువాత కడియం నర్సరీలకు..అక్కడ నుంచి క్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది రూగోస్ వైట్ఫ్లై (వలయాకారపు తెల్లదోమ). తొలుత నర్సరీల్లోని మొక్కలకు.. తరువాత కొబ్బరి.. ఆయిల్ పామ్.. తాజాగా అరటి, మామిడి, జీడిమామిడి, సీతాఫలం, సపోటా, పనస..ఇలా అన్ని రకాల పంటలను ఆశించి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కేరళ, తమిళనాడు కొబ్బరి రైతులకు వలయాకార తెల్లదోమ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అక్కడ దిగుబడి 40 శాతం వరకు పడిపోయింది. పొల్లాచ్చి ప్రాంతంలో ఈ దోమ ఉధృతికి తోడు వర్షాలు లేక వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయి. మూడేళ్ల క్రితం దీని జాడ కనిపించినా ఇప్పటికీ ఉధృతి తగ్గలేదు. మన రాష్ట్రంలో రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు కేరళ నుంచి దిగుమతి చేసుకున్న కొబ్బరి మొక్కల ద్వారా ఇది వ్యాపించింది. తరువాత కడియం నర్సరీకి వ్యాపించింది. నర్సరీ మొక్కల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దీని ఉధృతి అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో కొబ్బరి 1.78 లక్షల ఎకరాల్లోను, ఆయిల్‌పామ్ 98 వేల ఎకరాలు, అరటి 74 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఇక కడియం, పరిసర ప్రాంతాల్లో 14 వేల 500 ఎకరాల్లో పూలు, పూలమొక్కలు, ఆర్నమెంట్ సాగు చేస్తున్నారు. దిగుబడిపై పెనుప్రభావం... కొబ్బరి, ఆయిల్ పామ్ దీర్ఘకాలిక పంటలు. అరటి కార్సి తోట పంట కావడం వల్ల మూడేళ్లపాటు రైతులకు ఆదాయాన్నిస్తోంది. ఈ పంటలను తెల్లదోమ ఆశించడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. నర్సరీ రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. గడచిన రెండేళ్లుగా తెల్లదోమ వల్ల సుమారు 30 శాతం విక్రయాలు తగ్గిపోయాయని నర్సరీ రైతులు చెబుతున్నారు. మొక్క ఆకుల దిగువు భాగాన్ని ఈ తెల్లదోమ అశిస్తోంది. ఇది వదిలే వ్యర్థం ఆకు ఎగువ భాగంలో దట్టమైన నల్లని పొర రూపంలో ఏర్పడుతోంది. దీనివల్ల ఆకుల ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగక చెట్లు బలహీనంగా మారి దిగుబడి పడిపోతోంది. వాతావరణంలో తేమ పెరిగే కొద్దీ ఇది శరవేగంగా విస్తరిస్తోంది. చేతులెత్తేసిన అధికారులు.. తెల్లదోమ నిర్మూలన విషయంలో ఉద్యాన శాఖ అధికారులు చేతులెత్తేశారు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దీన్ని నివారించేందుకు కొంతవరకు చర్యలు చేపట్టారు. గతంలో కడియం మొక్కలను గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా నిషేధించారు. తెల్లదోమను అరికట్టేందుకు ఎల్లోస్టిక్స్ (పసుపురంగు అట్టలు), ఎన్కార్సియా గ్వడెలోపే, ఎన్కార్సియా డిస్‌పెర్సా (బదినికలు), వేపనూనె మందులను అందించారు. డ్రోన్లను తీసుకు వచ్చి మందులు పిచికారీ చేయించారు. కేరళ, తమిళనాడు నుంచి తెల్లదోమ సోకిన మొక్కలు రాగా వాటిని గుర్తించి తగులబెట్టారు. తొలి ఆరు నెలల్లో దీని ఉధృతిని అరికట్టేందుకు కృషి చేసిన ఉద్యానశాఖ అధికారులు తరువాత కాలంలో అలసత్వం ప్రదర్శించారు. దీనికితోడు రైతులు సైతం సరైన చర్యలు చేపట్టలేదు. దీంతో దీని ఉధృతి క్రమేపీ తీవ్రమవుతోంది. అన్ని ప్రాంతాల్లోను కొబ్బరి, అరటి, ఆయిల్ పామ్ తోటలకు ఇది విస్తరిస్తోంది. ఇప్పటివరకు గోదావరి జిల్లాల కొబ్బరిలో 30 శాతం అంటే సుమారు 50 వేల ఎకరాలకు పైబడి ఈ వ్యాధి సోకిందని అంచనా. చాలాచోట్ల ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది మరింత విస్తరించే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని నిర్మూలనకు అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తాజాగా డ్రైకోక్రైసా ఆస్టర్ మిత్ర పురుగులను రైతులకు అందిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది. మిత్ర పురుగులతో ఎదుర్కొంటున్నాం... తెల్లదోమ ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. రసాయన మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల దీని ఉధృతి పెరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతి, మిత్ర పురుగులు వినియోగం ద్వారా చాలా వరకు దీన్ని అరికట్టే అవకాశముంది. ఎన్కార్సియా గ్వడెలోపే, డైకోక్రైసాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. – ఎన్.బి.వి.చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్టు, వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
వర్షార్పణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. కళ్లాల్లో, మార్కెట్ యార్డుల్లోని పంట ఉత్పత్తులు ధ్వంసమయ్యాయి. మిర్చి, సోయాబీన్, కందులు, వేరుశనగ వర్షానికి తడిసిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 14 మండలాల్లోని 104 గ్రామాల్లో వేసిన పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆయా జిల్లాల్లో 3,845 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలిపింది. 2,077 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక వెల్లడించింది. ప్రధానంగా 2,708 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిన్నది. మొక్కజొన్న పంటకు 679 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 220 ఎకరాల్లో వరి నీట మునిగింది. అయితే వ్యవసాయశాఖ నష్టాన్ని అంచనా వేయడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. ఈ కొద్దిపాటి దానికి ఎందుకు హంగామా అన్న ధోరణి ప్రదర్శిస్తుందన్న ఆరోపణలున్నాయి. అనధికారిక అంచనా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగి నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో 200 ఎకరాల సోయాబీన్, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న.. 100 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రైతులకు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. వరంగల్ రూరల్ జిల్లాలో 2,250 ఎకరాల్లో, భూపాలపల్లి జిల్లాలో వందలాది ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. లేత కంకులు విరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఏరిన మిర్చిని కళ్లాల్లో పెట్టిన రైతులకు మాత్రం ఈ వర్షాలు కడగండ్లు మిగిల్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొన్నిచోట్ల కళ్లాల్లోని మిర్చి వర్షం నీటిలో కొట్టుకుపోయింది. అలాగే మార్కెట్ యార్డుల్లో విక్రయానికి తీసుకువచ్చిన కందులు, వేరుశనగ కూడా తడిసిపోయాయి. కొన్నిచోట్ల కంది చేలు దెబ్బతిన్నట్లు, వర్షానికి కాయ రాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చివరితీతలో ఉన్న పత్తి కూడా ఈ వర్షానికి దెబ్బతిన్నది. నేడూరేపు పొడి వాతావరణం... హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. అయితే మంగళ, బుధవారాల్లో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా కొణిజర్లలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చండ్రుగొండలో 6 సెంటీమీటర్లు, ఆర్మూరు, డోర్నకల్, తల్లాడ, నల్లగొండ, దేవరకొండ, సూర్యాపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో పత్తి పూర్తిగా తడిసిపోయింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా పడిపోయాయి. సాధారణం కంటే రెండు నుంచి తొమ్మిది డిగ్రీల వరకు తగ్గిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి అటుఇటుగా నమోదయ్యాయి. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పలుచోట్ల జనం చలితో ఇబ్బందిపడ్డారు. నగరంపై పొగమంచు పంజా... రాజధానిపై మరో రెండురోజులపాటు పొగమంచు దుప్పటి కమ్మేసే అవకాశాలున్నట్లు బేగం పేటలోని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో గత మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైన విషయం విదితమే. అయితే ప్రస్తుతానికి అల్పపీడన ద్రోణి బలహీనపడినప్పటికీ మంగళ, బుధ వారాల్లో ఆగ్నే య, దక్షిణ దిశ నుంచి వీస్తున్న తేమ, వేడి గాలులతో తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై పొగమంచు దుప్పటి కమ్ముకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, చిన్నారులు, వృద్ధులు బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయన్నా రు. కాగా సోమవారం నగరంలో గరిష్టంగా 21.2, కనిష్టంగా 17.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 94 శాతం గా నమోదైంది. సాధారణం కంటే 9 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం, గాలిలో తేమ అనూహ్యంగా పెరగడంతో ప్రజలు చలితో ఇబ్బందిపడ్డారు. -
రాహుల్ సభ కోసం పంట ధ్వంసం
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ కోసం కర్ణాటకలో చేతికొచ్చిన పంటపొలాన్ని ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది. ఓ నిరుపేద రైతు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజోన్న పంటను రాహుల్ సభ కోసం కోతలు కోసే సమయానికి నరికివేసి ప్రాంగణం సిద్ధం చేశారు. విచిత్రమేమిటంటే కరువు కారణంగా పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి రాహుల్ ఈ సభను తలపెట్టారు. మధ్య కర్ణాటకలోని రానిబిన్నూర్ సమీపంలో నిర్వహించనున్న శనివారం ఈ సభ కోసం దాదాపు మూడు ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన ప్రదేశంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సభాప్రాంగణానికి సమీపంలో ఉన్న ఓ బక్క రైతు తన నాలుగు ఎకరాల పొలంలో పండించిన మొక్కజోన్న పంటను నరికేశారు. 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా ఈ చర్యకు ఒడిగట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయంలో తెలిసిందే. రాహుల్ సభ కోసం చేతికొచ్చిన పంటను ధ్వంసం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మొదట స్పందించిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ "రాహుల్ వచ్చిపోయే సభాప్రాంగణం కోసం ఒక బక్కరైతు తన విలువైన పంటపొలాన్ని కోల్పోయాడు' అని ట్వీట్ చేశారు. హెలికాప్టర్ ద్వారా కర్ణాటకకు చేరుకొని తొమ్మిది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి రాహుల్ ఆత్యహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అయితే తమకు ఇబ్బందికలుగని ప్రాంతాలలోనే రాహుల్ పాదయాత్ర సాగేవిధంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసినట్టు విమర్శలు వినవస్తున్నాయి. -
ఏనుగులను అడ్డుకొన్న గ్రామస్తులు
క్రిష్ణగిరి : వారం రోజులుగా పోడూరు అడవిలో మకాం వేసిన ఏనుగుల మంద విడిపోయాయి. మూడు ఏనుగులు విడిపోయి పోడూరు, అళియాళం, సుబ్బగిరి గ్రామాలపై పడి శుక్రవారం రాత్రి పంటలు ధ్వంసం చేశాయి. ఆగ్రహించిన గ్రామస్తులు మూడు ఏనుగులు దక్షిణపెన్నానదిలోకి చేరడంతో పెద్ద ఎత్తున నదిచుట్టూచేరి ఏనుగులను బయటకు రాకుండా అడ్డుకొన్నారు. ఏనుగులు గంటకుపైగా నీటిలోనే నిలిచిపోయాయి. అటవీశాఖ ఉద్యోగి మహేష్ సూళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అళియాళం వద్ద సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపారు. గ్రామస్థులకు, అటనీశాఖ ఉద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఏనుగులు విచ్చలవిడిగా పంటలు ధ్వంసం చేసినా పట్టించుకోవడం లేదని, మూడేళ్ల క్రితం రూ. 30 వేలు విలువ చేసే ఎద్దును ఏనుగు తొక్కి చంపినా ఇంతవరకు పరిహారం అందజేయలేదని, ముళువాయిలప్ప అనే రైతు ఏనుగు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నా ఇంతవరకు పరిహారం అందజేయలేదని, ఏనుగుల దాడులను అరికట్టేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని సుబ్బగిరి, అళియాళం, పోడూరు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అటవీశాఖ, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఏనుగులను తరిమేందుకు రైతులకు టార్చ్లైట్లు, టపాకాయలు అందించడంలేదని ఆరోపించారు. గ్రామాల వైపు ఏనుగులు కదలుతున్న సమయంలోఅటవీశాఖ ఉద్యోగులకు సమాచారం అందజేసినా సరైన సమయానికి స్పందించడం లేదని వాపోయారు. అళియాళం గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌పై అటవీ ఉద్యోగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు రైతులతో చర్చలు జరిపి గంట అనంతరం ఏనుగులను పోడూరు అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. -
డెంకణీకోటలో ఏనుగుల గుంపు
పారదోలడానికి ప్రత్యేక బృందాలు హొసూరు: డెంకణీకోట అటవీ ప్రాంతం లో వంద ఏనుగులు మూడు గుంపులుగా విడిపోయి అటవీ ప్రాంత గ్రామాల రైతుల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మూడు నెలలుగా ఏనుగులు హొసూరు, డెంకణీకోట తాలూకా ప్రజలకు భయాం దోళనలు కల్పిస్తున్నాయి. ఏనుగులను తరిమేందుకు అటవీ శాఖ అధికారులు ఎంతగానో ప్రయత్నించి, విఫలమయ్యా రు. కొద్ది రోజుల క్రితం హొసూరు తాలూ కా శ్యానమావు, పోడూరు, కామనదొడ్డి, రామాపురం, బీర్జేపల్లి తదితర ప్రాంతంలోని అడవిలో మకాం వేసిన ఏనుగులను అటవీ శాఖ అధికారులు డెంకణీకోట తాలూకా రాయకోట సమీపంలోని ఊడేదుర్గం అటవీ ప్రాంతానికి తరిమికొట్టా రు. శుక్రవారం రాత్రి అటవీ శాఖ ఉద్యోగుల తీవ్ర ప్రయత్నంతో డెంకణీకోట సమీపంలోని బేవనత్తం అటవీ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం లో వంద ఏనుగులు చేరాయి. అవి మూ డు గుంపులుగా విడిపోయి బేవనత్తం, మరగట్ట, తళి ప్రాంతాలలో సంచరిస్తూ అటవీ ప్రాంత గ్రామాల రైతులను భ యాందోళనలకు గురిచేస్తూ పంటపొలాల ను ధ్వంసం చేస్తున్నాయి. ఈ సంఘటన పై అటవీ శాఖ అధికార్లు చర్యలు తీసుకుని 40 మందితో ఏనుగులను కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అటవీ ప్రాంతానికి తరిమేందుకు ప్రయత్నాలు చేపడుతున్నా రు. అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఇత ర గ్రామాల వద్దకు కూలిపని, ఉద్యోగం తదితర పనులకెళ్లిన వారు ఏనుగుల భయంతో సాయంత్రం గ్రామాలకు చేరుకోలేక భయాందోళనకు గురవుతున్నారు. -
గ్రామంపై విరుచుకుపడ్డ ఏనుగులు: రైతు మృతి
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాడలి గ్రామంపై ఏనుగులు ఒక్కసారిగా ముకుమ్మడిగా దాడి చేశాయి. ఆ దాడిలో మురళి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల దాడితో గ్రామస్తులు ఇళ్లు వదిలి భయంతో పరుగులు తీశారు. దాంతో ఏనుగులు గ్రామమంతా కలియ దిరుగుతూ హల్చల్ సృష్టించాయి. పాడలి పరిసర ప్రాంతాలలోని పంటపోలాలన్ని పూర్తిగా నాశనమైనాయి. గ్రామస్తులు గ్రామంలోకి వచ్చేందుకు తీవ్రంగా భయపడుతున్నారు. ఏనుగులు గ్రామంలోకి దూసుకువచ్చి దాడి చేయడంతో గ్రామస్తులు సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. -
అనంతలో వైఎస్ఆర్సీపీపై తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన గర్వంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమణారెడ్డికి చెందిన రెండు వేల బొప్పాయి చెట్లను టీడీపీ కార్యకర్తలు నరికేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో చోటుచేసుకుంది. గతంలో కూడా తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు ఇలాగే అరాచకాలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై వ్యక్తిగతంగా దాడులు చేయడం, వాళ్ల ఆస్తులు ధ్వంసం చేయడం, పవిత్రమైన తిరుమల కొండపైకి తాగి వెళ్లి అక్కడి దుకాణాలను ధ్వంసం చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.