వారం రోజులుగా పోడూరు అడవిలో మకాం వేసిన ఏనుగుల మంద విడిపోయాయి. మూడు ఏనుగులు విడిపోయి పోడూరు, అళియాళం....
క్రిష్ణగిరి : వారం రోజులుగా పోడూరు అడవిలో మకాం వేసిన ఏనుగుల మంద విడిపోయాయి. మూడు ఏనుగులు విడిపోయి పోడూరు, అళియాళం, సుబ్బగిరి గ్రామాలపై పడి శుక్రవారం రాత్రి పంటలు ధ్వంసం చేశాయి. ఆగ్రహించిన గ్రామస్తులు మూడు ఏనుగులు దక్షిణపెన్నానదిలోకి చేరడంతో పెద్ద ఎత్తున నదిచుట్టూచేరి ఏనుగులను బయటకు రాకుండా అడ్డుకొన్నారు. ఏనుగులు గంటకుపైగా నీటిలోనే నిలిచిపోయాయి. అటవీశాఖ ఉద్యోగి మహేష్ సూళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అళియాళం వద్ద సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపారు.
గ్రామస్థులకు, అటనీశాఖ ఉద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఏనుగులు విచ్చలవిడిగా పంటలు ధ్వంసం చేసినా పట్టించుకోవడం లేదని, మూడేళ్ల క్రితం రూ. 30 వేలు విలువ చేసే ఎద్దును ఏనుగు తొక్కి చంపినా ఇంతవరకు పరిహారం అందజేయలేదని, ముళువాయిలప్ప అనే రైతు ఏనుగు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నా ఇంతవరకు పరిహారం అందజేయలేదని, ఏనుగుల దాడులను అరికట్టేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని సుబ్బగిరి, అళియాళం, పోడూరు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అటవీశాఖ, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
ఏనుగులను తరిమేందుకు రైతులకు టార్చ్‌లైట్లు, టపాకాయలు అందించడంలేదని ఆరోపించారు. గ్రామాల వైపు ఏనుగులు కదలుతున్న సమయంలోఅటవీశాఖ ఉద్యోగులకు సమాచారం అందజేసినా సరైన సమయానికి స్పందించడం లేదని వాపోయారు. అళియాళం గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌పై అటవీ ఉద్యోగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు రైతులతో చర్చలు జరిపి గంట అనంతరం ఏనుగులను పోడూరు అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.