Cruise tourists
-
సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం..
డెన్మార్క్: అంబాసిడర్ లైన్ అనే బ్రిటీష్ నౌక ఫరో ద్వీప సందర్శన సందర్బంగా అందులోని ఒక బృందం వారి ప్రాచీన సంప్రదాయమని చెబుతూ 70కి పైగా తిమింగలాలను అత్యంత క్రూరంగా వేటాడి చంపేశారు. ఆ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అంబాసిడర్ నావికుడు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు. మనిషి కంటే క్రూరమైన జంతువు భూమ్మీద లేదు. దీన్ని నిజం చేస్తూ ఫరో ద్వీపాల్లో మనిషి అమానుషత్వం మరోసారి బయటపడింది. ఈ నెల 9న ఫరో ద్వీప రాజధాని టోర్శావ్న్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిండు సందర్శకులతో ఫరో ద్వీపాల సందర్శనకు బయలుదేరిన అంబాసిడర్ లైన్ అనే ఒక పెద్ద ఓడలోని కొందరు అనాగరికులు వందల ఏళ్ల నాటి సంప్రదాయమని చెబుతూ 70కి పైగా పెద్ద రెక్కలున్న తిమింగలాలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలా వేటాడిన తిమింగలాలను తినడం వారి సాంప్రదాయమట. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, వేటగాళ్ళ ఆకృత్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు భయభ్రాంతులకు గురైయ్యారని క్రూజ్ సిబ్బంది తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి తెలుకుసుకున్న సముద్ర సముద్రజీవుల పరిరక్షణ సంస్థ (ఓ.ఆర్.సి.ఏ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వేట సమయంలో ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఓడలో ఉన్నట్లు సమాచారం. ఓడ నావికుడు ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ తెలిపారు. ఇది కూడా చదవండి: 40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే.. -
క్రూయిజ్ టూరిజం మునక!
సాక్షి, విశాఖపట్నం: ‘పర్యాటకుల స్వర్గధామం విశాఖపట్నం.. ప్రకృతి రమణీయత విశాఖ సొంతం.. ఒకపక్క అందమైన సముద్రం.. మరోపక్క పచ్చని కొండలు..’ అంటూ విశాఖ వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవే మాటలు వల్లె వేస్తుంటారు. ఏ వేదికైనా, ఏ సందర్భమైనా ఆయన నోటినుంచి అలవోకగా ఇవే పలుకులు జాలువారుతాయి. కానీ వందల కోట్ల రూపాయల పర్యాటక ప్రాజెక్టులను ప్రకటించడం, ఆ తర్వాత వాటికి నిధులు విడుదల చేయకుండా వదిలేయడం మాత్రం రివాజుగా మారింది. ఆ కోవలోకే వస్తోంది విశాఖ క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టు! పర్యాటకులను ఆకర్షించాలని... దేశ, విదేశాల నుంచి విశాఖ వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం క్రూయిజ్ టూరిజాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. రూ.300 కోట్లు వెచ్చించి తొలిదశలో విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి, యారాడ బీచ్‌లకు చిన్నతరహా క్రూయిజ్లను నడపాలని ప్రతిపాదించింది. మలిదశలో కాకినాడ హోప్ ఐలాండ్, కళింగపట్నం బీచ్‌లకు వీటిని విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రూయిజ్‌ల్లో పర్యాటకులకు రెస్టారెంట్, డ్రింకులు, మ్యూజిక్, గేమ్స్ వంటివి అందుబాటులో ఉంచుతారు. ఇలా పగటి పూట ఈ క్రూయిజ్‌లో సాగరంలోని అలల మధ్య విహరించేలా ప్రాజెక్టును సిద్ధం చేశారు. ఇలా ఫిషింగ్ హార్బర్, యారాడ, భీమిలిలో క్రూయిజ్‌ల కోసం జెట్టీలు నిర్మించాలని భావించారు. క్రూయిజ్లను నడపడానికి ఆపరేటర్లను ఆహ్వానించడానికి సన్నద్ధమయ్యారు. పర్యాటకశాఖ అధికారులు కూడా ఇందుకు అవసరమైన ప్రక్రియకు నడుం బిగించారు. ఒక్క రూపాయీ విదల్చని ప్రభుత్వం విశాఖలో ఏ జాతీయ, అంతర్జాతీయ సదస్సు జరిగినా ఇతర టూరిజం ప్రాజెక్టులతోపాటు క్రూయిజ్ టూరిజాన్ని కూడా ఎంతో గొప్పగా చూపేవారు. ఇది విశాఖకు ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టుగా పేర్కొనేవారు. దీంతో ఎప్పటికప్పుడే నిధుల ఆవశ్యకత గురించి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తూ ఉన్నారు. కానీ రూ.300 కోట్ల ఈ ప్రాజెక్టుకు ఈ మూడేళ్లలో ప్రభుత్వం రూ.300లు కూడా కూడా విదల్చలేదు. దీంతో క్రూయిజ్ టూరిజం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ ప్రాజెక్టుపై పర్యాటకశాఖ అయినా చొరవ తీసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టు మునకేసినట్టేనని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ప్రగతికి సంబంధించి తన వద్ద సమాచారం లేదని పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకుడు రాధాకృష్ణమూర్తి ‘సాక్షి’తో చెప్పారు. మంగళవారం విజయవాడలో పర్యాటక శాఖపై వివిధ జిల్లాల అధికారులతో ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనైనా క్రూయిజ్ టూరిజంపై కదలిక ఉంటుందో? లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ముందు రప్పించింది... తర్వాత మెప్పించింది!
పర్యాటకులను ఆకర్షించడానికి ఫార్ములా వన్ రేసులే అవసరం లేదు... ఎద్దుల బండి పోటీలు చాలు.. కోట్లు ఖర్చుపెట్టి ఫార్ములా రేసులకు అనుగుణంగా ట్రాక్ నిర్మాణాలు, వాటికి అనుమతులు అవసరం లేదు... తట్టి లేపితే మన పల్లెటూళ్లే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వినోదాన్ని అందిస్తాయి... విహార యాత్రికులను ఆకట్టుకొంటాయి. ఈ దిశగానే ప్రయత్నించింది జార్ఖండ్ పర్యాటక శాఖ. ఒకవైపు ’ఫార్ములా వన్ సర్క్యూట్’లను ఏర్పాటు చేస్తూ.. కార్ల రేసుల ద్వారా అభివృద్ధి సాధించుకొన్నామని నిరూపించుకోవడానికి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఎద్దుల బండి పోటీలు నిర్వహించి, వాటికి జాతీయ స్థాయిలో ప్రచారం తీసుకురావడానికి ప్రయత్నించడం అంటే అది విశేషమైన అంశం. అభినందించాల్సిన విషయం. జార్ఖండ్‌లోని సింగ్బమ్ జిల్లా ఘట్సిలాలో ఇటీవలే ఎద్దుల బండి పోటీలు నిర్వహించారు. ఇప్పటికీ ఎద్దుల బండి పోటీలు గ్రామీణ భారతంలో చాలా సాధారణమైన విషయాలే. అయితే ఈ పోటీల విషయంలో మాత్రం జార్ఖండ్ పర్యాటక శాఖ చొరవ చూపి... భారీఎత్తున నిర్వహణ ఏర్పాట్లు చేసింది. బాగా ప్రచారం చేసి వేలాదిమంది వీక్షకులను ఈ గ్రామానికి రప్పించగలిగింది. ఇక్కడ చుట్టుపక్కన ఉన్న 150 ఊళ్లు పర్యాటకులకు హాట్‌స్పాట్ లాంటివి. ప్రకృతి సహజంగా ఏర్పడిన అందాలు, స్థానిక ప్రత్యేకతను చాటే కళలు.. పర్యాటకులను ఆకట్టుకొంటాయి. ఎద్దుల బండి పోటీలను చూడటానికి వచ్చిన పర్యాటకులను ఆ గ్రామాలను చూపించి కట్టి పడేసేందుకు జార్ఖండ్ పర్యాటక శాఖ వ్యూహాన్ని రచించింది. అది విజయవంతం కావడంతో భారతదేశ గ్రామీణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇకపై ఇలాంటి ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి మన పల్లెటూళ్లలోనూ ఇలాంటి ప్రత్యేకతలున్నాయి.. మనకూ ప్రభుత్వాలున్నాయి.. మరి వారికి ఇంత ఓపిక ఉందా?